విజయసాయిరెడ్డికి రాజకీయ అనుభవం తక్కువ అనుకుంటా...

ABN , First Publish Date - 2022-02-16T06:15:03+05:30 IST

‘విజయసాయిరెడ్డి కోటరీలో చెదపట్టింది. విజయసాయిరెడ్డి కళ్లు తెరిచి చూడాలి. రాజకీయ అనుభవం తక్కువ అనుకుంటా...’ అని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయసాయిరెడ్డికి రాజకీయ అనుభవం తక్కువ అనుకుంటా...
వాసుపల్లి గణేష్‌కుమార్‌

ఆయన కోటరీలో చెదపట్టింది...

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌


విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):


‘విజయసాయిరెడ్డి కోటరీలో చెదపట్టింది. విజయసాయిరెడ్డి కళ్లు తెరిచి చూడాలి. రాజకీయ అనుభవం తక్కువ అనుకుంటా...’ అని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వాసుపల్లి గణేష్‌కుమార్‌ 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత వైసీపీ పక్షాన చేరారు.  వాసుపల్లి సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. వచ్చే ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం టికెట్‌ తనదేనని ఒకరు ప్రచారం చేసుకుంటున్నారని, దీనిపై ఏమంటారని ఒక టీవీ చానల్‌ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి వాసుపల్లి స్పందిస్తూ కొంతమంది కావాలనే అలా ప్రచారం చేసుకుంటున్నారని కొట్టిపారేశారు. విశేష రాజకీయ అనుభవంతోపాటు మత్స్యకార కుటుంబానికి చెందిన తనను కాదనుకుని ఏ పార్టీ కూడా దాటివెళ్లే ప్రసక్తి ఉండదని ధీమా వ్యక్తంచేశారు. గత ఏడాది జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో కొంతమంది కార్పొరేటర్లుగా టికెట్లు ఆశించారని, కొందరికి ఆశాభంగం కలిగిందన్నారు. ‘టికెట్లు దక్కని వారిలో కొంత అసంతృప్తి ఉండడం సహజం, అలాంటి వారిని కలుపుకుని వెళ్లి చీరలు పంచేసి తర్వాత ఎమ్మెల్యేను నేనే అని చెప్పుకుంటున్నారు...చూద్దాం’ అని నిట్టూర్చారు. అక్కడితో ఆగకుండా ‘విజయసాయిరెడ్డి కోటరీలో చెదపట్టింది. విజయసాయిరెడ్డి కళ్లు తెరిచి చూడాలి. కానీ ఆయనకు రాజకీయ అనుభవం తక్కువ అనుకుంటా...’ అంటూ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయి. గతంలో విజయసాయిరెడ్డికి దీని గురించి చెప్పానని, ఆయన యాక్షన్‌ తీసుకోలేదన్నారు. లేకపోతే తానే నేరుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఈ విషయం మాట్లాడతానని వాసుపల్లి అన్నారు. 

Updated Date - 2022-02-16T06:15:03+05:30 IST