మాట తప్పితే తీవ్ర పరిణామాలు

ABN , First Publish Date - 2022-11-12T03:20:33+05:30 IST

రాజధాని అమరావతి ప్రాంతంలో నాలుగు వారాల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ ఉండదని కోర్టు ముందు ప్రభుత్వం

మాట తప్పితే తీవ్ర పరిణామాలు

కోర్టుకు హామీ ఇవ్వడమంటే పిల్లల ఆట కాదు: హైకోర్టు ధర్మాసనం

అభ్యంతరాల పరిశీలనకే 4 వారాలు పడుతుంది

తుది నోటిఫికేషన్‌ ఇచ్చేవరకు రాజధానిలో

ఇళ్ల పట్టాల పంపిణీ ప్రశ్నే ఉత్పన్నం కాదు

కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వండి

హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే నివేదన

ప్రభుత్వం తొందరపాటుకు దిగితే కోర్టుకు రండి.. రైతులతో బెంచ్‌

విచారణ ఈ నెల 23కి వాయిదా

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంతంలో నాలుగు వారాల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ ఉండదని కోర్టు ముందు ప్రభుత్వం, సీఆర్డీయే చెప్పిన తరువాత ఆ హామీ నుంచి వైదొలగలేరని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూస్తారని పేర్కొంది. కోర్టుకు హామీ ఇవ్వడమంటే స్కూలు పిల్లల ఆట కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజధాని ప్రాంతంలో రాజధానియేతరులకు ఇళ్లపట్టాలిచ్చేందుకు సీఆర్‌డీఏ చట్టానికి సవరణ చేయడం చట్ట విరుద్ధమని.. దానిని రద్దు చేయాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు మరో ఆరుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం పానకాలరెడ్డి, రైతు నందకిశోర్‌ వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చాయి.

తుది నోటిఫికేషన్‌ ఇచ్చాకే ఇళ్ల పట్టాలు

ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్డీయే స్టాండింగ్‌ కౌన్సిల్‌ కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇచ్చే నిమిత్తం మాస్టర్‌ ప్లాన్‌ను సవరించి ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు విషయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని, వాటిని పరిశీలించేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని నివేదించారు. ఆ తరువాత గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నెలల సమయం పడుతుందన్నారు. తుది నోటిఫికేషన్‌ ఇచ్చేవరకు ఇళ్లపట్టాల పంపిణీ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. భూసమీకరణ కింద ఇచ్చిన భూములపై సర్వహక్కులు ప్రభుత్వానికే ఉంటాయన్నారు. సీఆర్డీయే చట్టం ప్రకారం భూసమీకరణ కింద తీసుకున్న భూమిలో కనీసం 5శాతాన్ని ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించే అధికారం సీఆర్డీయేకి ఉందన్నారు.

మొత్తం 1,686 ఎకరాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అవకాశం ఉంటే, ప్రస్తుతం తాము 900 ఎకరాలను మాత్రమే అందుకు వినియోగిస్తున్నామన్నారు. ఇళ్లు నిర్మించి ఇవ్వాలా? లేక ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలా? అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్నారు. సీఆర్డీయే సవరణ చట్టం(యాక్ట్‌ 13/2022) ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరుతూ పిటిషనర్లు వేసిన అనుబంధ పిటిషన్లపై కౌంటర్లు వేసేందుకు అనుమతించాలని, వాటిని పరిశీలించిన తరువాత నిర్ణయాన్ని వెల్లడించాలని కోర్టును అభ్యర్థించారు. ధర్మాసనం కలగజేసుకుంటూ అనుబంధ పిటిషన్లపై కౌంటర్లు వేసేవరకు ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను (అభ్యంతరాల స్వీకరణ) అక్కడితో ఆపేయాలని ప్రతిపాదించింది. అయితే దానిపై ఏఏజీ అభ్యంతరం తెలిపారు. ఇప్పటికిప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.

ప్రక్రియపై స్టేటస్‌ కో విధించాలి: పిటిషనర్లు

పిటిషనర్ల తరఫున న్యాయవాదులు జ్యోతిరత్న అనుమోలు, కారుమంచి ఇంద్రనీల్‌బాబు స్పందిస్తూ... రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి ఇచ్చేవరకూ ప్రభుత్వం, సీఆర్డీయేకు 5శాతం భూములపై హక్కులు సంక్రమించవన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ సవరించడానికి వీల్లేదని త్రిసభ్య ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వం కౌంటర్‌ వేసేవరకు ప్రక్రియపై స్టేట స్‌కో విధించాలని కోరారు. మాస్టర్‌ ప్లాన్‌ సవరణ, ఇళ్ల పట్టాలు ఇవ్వడకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. 4వారాల పాటు మాస్టర్‌ ప్లాన్‌లో మార్పు, ఇళ్ల పట్టాల పంపిణీ ఉండబోదని ఏఏజీ కోర్టుకు ఇచ్చిన హామీని కోర్టు డాకెట్‌ ఆర్డర్‌లో ప్రస్తావించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ... ఏఏజీ, సీఆర్డీయే స్టాండింగ్‌ కౌన్సిల్‌ కోర్టుకు ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకొని అనుబంధ పిటిషన్లలో కౌంటర్‌ వేసేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 21లోగా కౌంటర్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 23కి వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈలోపు ప్రభుత్వం తొందరపాటు చర్యలు తీసుకొంటే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ టి.మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది.

ఆ 17 గ్రామాల్లోగ్రామసభలు నిర్వహించండి

రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలి: హైకోర్టు

రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించే నిమిత్తం మాస్టర్‌ ప్లాన్‌లో సవరణలు చేసే విషయంలో అభ్యంతరాలు తెలపాలని పంచాయితీ ప్రత్యేక అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్‌ చూస్తూ రాజధాని పరిధిలోని 17 గ్రామాల రైతులు శుక్రవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ డి. రమేశ్‌... ఈ నెల 12, 13 తేదీల్లో 17 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సీఆర్డీయే కమిషనర్‌ను, గ్రామ పంచాయితీల ప్రత్యేక అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌లో సవరణలు చేసే విషయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు గ్రామపంచాయితీల ప్రత్యేక అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ 17 గ్రామాలకు చెందిన రైతులు వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. మాస్టర్‌ ప్లాన్‌ సవరించేందుకు గ్రామసభలు జరిపి... చేసిన తీర్మానాలను సీఆర్డీయే కమిషనర్‌కు పంపేలా ప్రత్యేక అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పృధ్వీ వాదనలు వినిపించారు.

Updated Date - 2022-11-12T03:20:34+05:30 IST