హీరో కృష్ణకు అనకాపల్లితో అనుబంధం

ABN , First Publish Date - 2022-11-16T01:05:42+05:30 IST

సినీ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ గతంలో పలుమార్లు అనకాపల్లి పట్టణంలో పర్యటించారు.

హీరో కృష్ణకు అనకాపల్లితో అనుబంధం
నాడు హీరో కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించిన సత్యనారాయణ పిక్చర్‌ ప్యాలెస్‌

సత్యనారాయణ థియేటర్‌ ఆయన చేతుల మీదుగానే ప్రారంభం

అనకాపల్లి టౌన్‌, నవంబరు 15: సినీ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ గతంలో పలుమార్లు అనకాపల్లి పట్టణంలో పర్యటించారు. హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా ‘తేనె మనసులు’ విడుదలైన తరువాత ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి చిత్రం యూనిట్‌ రాష్ట్రమంతటా పర్యటించింది. ఈ సందర్భంగా ఆయనతోపాటు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, కో-డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ కారులో విశాఖ నుంచి అనకాపల్లి బయలుదేరారు. పట్టణ శివారులోని సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద కారు ప్రమాదానికి గురై కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అనకాపల్లి రాకుండే నేరుగా కాకినాడ వెళ్లిపోయారు.

అనకాపల్లి మెయిన్‌రోడ్డులో కొణతాల అప్పారావు (ఆకుల అప్పారావు) సత్యనారాయణ పిక్చర్‌ ప్యాలెస్‌ పేరుతో 1972లో సినిమా థియేటర్‌ను నిర్మించారు. కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్లుగా నటించిన ‘పండంటి కాపురం’ చిత్రంతో తొలి ప్రదర్శన. థియేటర్‌ యజమాని ఆహ్వానం మేరకు కృష్ణ, విజయనిర్మల ఇక్కడకు వచ్చి సత్యనారాయణ పిక్చర్‌ ప్యాలెస్‌ను ప్రారంభించారు. కొద్దిసేపు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. జిల్లా నలుమూలల నుంచి కృష్ణ అభిమానులు తరలిరావడంతో థియేటర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు రద్దీగా మారాయి.

ప్రస్తుతం కొబ్బరి కాయల మార్కెట్‌ వద్ద రమణ పిక్చర్‌ ప్యాలెస్‌ పేరుతో థియేటర్‌ వుండేది. కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా 1973లో ఈ థియేటర్‌లో విడుదలైంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో హీరోలు ఎన్టీఆర్‌, కృష్ణతోపాటు చిత్రబృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. ఇందులో భాగంగా అనకాపల్లి వచ్చారు.

Updated Date - 2022-11-16T01:05:46+05:30 IST