‘అభిజిత్’లో హౌస్ కీపింగ్ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2022-08-04T06:49:39+05:30 IST
ఇక్కడి అభిజిత్ కర్మాగారంలో విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు బుధవారం మృతి చెందాడు.
కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆందోళన
అచ్యుతాపురం రూరల్, ఆగస్టు 3 : ఇక్కడి అభిజిత్ కర్మాగారంలో విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు బుధవారం మృతి చెందాడు. మండలంలోని దోసూరు పంచాయతీ రావిపాలేనికి చెందిన రావి తాతబ్బాయి (45) కంపెనీలో హౌస్‌కీ పింగ్ పనులు చేస్తుండేవాడు. బుధవారం మధ్యాహ్నం భోజన విరామం తరవాత శరీరమంతా ఒక్కసారిగా చెమటలు పట్టి, పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో తోటి సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యలో మృతిచెందాడు. ఇతనికి భార్య జయ, కుమార్తె ఉన్నారు. కర్మాగారంలో మృతిచెందినందున మృతుని కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంస్థ ప్రధాన ముఖద్వారం వద్ద రావిపాలెం గ్రామస్థులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రొంగలి రాము, గ్రామ పెద్దలు నర్మాల రామకృష్ణ, నర్మాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పూడిమడక రోడ్డులో వివాహిత ఆత్మహత్య
అచ్యుతాపురం రూరల్, ఆగస్టు 3: ఇక్కడి పూడిమడక రోడ్డులో గల అపార్టుమెంటులో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, అదనపు కట్నం కోసం తన కుమార్తెను అల్లుడే హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి అచ్యుతాపురం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలివి. స్థానిక పూడిమడక రోడ్డులో గల ఓ అపార్టుమెంటులో నివాసముంటున్న ప్రవీణ్‌కు, తమిళనాడు రాష్ట్రం తిరువూరు జిల్లా విలమల్ గ్రామానికి చెందిన పకీరు స్వామి చిన్నకుమార్తె అను (27)తో గత ఏడాది డిసెంబరు 8న వివాహం జరిగింది. ఆ సమయంలో రూ.5 లక్షల కట్నం, ఇరవై కాసుల బంగారం ఇచ్చారు. వివాహం జరిగిన మూడు నెలలకే అదనపు కట్నం కోసం అనును కొట్టి తమిళనాడులోని తమ ఇంటికి ప్రవీణ్ పంపించేశాడు. దీనిపై పెద్దల సమక్షంలో మాట్లాడి తిరిగి తల్లిదండ్రులు ఇక్కడకు పంపించారు. ఈ నెల ఒకటో తేదీ సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో అను ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్టు తమకు ఫోన్ రావడంతో తమిళనాడు నుంచి వచ్చినట్టు మృతురాలు తండ్రి స్వామి ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎస్‌ఐ చెప్పారు. సోమవారం తమ కుమార్తె అను రెండుసార్లు కాల్ చేసిన తన తల్లితో మాట్లాడిందని, తన భర్త తనను చంపేస్తాడని భయపడుతూ చెప్పిందని తెలిపారన్నారు. సాయంత్రం తిరిగి ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో భయపడ్డామని, రాత్రి ఏడు గంటలకు కాల్ చేసి తమ కుమార్తె ఉరిపోసుకుని చనిపోయినట్టు చెప్పాడని స్వామి వాపోయినట్టు ఎస్‌ఐ తెలిపారు. తన అల్లుడే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుధవారం పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
రెండు ద్విచక్ర వాహనాల ఢీకొని ఒకరు మృతి
పరవాడ, ఆగస్టు 3: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారిలోని గొర్లివానిపాలెం అపోలో టైర్లు షాప్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ రమేశ్ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 79 వార్డు పరిధి దేశపాత్రునిపాలేనికి చెందిన నాగల విజయ్‌కుమార్ (44) ఫార్మాసిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ‘సి’షిప్టు విధులకు వెళ్లేందుకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. సరిగ్గా అపోలో టైర్ల షాప్ సమీపంలోకి వచ్చేసరికి అదే రహదారిలో ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తున్న దాడి నరసింగరావులు అదుపు తప్పి ఢీకొట్టుకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాలకు గురయ్యారు. వెంటనే వీరిని 108 వాహనంలో అక్కడివారు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయ్‌కుమార్ మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా గాయపడిన నరసింగరావు విశాఖపట్నం పూర్ణామార్కెట్‌కు చెందిన వ్యక్తిగా ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.