గ్రేటర్‌ బడ్జెట్‌ రూ.4,061.9 కోట్లు

ABN , First Publish Date - 2022-03-05T06:29:39+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాలక మండలి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.4,061.90 కోట్ల జంబో బడ్జెట్‌ను ఆమోదించింది.

గ్రేటర్‌ బడ్జెట్‌ రూ.4,061.9 కోట్లు

ఆదాయం రూ.3,885.18 కోట్లు

ఖర్చు రూ.4,061.90 కోట్లు 

అంకెలగారడీ అంటూ వ్యతిరేకించిన టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ

వాస్తవ ఆదాయానికి, బడ్జెట్‌లో చూపిన దానికి పొంతన లేదని విమర్శ

పాలకవర్గం గొప్పలకు పోతే ప్రజలను వంచించినట్టేనని ధ్వజం 

బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్టు ప్రకటించి కౌన్సిల్‌ నుంచి వెళ్లిపోయిన మేయర్‌

పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగిన విపక్ష కార్పొరేటర్లు


విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): 

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాలక మండలి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.4,061.90 కోట్ల జంబో బడ్జెట్‌ను ఆమోదించింది. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన శుక్రవారం బడ్జెట్‌ సమావేశం జరిగింది. అధికారులు రూపొందించిన బడ్జెట్‌ను సభ్యులకు మేయర్‌ చదివి వివరించారు. రెవెన్యూ ఆదాయంగా రూ.1,749.56 కోట్లు, గ్రాంట్లు, ఇతర మార్గాల ద్వారా మరో రూ,2,135.62 కోట్లు...మొత్తం రూ.3,885.18 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వే సినట్టు మేయర్‌ వివరించారు. కేటాయింపుల విషయానికి వస్తే సాధారణ పద్దు కింద రూ.1,321.88 కోట్లు, మూలధన పద్దు కింద రూ.2,740.02 కోట్లు...మొత్తం రూ.4,061.90 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వివరించారు. 

కొత్త బడ్జెట్‌లో ఆదాయం కింద ఆస్తిపన్ను రూపంలో రూ.475 కోట్లు, ఆస్తిపన్ను చెల్లింపుపై వడ్డీల రూపంలో రూ.30 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను రూపంలో రూ.50 కోట్లు, పోర్టు నుంచి సర్వీస్‌ ట్యాక్స్‌ కింద రూ.20 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ కింద రూ.165 కోట్లు, వృత్తిపన్ను ద్వారా రూ.60 కోట్లు, మార్కెట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలు, ఇతర అద్దెల రూపంలో రూ.15.15 కోట్లు, అసైన్డ్‌ రెవెన్యూ కింద రూ.227 కోట్లు, ప్రకటనల ద్వారా రూ.28.75 కోట్లు, భవన నిర్మాణాలకు అనుమతుల రూపంలో రూ.250 కోట్లు, భవనాల క్రమబద్ధీకరణ ద్వారా రూ.26 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌ విభాగం నుంచి ఇతర రూపాల్లో రూ.15.23 కోట్లు, ట్రేడ్‌ లైసెన్సుల ద్వారా రూ.20 కోట్లు, చెత్త వసూలుపై యూజర్‌ చార్జీల రూపంలో రూ.55 కోట్లు, ప్రజారోగ్య విభాగం ద్వారా రూ.42 కోట్లు, కొత్త కొళాయి కనెక్షన్లు ద్వారా రూ.15 కోట్లు, కొళాయి, బల్క్‌, సెమీ బల్క్‌ కనెక్షన్ల చార్జీల ద్వారా రూ.280 కోట్లు, కొళాయి చార్జీల ద్వారా రూ.60 కోట్లు, తదితర మార్గాల ద్వారా రూ.1,749.56 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశామన్నారు. గ్రాంట్లు, ఇతర మూలధన ఆదాయం కింద మరో రూ.2,135.62 కోట్లు మొత్తం రూ.3,885.18 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశామన్నారు. కేటాయింపుల విషయానికి వస్తే...అత్యధికంగా ఇంజనీరింగ్‌ విభాగానికి రూ.875.56 కోట్లు, యూసీడీ విభాగానికి రూ.532.81 కోట్లు, ప్రజారోగ్యానికి రూ.400.96 కోట్లు, ప్రాజెక్టులకు రూ.434.4 కోట్లు, నీటి సరఫరా విభాగానికి రూ.309.19 కోట్లు, లైటింగ్‌కు రూ.169.75 కోట్లు, సాధారణ పరిపాలనకు రూ.180.48 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌కు రూ.42.14 కోట్లు, విద్యా విభాగానికి రూ.25.6 కోట్లు, పార్కులు, లీజర్స్‌, సమాధుల నిర్వహణకు రూ.121.38 కోట్లు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టులకు రూ.61.6 కోట్లు, రాజీవ్‌ ఆవాస్‌ యోజనకు రూ.ఐదు కోట్లు, అమృత్‌ పథకానికి రూ.30 కోట్లు, విదేశీ సంస్థలు, బ్యాంకుల అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు రూ.219 కోట్లు, 14,15 ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు రూ.321 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల చెల్లింపులకు రూ.333.03 కోట్లు చూపిస్తూ, ముగింపు నిల్వ రూ.258.08 కోట్లుగా మేయర్‌ వివరించారు. అన్ని విభాగాల క్షేత్రస్థాయి అధికారులు, ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాత రూ.4,061.90 కోట్లతో బడ్జెట్‌ ముసాయిదాను తయారుచేశారన్నారు. దీనిని కమిషనర్‌ పరిశీలించిన తర్వాత స్టాండింగ్‌ కమిటీకి పంపగా రెండుసార్లు లోతుగా సమీక్షించి ఆమోదం తెలపడంతో కౌన్సిల్‌ ఆమోదానికి పెట్టామన్నారు. నగరాభివృద్ధికి దోహదపడే బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించాలని ఆమె కోరారు. 

టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొత్త బడ్జెట్‌ పూర్తిగా అంకెల గారడీగా అభివర్ణించారు. గత బడ్జెట్‌లో చూపించిన ఆదాయం, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్తబడ్జెట్‌లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు సంబంధించిన అంకెలు చూపించారు గానీ, ఏ ప్రాజెక్టుకు ఎంత ఇస్తున్నారో చూపలేదని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఏడాదికి వార్డులో కనీసం రూ.ఐదు లక్షలతో కూడా అభివృద్ధి పనులు చేయలేని స్థితిలో జీవీఎంసీ వుంటే ఏకంగా రూ.4,061 కోట్లతో బడ్జెట్‌ తయారుచేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనికి వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాస్‌ అభ్యంతరం చెప్పడంతో, ‘కాంట్రాక్టర్లకు రెండేళ్లుగా బిల్లులు అందక వారంతా ‘దేహీ’ అంటూ తిరుగుతున్నది వాస్తవం కాదని అధికారులను చెప్పమనండి’...అంటూ పీలా సవాల్‌ చేశారు. సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ బి.గంగారావు మాట్లాడుతూ తప్పులు తడకగా వున్న బడ్జెట్‌ను సవరణ కోసం జీవో నంబర్‌ 1047 ప్రకారం తిరిగి స్టాండింగ్‌ కమిటీకి పంపించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ ఫ్లోర్‌లీడర్‌ ఏజే స్టాలిన్‌ మాట్లాడుతూ రూ.వెయ్యి కోట్లు దాటని ఆదాయాన్ని నాలుగు వేల కోట్ల రూపాయలుగా ఎలా చూపుతారని ప్రశ్నించారు. రాని నిధులను వస్తాయన్నట్టు బడ్జెట్‌లో చూపించడం నగర ప్రజలను మోసం చేసినట్టేనన్నారు. అంకెల గారడీ బడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పల్లా శ్రీనివాసరావు, జనసేన ఫ్లోర్‌ లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మి ప్రకటించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడడంతో బడ్జెట్‌పై మెజారిటీ సభ్యుల సుముఖత వ్యక్తంచేయడంతో ఆమోదిస్తున్నట్టు ప్రకటించి మేయర్‌ పోడియం దిగి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాల కార్పొరేటర్లు పోడియం ముందు బైఠాయించి బడ్జెట్‌కు, మేయర్‌  వ్యవహార శైలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


అంచనా బడ్జెట్‌ వివరాలు

అంశం అంచనా ఆదాయం అంచనా ఖర్చు

 (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)

ప్రారంభ నిల్వ రూ.434.8 -----

సాధారణ పరిపాలన రూ.882.52 రూ.180.48

ఇంజనీరింగ్‌ రూ.371.01 రూ.875.56

లైటింగ్‌ రూ.169.75

ప్రాజెక్ట్స్‌ రూ.176 రూ.434.4

టౌన్‌ప్లానింగ్‌ రూ.319.98 రూ.42.14

యూసీడీ రూ.518.35 రూ.532.81

విద్యావిభాగం రూ.21 రూ.25.60

పార్క్స్‌, లీజులు,

సెమిట్రీలు రూ.25 రూ.121.38

ప్రజారోగ్యం రూ.164.52 రూ.400.96

నీటి సరఫరా రూ.510.6 రూ.309.19

జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం -- రూ.61.6

రాజీవ్‌ ఆవాస్‌  రూ.5.00 రూ.5.00

అమృత్‌ రూ.24 రూ.30

ఎక్స్‌టర్నల్‌

ఎయిడెడ్‌ ప్రాజెక్టులు రూ.243.8 రూ.219

ఆర్థిక సంఘం నిధులు రూ.276 రూ.321

డిపాజిట్లు,అడ్వాన్సులు రూ.347.4 రూ.333.03

ముగింపు నిల్వ --- రూ.258.08

మొత్తం రూ.4,319.98 రూ.4,319.98



Updated Date - 2022-03-05T06:29:39+05:30 IST