హయగ్రీవకు కలెక్టర్‌ షాక్‌

ABN , First Publish Date - 2022-12-16T01:12:52+05:30 IST

ఎండాడ సర్వే నంబరు 92/3లో 2006లో కేటాయించిన 12.51 ఎకరాలను తిరిగి ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో తెలపాలంటూ ‘హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌’ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున షోకాజ్‌ నోటీసు జారీచేశారు.

హయగ్రీవకు కలెక్టర్‌ షాక్‌

భూ కేటాయింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియపరచాలంటూ యాజమాన్యానికి నోటీస్‌

నిబంధనలు ఉల్లంఘించారంటూ స్పష్టంగా పేర్కొన్న మల్లికార్జున

నిర్మాణానికి ముందే 15 మందికి రిజిస్ట్రేషన్‌ చేసినట్టు, మరో 16 మందితో సేల్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్టు గుర్తింపు

నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం

గత నెల 8న జారీ చేసినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నోటీసు

వివరాలు వెల్లడించేందుకు రెవెన్యూ వర్గాలు విముఖం

విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ఎండాడ సర్వే నంబరు 92/3లో 2006లో కేటాయించిన 12.51 ఎకరాలను తిరిగి ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో తెలపాలంటూ ‘హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌’ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున షోకాజ్‌ నోటీసు జారీచేశారు. ఈ మేరకు నోటీసుని స్వయంగా యాజమాన్య ప్రతినిధులకు అందజేయాలంటూ రూరల్‌ తహసీల్దార్‌ పాల్‌కిరణ్‌ను ఆదేశించారు. అయితే గత నెల ఎనిమిదో తేదీన కలెక్టర్‌ ఈ నోటీసు జారీచేసినప్పటికీ గురువారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

మొత్తం భూమిలో పది శాతంలో వృద్ధులకు ఉచితంగా ఆశ్రమం నిర్మించడంతోపాటు 30 శాతం భూమిలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులకు కేటాయించి మిగిలిన 60 శాతం భూమిలో వృద్ధులకు నివాసయోగ్యంగా, అందుబాటు ధరల్లో విల్లాలు నిర్మించడానికి 2006లో రాష్ట్ర ప్రభుత్వం హయగ్రీవ సంస్థకు భూమి కేటాయించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వివిధ కారణాలతో ఆ భూమిలో నిర్మాణాలు జరగలేదు. కొన్నాళ్ల కిందట భూమిని హయగ్రీవ సంస్థ ఎండీ జగదీశ్వరుడు నుంచి వైసీపీ నేత గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), గాదె బాలాజీ జీపీఏ చేయించుకున్నారు. అయితే తన నుంచి భూమిని జీవీ బలవంతంగా లాక్కొన్నారంటూ చెరుకూరి జగదీశ్వరుడు సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో హయగ్రీవ భూ వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ ఎ.మల్లికార్జున విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుని కోర్టులో వున్న కేసులను ఉపసంహరించుకున్నప్పటికీ ...భూమి కేటాయింపు సమయంలో విధించిన నిబంధనలను ఉల్లంఘించారని, అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున లేఖ రాశారు. దీంతో ఆ భూమిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదంటూ కొంతమంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతోపాటు జీవీఎంసీకి ఫిర్యాదులు చేయడంతో ప్లాన్‌ పెండింగ్‌లో ఉండిపోయింది. జిల్లా కలెక్టర్‌ నుంచి ఎన్‌ఓసీ తీసుకుని సమర్పిస్తే ప్లాన్‌ విడుదల చేస్తామంటూ జీవీఎంసీ అప్పటి కమిషనర్‌ లక్ష్మీషాతోపాటు ప్రస్తుత కమిషనర్‌ పి.రాజాబాబు కూడా షార్ట్‌ ఫాల్‌ రాశారు. అయినప్పటికీ అక్కడ పనులు జరుగుతున్నాయంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందుతుండడంతో ఆయన తాజాగా హయగ్రీవ యాజమాన్యానికి షోకాజ్‌ జారీ చేస్తూ, దానిని వారికి అందజేయాలంటూ రూరల్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. తమకు సమర్పించిన డీపీఆర్‌ ప్రకారం 2018 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ అలా చేయలేకపోయారని, అందుకు విరుద్ధంగా, జిల్లా అధికార యంత్రాంగం అనుమతి తీసుకోకుండా కేటాయించిన భూమిని ప్లాట్లుగా విభజించి నిర్మాణానికి ముందే 15 మందికి రిజిస్ట్రేషన్‌ చేశారని, మరో 16 మందితో సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకోవడం ద్వారా వ్యాపార ధోరణి కనబరిచారని కలెక్టర్‌ ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే 2008లో భూకేటాయింపు జరిగిన సమయంలో ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్‌ 1447లో పేర్కొన్న నియమ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై కోర్టు 2017లో జారీచేసిన ఆదేశాలను అమలు చేయలేకపోయారని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. వీటన్నింటి నేపథ్యంలో భూమి కేటాయింపును ఎందుకు రద్దు చేయకూడదో తెలుపుతూ నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కలెక్టర్‌ నోటీసులు పేర్కొన్నారు. అయితే ఈ నోటీస్‌ జారీచేసి నెల రోజులకుపైగా అయ్యింది. దీనిపై యాజమాన్యం ఎలాంటి సమాధానం ఇచ్చిందనే దానిపై రెవెన్యూ వర్గాలు గోప్యత పాటిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Updated Date - 2022-12-16T01:12:53+05:30 IST