వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

ABN , First Publish Date - 2022-11-25T02:25:07+05:30 IST

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట ప్రకటన..

నా కొడుక్కి టికెట్‌ ఇస్తే అందరూ గెలిపించాలని వినతి

వనభోజనంలో చేసిన వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

కర్నూలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత సోమవారం ఎమ్మిగనూరులో ఉప్పర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వనభోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రకోట మాట్లాడుతూ.. ‘మా సీఎం జగన్‌ రాబోయే ఎన్నికల్లో నీవే పోటీ చేయాలని అంటే.. నా వయస్సు 83 సంవత్సరాలు. గుండె జబ్బు ఉంది. ఎక్కువ సేపు మాట్లాడలేను.. జనంలో తిరగలేను.. నేను పోటీ చేయలేనని చెప్పాను. నా కొడుక్కి (ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి) టికెట్‌ ఇచ్చే విషయంపై సర్వే చేస్తున్నామని ఆయన చెప్పారు. సర్వే రిపోర్టు కూడా వచ్చింది. నా కొడుక్కి టికెట్‌ వస్తే మీరంతా సహకరించాలి’ అని కోరారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 17న ఎమ్మిగనూరులో రోడ్‌షో నిర్వహించి తేరుబజారులో జరిగిన బాదుడే బాదుడు భారీ బహిరంగ సభలో ప్రసగించారు. ఈ సభకు జనం వెల్లువెత్తారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీచేయకూడదని ఎర్రకోట ప్రకటించడం గమనార్హం. ఈయన స్వగ్రామం ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

Updated Date - 2022-11-25T02:25:07+05:30 IST

Read more