పూర్వకాలం సాగు భూములను ఎలా వదులుకోవాలి

ABN , First Publish Date - 2022-09-08T06:40:42+05:30 IST

పూర్వకాలం నుంచి ఇక్కడ భూములు సాగు చేసుకుంటూ వచ్చే ఫలసాయంతో జీవనం సాగిస్తున్నామని, ఈ భూములు మావని కోనాం భూస్వాములు అంటుంటే.. మేము ఎలా బతకాలని గుంటు, కొత్తవీధి గిరిజన రైతులు జన్ని లక్ష్మణరావు, కోట కొండలరావు, వంటాల బాబూరావు, గెమ్మిలి లక్ష్మణరావు, తదితరులు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనకుమారి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్వకాలం సాగు భూములను ఎలా వదులుకోవాలి
గిరిజనులతో మాట్లాడుతున్న జేసీ కల్పనకుమారి


ఫలసాయం కనిపించగానే భూస్వాములు అమ్మేశారు..

జేసీ కల్పనకుమారి వద్ద మొరపెట్టుకున్న గిరిజన రైతులు

చీడికాడ, సెప్టెంబరు 7: పూర్వకాలం నుంచి ఇక్కడ భూములు సాగు చేసుకుంటూ వచ్చే ఫలసాయంతో జీవనం సాగిస్తున్నామని, ఈ భూములు మావని కోనాం భూస్వాములు అంటుంటే.. మేము ఎలా బతకాలని గుంటు, కొత్తవీధి గిరిజన రైతులు జన్ని లక్ష్మణరావు, కోట కొండలరావు, వంటాల బాబూరావు, గెమ్మిలి లక్ష్మణరావు, తదితరులు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనకుమారి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కోనాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 289/1ఎలో 37 ఎకరాలను కోనాం భూస్వాములు అక్రమంగా అమ్మకాలు చేశారని గిరిజనులు చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం జేసీ కల్పనకుమారి, తహసీల్దార్‌ బీవీ రాణి విచారణ జరిపారు. కోనాం శివారు గుంటు గ్రామానికి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి గిరిజనులు, భూస్వాములతో మాట్లాడారు. తొలుత రికార్డులు పరిశీలించిన అనంతరం భూమి యజమానులైన చలుగు చిట్టినాయుడు, అప్పలకొండ నాయుడులను ఈ భూములు మీకు ఏ విధంగా వచ్చాయని జేసీ ప్రశ్నించారు. సీలింగ్‌ భూముల్లో మాకు 30 ఎకరాలు కేటాయించి, ఏడు ఎకరాలు ప్రభుత్వం తీసుకుందన్నారు. అయితే మీకు ఉన్న సొంత భూమిలో 30 ఎకరాలు అమ్మాలి తప్ప 37 ఎకరాలు ఎలా అమ్మారని జేసీ భూస్వాములను ప్రశ్నించారు. దీనికి భూస్వాములు సమాధానం రాలేదు. అనంతరం గుంటు, కొత్తవీధి గిరిజనులను భూముల గురించి ప్రశ్నించారు. 40 ఏళ్ల క్రితం అటవీప్రాంతంగా ఉన్న భూముల్లో తుప్పలు, డొంకలు కొట్టి భూమిని చదును చేశామని, ఈ భూముల్లో అపరాలు వేసుకొని జీవనం సాగిస్తున్నామని గిరిజన రైతులు తెలిపారు. ఫలసాయం వచ్చిన తర్వాత ఈ భూములను అమ్మకాలు చేస్తే తాము ఏ విధంగా బతకాలని జేసీ ముందు వాపోయారు. ఈ భూములకు సంబంధించి రికార్డులు ఉన్నాయా అని జేసీ గిరిజనులను ప్రశ్నించారు. 40 ఏళ్ల క్రితం భూ యజమానులు వచ్చి ఈ భూములు మావేనని చెబితే మేము ఎందుకు సాగు చేస్తామని గిరిజనులు ప్రశ్నించారు. భూములను చదును చేసిన తరువాత పంట ఫలసాయం కనిపిస్తుండడంతో భూస్వాములు అమ్మకాలు చేస్తే మా గతి ఏమిటని ప్రశ్నించారు. దీని తహసీల్దార్‌ బీవీ.రాణి ఈ భూములపై మీకు ఆధారాలు లేనపుడు మీకు ఎలా చెందుతాయని గిరిజనులను ప్రశ్నించారు. గ్రామస్థాయి రెవెన్యూ అధికారుల వైఫల్యం వలనే ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన ఏడు ఎకరాలు అమ్మకాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని జేసీని విలేఖరులు ప్రశ్నించగా.. దీనిపై రికార్డులు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. కోనాం రెవెన్యూ పరిధిలో ఏఏ భూములు.. ఎన్ని ఎకరాల్లో ఉన్నాయో సమగ్రంగా పరిశీలించి, తనకు నివేదిక ఇవ్వాలని జేసీ కల్పనకుమారి తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ విచారణలో డిప్యూటీ తహసీల్దార్‌ పొట్నూరి రమేష్‌, వీఆర్‌వోలు కె.అప్పారావు, చలుగు సత్యనారాయణ, వరహామూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Read more