ఇతర కులాలను ఎస్టీల్లో చేర్చితే గిరిజనుల గొంతు కోసినట్టే!

ABN , First Publish Date - 2022-12-31T01:10:32+05:30 IST

గిరిజనులు అన్నిరంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయారని, వీరి (ఎస్టీ) జాబితాలోకి ఇతరులను చేర్చి, గిరిజనుల గొంతుకోయాలనే ఆలోచనను ప్రభుత్వాలు చేస్తుండడం దుర్మార్గమని ఆదివాసీ హక్కుల పరిరక్షణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ రామారావుదొర ఆరోపించారు.

ఇతర కులాలను ఎస్టీల్లో చేర్చితే  గిరిజనుల గొంతు కోసినట్టే!
ఆదివాసీ గర్జనలో చేతులు కలిపి సంఘీభావం ప్రకటిస్తున్న జేఏసీ, ఇతర సంఘాల నేతలు

ఆదివాసీలపై పాలకులకు సవతితల్లి ప్రేమ

జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావుదొర

ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులన్నీ గిరిజనులకే ఖర్చు చేయాలని డిమాండ్‌

పాడేరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గిరిజనులు అన్నిరంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయారని, వీరి (ఎస్టీ) జాబితాలోకి ఇతరులను చేర్చి, గిరిజనుల గొంతుకోయాలనే ఆలోచనను ప్రభుత్వాలు చేస్తుండడం దుర్మార్గమని ఆదివాసీ హక్కుల పరిరక్షణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ రామారావుదొర ఆరోపించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన ‘ఆదివాసీ గర్జన’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ఉన్న బోయవాల్మీకి, బెంతోరియా కులాలను గిరిజన తెగల్లో చేర్చితే, గిరిజనులకు భవిష్యత్తు ఉండదన్నారు. పాలకులకు ఆదివాసీలపై ఎటువంటి ప్రేమ లేదని, ప్రస్తుతం వాళ్లు చూపిస్తున్నది సవతి తల్లి ప్రేమ మాత్రమేనని పాలకులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ ఆదివాసీల సంక్షేమ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించడం లేదన్నారు. ఇప్పటికే ఆదివాసీల సహజ సంపదను దోచుకుంటున్న పాలకులు, ఆదివాసీలకు మనుగడ లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టినా, యర్రవరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మించినా ఆదివాసీలు అడవుల నుంచి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని రామారావుదొర ఆందోళన వ్యక్తం చేశారు. అనేక ఉద్యమాల ఫలితంగా షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజనులకు శత శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో నంబరు-3 రద్దుతో గిరిజనుల ఉనికికే ముప్పు వాటిల్లిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు శత శాతం రిజర్వేషన్‌ కల్పించే కొత్త చట్టాన్ని పాలకులు తీసుకురాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ కోసం కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిగా ఆదివాసీలకే ఖర్చు చేయాలన్నారు.

ఐదో షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీలో 1/70 చట్టం అమల్లో ఉండగానే ఇక్కడ గిరిజనేతరులకు ఇళ్ల పట్టాలనే ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, వాటిని ఉప సంహరించుకోవాలని రామారావుదొర డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో 1/70, పెసా, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఏజెన్సీలోని గిరిజనేతరులకు ఉన్న రకాల గుర్తింపు కార్డులను వారివారి స్వస్థలాలకు బదిలీ చేయాలన్నారు. నకిలీ ఎస్‌టీలపై చర్యలు చేపట్టాలని, హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా భూమినే ఇవ్వాలని, ఏజెన్సీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు సున్నం వెంకటరమణ, మీడావి నెహ్రూ, పీవీ.రమణ, దాట్ల నాగేశ్వరరావు, బోయపల్లి సింహాచలం, శ్యామల వరలక్ష్మి, సొనాయి గంగరాజు, రొబ్బా నాగభూషణరాజు, కిల్లో గంగన్నపడాల్‌, సీహెచ్‌.శ్రీనివాస్‌పడాల్‌, గిడ్డి వరలక్ష్మి, వి.కొండయ్య, నందు, కోడా సింహాద్రి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, టీడీపీ ఎస్‌టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర, జీసీసీ మాజీ చైర్మన్‌ ఎంవీఎస్‌.ప్రసాద్‌, రాష్ట్ర ఎస్‌టీ కమిషన్‌ సభ్యుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:10:34+05:30 IST