‘హైస్కూల్ ప్లస్’కు ఆదరణ కరువు!
ABN , First Publish Date - 2022-08-18T06:32:10+05:30 IST
నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్యలో పలు మార్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాలలను ఐదు రకాలుగా వర్గీకరించిన విషయం తెలిసిందే. దీనిలో చివరిదైన ‘హైస్కూల్ ప్లస్’ను ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని నాలుగు బాలికల ఉన్నత పాఠశాలల్లో అమలు చేసింది.

మొత్తం 320 సీట్లు... ఇంతవరకు చేరింది 65 మంది మాత్రమే
నూతన విద్యా విధానం పేరుతో ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్
ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాలుగు బాలికల హైస్కూళ్లలో ఏర్పాటు
పరవాడ, ఎలమంచిలి, కూండ్రంలో ఎంపీసీ, బైపీసీ; ‘పేటలో బైపీసీ, సీఈసీ గ్రూపులు
ఒక్కో గ్రూపులో 40 సీట్లు
హైస్కూళ్ల టీచర్లే అధ్యాపకులు!
మూడు వారాల క్రితం తరగతులు ప్రారంభం
మంజూరుకాని సైన్స్ ల్యాబ్‌లు
ఎలమంచిలి, కూండ్రంలో అరకొర అడ్మిషన్లు
160 సీట్లకు 23 మంది మాత్రమే చేరిక
పరవాడలో 58, పేటలో 60 సీట్లు ఖాళీ
పరవాడ/ ఎలమంచిలి/, పాయకరావుపేట/ కొత్తూరు, ఆగస్టు 17
నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్యలో పలు మార్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాలలను ఐదు రకాలుగా వర్గీకరించిన విషయం తెలిసిందే. దీనిలో చివరిదైన ‘హైస్కూల్ ప్లస్’ను ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని నాలుగు బాలికల ఉన్నత పాఠశాలల్లో అమలు చేసింది. పరవాడ, ఎలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి మండలం కూండ్రంలోని పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ముందుస్తు ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకం, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు వంటివి చేపట్టకుండానే అడ్మిషన్లు ప్రారంభించారు. మూడు పాఠశాలల్లో ఎంపీసీ, బైసీపీ, ఒక పాఠశాలలో బైసీపీ, సీఈసీ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన జరిగే ప్రతి గ్రూపులో 40 సీట్లు వున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ తొలి దశ పూర్తయి, సుమారు మూడు వారాల క్రితం తరగతులు మొదలయ్యాయి. కానీ ఒక్క గ్రూపులో కూడా కనీస పూర్తిస్థాయిలో బాలికలు చేరలేదు. నాలుగు పాఠశాలల్లో 320 సీట్లు వుండగా ఇంతవరకు 65 మంది మాత్రమే చేరారు. కూండ్రం పాఠశాల ఎంపీసీ గ్రూపులో ఒక్కరే వున్నారు. పరవాడలో 22 మంది, పాయకరావుపేటలో 20 మంది, ఎలమంచిలిలో 12 మంది, కూండ్రంలో 11 మంది మాత్రమే చేరారు. ఇంకా 257 సీట్లు ఖాళీగా వున్నాయి. స్థానిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో పీజీ అర్హత వున్న వారిని ఇంటర్మీడియట్ బోధనకు నియమించారు. మిగిలిన ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. కానీ వీరిలో కొంతమంది ఇంతవరకు బదిలీ అయిన పాఠశాలలో చేరకపోవడంతో ఆయా సబ్జెక్టులను బోధించేవారు లేకపోయారు. వసతి సమస్య లేనప్పటికీ ఇంటర్ విద్యార్థులకు అవసరమైన స్థాయిలో సైన్స్ ల్యాబ్‌లు లేవు. కాగా టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి కూడా ప్రవేశం కల్పిస్తామని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇంతవరకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయలేదు. ‘హైస్కూల్ ప్లస్’గా ఈ ఏడాది ఇంటర్మీడియట్ కోర్సులను ప్రవేశపెట్టిన పాఠశాలలపై ‘ఆంధ్రజ్యోతి’ విజిట్...
పరవాడలో 60 సీట్లు ఖాళీ
స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ‘హైస్కూల్ ప్లస్’గా అప్‌గ్రేడ్ చేసి ఎంపీసీ, బైసీపీ గ్రూపులను కేటాయించారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లు వున్నాయి. ప్రస్తుతం ఎంపీసీలో ఎనిమిది, బైపీసీలో 14 మంది కలిపి మొత్తం 22 మంది విద్యార్థినులు మాత్రమే వున్నారు. ఇంకా 58 సీట్లు ఖాళీగా వున్నాయి. తరగతుల నిర్వహణకు వసతి సమస్య లేదు. అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు వున్నారు. సైన్స్ ల్యాబ్ లేదు. కాగా ఇంటర్లో చేరిన వారిలో పది మంది బాలికలు పాలిటెక్నిక్ కోర్సు చేస్తామని, మరో ముగ్గురు ఇంగ్లిష్ మీడియం అర్థం కాదంటూ వెళ్లిపోయారని హెచ్ఎం లక్ష్మీకుమారి తెలిపారు. సెప్టెంబరు 30వ తేదీ వరకు అడ్మిషన్లకు అవకాశం వుందని ఆమె చెప్పారు.
‘పేటలో 20 మంది మాత్రమే చేరిక
పాయకరావుపేటలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో బైపీసీ, సీఈసీ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 40 చొప్పున సీట్లు వున్నాయి. ప్రస్తుతం బైపీసీలో ఆరుగురు, సీఈసీలో 14 మంది కలిపి మొత్తం 20 మంది మాత్రమే వున్నారు. ఇంకా 60 సీట్లు ఖాళీగా వున్నాయి. వివిధ సబ్జెక్టుల బోధన కోసం ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఐదుగురు టీచర్లతోపాటు మంగవరం, ఎస్.నర్సాపురం, గుంటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి ముగ్గురు టీచర్లను డిప్యుటేషన్‌పై నియమించారు. వసతి సమస్య లేదు. సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయలేదు.
ఎంపీసీలో ఏక్ నిరంజన్!
అనకాపల్లి మండలం కూండ్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మంజూరు చేశారు. ఒక్కో గ్రూపులో 40 చొప్పున సీట్లు వున్నాయి. ఎంపీసీలో ఒకే ఒక విద్యార్థిని వున్నారు. బైపీసీలో 10 మంది చేరారు. ఇంకా 69 సీట్లు ఖాళీగా వున్నాయి. తరగతుల నిర్వహణకు ఒక గది కేటాయించారు. బోధన కోసం ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. ఫిజిక్స్, కెమిస్ర్టీ
ఎలమంచిలిలో 12/80
ఎలమంచిలి బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లు వుండగా, ఎంపీసీలో ఏడుగురు, బైపీసీలో ఐదుగురు మాత్రమే చేరారు. ఇంకా 68 సీట్లు ఖాళీగా వున్నాయి. తరగతుల నిర్వహిణకు ప్రస్తుతం ఒక గదిని మాత్రమే కేటాయించారు. మొత్తం ఏడుగురు టీచర్లలో ఐదుగురు స్థానిక పాఠశాలకు చెందినవారు. మిగిలిన ఇద్దరు (ఫిజిక్స్, జువాలజీ) ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ వీరిద్దరు ఇంకా రాలేదు.