కలెక్టర్‌ వచ్చినా.. ‘స్పందన’ కరవు

ABN , First Publish Date - 2022-03-05T06:18:17+05:30 IST

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున పాల్గొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గిరిజనుల నుంచి అర్జీలు రాలేదు.

కలెక్టర్‌ వచ్చినా.. ‘స్పందన’ కరవు
స్పందనలో వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ అరుణ్‌బాబు, పీవో గోపాలక్రిష్ణ


ఆశించిన స్థాయిలో అందని అర్జీలు 

పాడేరు, మార్చి 4: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున పాల్గొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గిరిజనుల నుంచి అర్జీలు రాలేదు. జిల్లా కలెక్టర్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే విషయాన్ని రెండు రోజుల ముందు మాత్రమే ఐటీడీఏ అధికారులు ప్రకటించడంతో గిరిజనులకు ఈ విషయం తెలియకపోవడం వల్లే అర్జీలు అందలేదని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. కనీసం వారం ముందు ఈ విషయమై ఐటీడీఏ అధికారులు ప్రచారం నిర్వహిస్తే స్పందన కార్యక్రమాన్ని గిరిజనులు వినియోగించుకునేవారనే వాదన బలంగా వినిపిస్తున్నది. 

పెదబయలు మండలం కుంతర్లలో జియో సెల్‌ టవర్‌ను ఏర్పాటు చేయాలని వై.సూరిబాబు, ఎ.బాలకృష్ణ, వి.చిన్నాబ్బాయి, వీరన్నపడాల్‌ కోరారు. రెండేళ్ల కిత్రం ఏజెన్సీకి కేంద్రం ప్రభుత్వం రూ.85 కోట్లతో మంజూరు చేసిన పసుపు ప్రాజెక్టును అమలు చేయాలని జాతీయ ఆదివాసుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గడుతూరి రాంగోపాల్‌ కోరారు. ఏజెన్సీలో 1/70, పెసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, హైవే నిర్మాణంలో గిరిజనులకు సంపూర్ణంగా నష్టపరిహారం అందించాలని, జీకేవీధి మండలంలోని నకిలీ ఎస్‌టీ సర్టిఫికెట్‌లను పొందిన వారిపై చర్యలు చేపట్టాలని, గిరిజనేతరులు అక్రమంగా నిర్మించిన భవనాలు, లాడ్జీలను గిరిజనులకు అప్పగించాలని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావుదొర వినతిపత్రం సమర్పించారు. గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ఆశా కార్యకర్తలుగా గుర్తించాలని ఆ సంఘం నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్త భవనంలో జిల్లా ఎస్‌పీ కార్యాలయం ఏర్పాటు యోచనను అధికారులు విరమించుకోవాలని డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఏబీవీపీ నేతలు కోరారు. ఇదే కార్యక్రమంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత సివిల్స్‌ కోచింగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్‌, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ అరుణ్‌బాబు,  ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ, డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు, డ్వామా పీడీ సందీప్‌, వ్యవసాయ శాఖ జేడీ లీలావతి, ఐసీడీఎస్‌ పీడీ సీతామహాలక్ష్మి, టీడబ్ల్యూ ఇన్‌చార్జి డీడీ ఎల్‌.రజని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


మన్యంలో రోడ్లకు కలెక్టర్‌ శంకుస్థాపన 


‘మిషన్‌ కనెక్ట్‌ పాడేరు’లో భాగంగా ఏజెన్సీలో రూ.9.07 కోట్లతో నిర్మించే రోడ్లకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున శుక్రవారం స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకంలో పాడేరు మండలం డి.గొందూరు-బొడ్డుమామిడి రోడ్డుకు, జి.మాడుగుల మండలం కుడ్డంగి జంక్షన్‌- మునికర్లతోగు  రోడ్డుకు, అనంతగిరి మండలం నిమ్మవూట-కర్రిగుడ రోడ్డుకు, డుంబ్రిగుడ మండలం పూలుగుడ-కరకవలస  రోడ్డుకు, జీకేవీధి మండలం పామురాయి-కొత్తపాలెం రోడ్డుకు, అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీలో గోస్తనీనదిపై వంతెన, కాకిమానువలస  సరవన్నపాలెం రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం.రాజు, జి.మాడుగుల జడ్పీటీసీ సభ్యురాలు ఎం.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.


 

Updated Date - 2022-03-05T06:18:17+05:30 IST