హయగ్రీవ బరితెగింపు
ABN , First Publish Date - 2022-08-15T06:29:16+05:30 IST
‘జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలను సైతం హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ యాజమాన్యం బేఖాతరు చేస్తోంది.

తగిన పత్రాలు లేవంటూ ప్లాన్‌ను షార్ట్‌ఫాల్‌లో పెట్టిన జీవీఎంసీ కమిషనర్
అయినప్పటికీ కొనసాగుతున్న నిర్మాణ పనులు
చోద్యం చూస్తున్న జీవీఎంసీ అధికారులు
అధికార పార్టీ నేతల దన్నుతోనేనని ఆరోపణలు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
‘జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలను సైతం హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ యాజమాన్యం బేఖాతరు చేస్తోంది. భవన నిర్మాణానికి యాజమాన్యం దరఖాస్తు చేయగా, పరిశీలించిన కమిషనర్ మరికొన్ని పత్రాలు కావాలంటూ షార్ట్‌ఫాల్‌లో పెట్టారు. వాటిని అందజేసిన తర్వాత ప్లాన్ పొంది నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం మాత్రం పనులను శరవేగంగా కొనసాగిస్తోంది. కాగా అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడం అనుమానాలకు దారితీస్తోంది.
హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్‌కు 2006లో ఎండాడ సర్వే నంబరు 92/3లో 12.51 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిలో 10 శాతం విస్తీర్ణంలో వృద్ధులకు ఆశ్రమం నిర్మించాలని, 30 శాతం రోడ్లు, కాలువల నిర్మాణం, మిగిలిన భూమిలో ఫ్లాట్లు నిర్మించి వృద్ధులకే విక్రయించాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా వృద్ధులకు ఆశ్రమం నిర్మించిన తర్వాతే మిగిలిన భూమిని ఉపయోగించుకోవాలని సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడికి స్పష్టం చేసింది. అయితే అనేక కారణాలతో ప్రాజెక్ట్ పనులు ప్రారంభంకాలేదు. అనంతరం ఆ సంస్థలో బ్రహ్మాజీ అనే వ్యక్తి మేనేజింగ్ పార్టనర్‌గా చేరడం, ఆ భూమిలో మెజారిటీ వాటాను వైసీపీలో కీలకనేత, ప్రముఖ ఆడిటర్ గన్నమని వెంకటేశ్వరరావు(జీవీ) దక్కించుకున్నారంటూ వివాదాలు చుట్టుముట్టాయి. దీనిపై కోర్టులో కేసులు నడవగా ప్రస్తుతం ఇరువర్గాలు రాజీచేసుకున్నాయి.
ఈ క్రమంలో ఆ భూమిలో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలంటూ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోగా, పరిశీలించిన కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీషా ఆ భూమికి సంబంధించి జిల్లా కలెక్టర్ జారీచేసిన ఎన్ఓసీకి ఉన్న మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో కొత్తగా ఎన్ఓసీ తీసుకుని అప్లోడ్ చేయాలని, భవన నిర్మాణానికి పెట్టిన ప్లాన్‌లో వృద్ధులకు అవసరమైన సౌకర్యాలను కల్పించలేదని, జరుగుతున్న నిర్మాణాలు కూడా వృద్ధులు సులభంగా రాకపోకలు సాగించేందుకు అనువుగా లేవని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తాజాగా ఈసీ తీసుకోవాలని పేర్కొంటూ, దరఖాస్తును షార్ట్ఫాల్పెట్టి వెనక్కి పంపించేశారు. దీనిపై సబంధితన యాజమాన్యం స్పందించి కమిషనర్ కోరిన పత్రాలను అప్లోడ్ చేయడంతోపాటు, కమిషనర్ లేవనెత్తిన ఇతర అభ్యంతరాలను నివృత్తి చేసి, పూర్తిస్థాయి ప్లాన్ పొందాల్సి ఉంది. కానీ యాజమాన్యం వాటిని కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్లాన్‌ను కమిషనర్ షార్ట్‌ఫాల్‌లో పెట్టినప్పటికీ నిర్మాణ పనులను నిలుపుదల చేయలేదు సరికాదా.. పనుల వేగం పెంచడం విశేషం. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారు. షార్ట్‌ఫాల్‌లో ఉండగా నిర్మాణాలు చేయకూడదని యాజమాన్యానికి స్పష్టం చేయడంతో పాటు షార్ట్‌ఫాల్‌లో ప్రస్తావించిన డాక్యుమెంట్లను సమర్పించ కుండా పనులు చేస్తున్నందున గతంలో ఆన్లైన్లో జారీ అయిన తాత్కాలిక ప్లాన్‌ను ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలంటూ? నోటీసు జారీచేయాలి. అప్పటికీ స్పందించకపోతే ఏకంగా ప్లాన్‌ను రద్దు చేసే అధికారం జీవీఎంసీ కమిషనర్‌కు ఉంది. అయినప్పటికీ టౌన్‌ప్లానింగ్ అధికారులు గానీ, కమిషనర్ గానీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారపార్టీ నేతలు ఆ సంస్థ వెనుకున్నారనే కారణంతో అటువైపు చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.