హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బంద్ రేపు
ABN , First Publish Date - 2022-12-16T01:00:10+05:30 IST
యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ నెల 17న చింతపల్లి సబ్ డివిజన్ బంద్ పాటించాలని అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. గురువారం స్థానిక గిరిజన భవన్లో వైసీపీ మినహా వివిధ పార్టీలు, సంఘాల నాయకులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్ మాట్లాడుతూ గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘించి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి యర్రవరం పీఎస్పీని కట్టబెడుతూ రాష్ట్ర కేబినెట్ సోమవారం తీర్మానించడం దారుణమన్నారు.
- కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో చేపట్టాలని అఖిల పక్ష నేతల పిలుపు
చింతపల్లి, డిసెంబరు 15: యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ నెల 17న చింతపల్లి సబ్ డివిజన్ బంద్ పాటించాలని అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. గురువారం స్థానిక గిరిజన భవన్లో వైసీపీ మినహా వివిధ పార్టీలు, సంఘాల నాయకులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్ మాట్లాడుతూ గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘించి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి యర్రవరం పీఎస్పీని కట్టబెడుతూ రాష్ట్ర కేబినెట్ సోమవారం తీర్మానించడం దారుణమన్నారు. తాము పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, కొయ్యూరు- చింతపల్లి సరిహద్దు ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు గ్రామాలను ఖాళీ చేయాల్సిన దుస్థితి ఏర్పడడం వల్లే వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు ఆరు వేల మంది గిరిజనులు నిరాశ్రయులు అవుతారన్నారు. ఆదివాసీలకు అన్యాయం చేసే యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు(పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణాలను అడ్డుకునేందుకు దశలవారీగా ఉద్యమాలను ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ముందుగా కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాల బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి ఉద్యమాలు చేపడతామన్నారు. నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాలను విరమించుకునే వరకు ఆందోళనలు విరమించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కిముడు లక్ష్మయ్య, మంగు, జస్వంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగిన కృష్ణపడాల్, సుందరరావు, గిరిజన వర్తక సంఘం అధ్యక్షుడు రమణ, విద్యార్థి సంఘం నాయకుడు రాజశేఖర్, సీపీఎం నాయకుడు సాగిన చిరంజీవి పాల్గొన్నారు.
బాక్సైట్ తరహాలో ఉద్యమం
పాడేరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఐక్యంగా చేపట్టిన ఉద్యమం తరహాలోనే హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాన్ని చేపడతామని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు. ఇక్కడ గురువారం నిర్వహించిన గిరిజన సంఘం జిల్లా కమిటీ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాల్లోని సంపదను కొల్లగొట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం యర్రవరం ప్రాంతంలోని పవర్‌ప్లాంట్‌ను ఆదానీకి అప్పగించాలనే యోచనలో ఉందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిందన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, బాక్సైట్ స్థాయిని మించి హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. గిరిజన ప్రాంత చట్టాలు, హక్కులను కాలరాసి, కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రాంతాన్ని కట్టబెట్టాలనే పాలకుల చర్యలను సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. ఇటీవల విశాఖపట్నం వచ్చిన మోదీ.. సీఎం జగన్‌కు ప్రత్యేకంగా చెప్పి పవర్‌ప్లాంట్‌ను ఆదానీకి అప్పగించేలా చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలకి లక్కు, నేతలు పృథ్వీరాజ్, రామన్న, శ్రీను, కోటేశ్వరరావు తదిరులు పాల్గొన్నారు.