టిడ్కో ఇళ్లపై గ్రేటర్‌ దృష్టి

ABN , First Publish Date - 2022-12-10T01:15:04+05:30 IST

గత తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో (టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తి, కేటాయింపుపై ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించినట్టుంది.

టిడ్కో ఇళ్లపై గ్రేటర్‌ దృష్టి

ఎట్టకేలకు నిర్మాణం పూర్తిచేసేందుకు సిద్ధమైన అధికారులు

విడతల వారీగా పంపిణీ

ఇప్పటివరకూ 1200 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయింపు

నెలాఖరు నాటికి మరో 400 అప్పగించేలా పనులు

జనవరి నెలాఖరుకు మరో 2,500 సిద్ధం

మిగిలినవి మూడు దశల్లో పూర్తిచేస్తామంటున్న యూసీడీ పీడీ

తాళాలు తీసుకున్న లబ్ధిదారులు ఇళ్లలో దిగాలని సూచన

గృహ ప్రవేశానికి ఇళ్ల పంపిణీ వేగవంతం చేసిన జీవీఎంసీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గత తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో (టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తి, కేటాయింపుపై ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించినట్టుంది. ఈ నేపథ్యంలో మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో విడతల వారీగా లబ్ధిదారులకు ఇళ్లు అందజేసే కార్యక్రమం మొదలెట్టారు. అయితే ఇళ్ల తాళాలు అందుకున్న వారంతా తక్షణం వాటిలో చేరాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే లబ్ధిదారులు మాత్రం ఇంకా గృహ ప్రవేశాలపై తర్జనభర్జన పడుతున్నారు.

జీవీఎంసీ పరిధిలో టిడ్కో 24,152 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం వీటిలో తొలిదశ కింద 4,808 ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలిదశ కింద పూర్తిచేయాలనుకున్న 4,808 ఇళ్లతోపాటు మిగిలిన ఇళ్లకు కూడా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో ఇప్పటివరకూ 6,500 మందికి బ్యాంక్‌ లింకేజీ పూర్తిచేయడంతో రిజిస్ర్టేషన్లు చేశారు. అగనంపూడి, రాతిచెరువు, చినముషిడివాడ, చిలకపేట, సీహార్స్‌ జంక్షన్‌లలో సుమారు వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం శతశాతం పూర్తవ్వడంతోపాటు ఇటీవల అక్కడ ఇళ్లు పొందిన లబ్ధిదారులకు తాళాలను అందజేశారు. రెండు రోజుల క్రితం చిలకపేటలో 64 ఇళ్ల తాళాలను వాటి లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఎక్కడా ఇంకా లబ్ధిదారులు ఇళ్లలో దిగకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తక్షణం వాటిలో చేరాలంటూ లబ్ధిదారులకు చెప్పాలంటూ యూసీడీ సిబ్బందిపై ఒత్తిడి చేయడంతోపాటు నేరుగా కమిషనర్‌ రాజాబాబు పత్రికా ప్రకటన జారీచేశారు. అయినప్పటికీ లబ్ధిదారుల్లో స్పందన రాకపోవడం విశేషం. ఈ విషయం యూసీడీ పీడీ పాపునాయుడు వద్ద ప్రస్తావించగా అన్నిరకాల సదుపాయాలను కల్పించిన తర్వాతే లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తున్నామన్నారు. ఒకవేళ ఇంట్లో దిగిన తర్వాత ఏదైనా మౌలిక వసతుల సమస్య ఎదురైతే తమ దృష్టికి తెస్తే తక్షణం పరిష్కరిస్తామన్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలని కమిషనర్‌ పి.రాజాబాబు ఆదేశించారని, దీనికోసం బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని లింకేజీ ప్రక్రియను కూడా వేగవంతం చేశామని పీడీ తెలిపారు. పరవాడలో 400 ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్‌టీపీ...సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, వాటిని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అలాగే అనకాపల్లి సమీపంలోని సత్యనారాయణపురంలో 2,500 ఇళ్ల నిర్మాణం పూర్తవగా, ఎస్‌టీపీ నిర్మాణపనులు ఇంకా జరగకపోవడంతో లబ్ధిదారులకు అందజేయలేదన్నారు. జనవరి నెలాఖరు నాటికి ఎస్‌టీపీ పనులు పూర్తయితే వాటిని లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నాటికి దబ్బంద, సుద్దగెడ్డ, ఏఎస్‌ఆర్‌ కాలనీ, ముచ్చుమాంబ కాలనీ, నడుపూరు, భానోజీతోటల్లోని ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వివరించారు.

Updated Date - 2022-12-10T01:15:05+05:30 IST