హైవేలో ప్రయాణం హడల్‌!

ABN , First Publish Date - 2022-07-04T06:30:48+05:30 IST

అనకాపల్లి జాతీయ రహదారిలో ప్రయాణం అంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. పూడిమడకకు వెళ్లే జంక్షన్‌లో రహదారులు అత్యంత దారుణంగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనం బోల్తాపడి ప్రమాదాలకు గురికావడం తథ్యమని అంటున్నారు.

హైవేలో ప్రయాణం హడల్‌!
బైపాస్‌ జంక్షన్‌లో ఎలమంచిలి వైపు వెళ్లే రోడ్డు దెబ్బతిన్న దృశ్యం

  ఎక్కడికక్కడ దెబ్బతిన్న రహదారులు

 బైపాస్‌ జంక్షన్‌లో మరీదారుణం

రాళ్లు తేలడంతో వాహనచోదకుల అవస్థలు

నిత్యం ట్రాఫిక్‌ సమస్య - పట్టించుకోని అధికారులు

అనకాపల్లి టౌన్‌, జూలై 3 : అనకాపల్లి జాతీయ రహదారిలో ప్రయాణం అంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. పూడిమడకకు వెళ్లే జంక్షన్‌లో రహదారులు అత్యంత దారుణంగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనం బోల్తాపడి ప్రమాదాలకు గురికావడం తథ్యమని అంటున్నారు. జంక్షన్‌లోని వంతెన నిర్మాణంలో జాప్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రహదారి మీదుగా ఇటు ఒడిశా, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యం గల రహదారిలో బైపాస్‌ జంక్షన్‌ వద్ద రోడ్డు దెబ్బతిన్నా జాతీయ రహదారి నిర్వహణ విభాగం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎలమంచిలి వైపు రహదారి మరీదారుణం

ఎలమంచిలి వైపు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో పాటు రాళ్లు తేలడంతో వాహనచోదకుల్లో భయం నెలకొంది. అలాగే విశాఖ వైపు వెళ్లే మార్గంలో సగభాగం దెబ్బతిని వర్షపు నీరు చేరింది. జంక్షన్‌లో కూడా రోడ్డుకు గోతులు పడ్డాయి. ఎలమంచిలి వైపు వెళ్లే రహదారిని ట్రాఫిక్‌ సీఐ సీహెచ్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు పలు దఫాలు కంకర, క్రషర్‌బుగ్గితో జేసీబీ ద్వారా చదును చేయించినా వర్షాలకు యథాస్థితి నెలకొంటోంది.  రాళ్లుతేలిన రహదారిపై వాహనాలు ప్రయాణించేటప్పుడు టైర్ల అంచున పడిన రాళ్లు తుళ్లి పలువురు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అధికారులు ఏం చేస్తున్నట్టని పలువురు ప్రశ్నిస్తున్నారు.  కనీసం వంతెన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేయిస్తే కొంతవరకు బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

 నిత్యం ట్రాఫిక్‌ సమస్య 

ఇదిలావుంటే, రెండు వైపులా బైపాస్‌ జంక్షన్‌లో రహదారి దెబ్బతినడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. దీంతో బస్సులు, ఇతర వాహనాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రాత్రి వేళల్లో మరింత ఇబ్బందులు పడుతున్నారు.  జాతీయ రహదారి నిర్వహణ విభాగం అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారులకు మరమ్మతులకు చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు. 

Updated Date - 2022-07-04T06:30:48+05:30 IST