గొలగాంలో ఆగని గ్రావెల్ దందా
ABN , First Publish Date - 2022-11-11T00:34:27+05:30 IST
అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు ప్రకృతి సంపదను దోచుకుంటున్నాడు. కొండవాలు ప్రదేశాలను యంత్రాలతో తవ్వి, గ్రావెల్ అమ్ముకుంటున్నాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో గత రెండు నెలలుగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి అయినా చూడడడం లేదు. గనుల శాఖ విజిలెన్స్ అధికారులు మొక్కుబడిగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.
కొండను తవ్వి సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నేత
రెండు నెలలుగా ప్రకృతి సంపద లూటీ
కొద్ది రోజుల క్రితం స్థానికుల ఫిర్యాదుతో గనుల శాఖ విజిలెన్స్ దాడులు
ఎక్స్‌కవేటర్, రెండు ట్రాక్టర్లు స్వాధీనం, పోలీసులకు అప్పగింత
నామమాత్రంగా జరిమానా విధించి వదిలేసిన వైనం
కొద్ది రోజుల నుంచి మళ్లీ గ్రావెల్ తవ్వకాలు
పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు
అనకాపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు ప్రకృతి సంపదను దోచుకుంటున్నాడు. కొండవాలు ప్రదేశాలను యంత్రాలతో తవ్వి, గ్రావెల్ అమ్ముకుంటున్నాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో గత రెండు నెలలుగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి అయినా చూడడడం లేదు. గనుల శాఖ విజిలెన్స్ అధికారులు మొక్కుబడిగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.
అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీ సర్వే నంబరు 283లో ప్రభుత్వ కొండ పోరంబోకు స్థలం వుంది. ఇక్కడ నాణ్యమైన గ్రావెల్ నిక్షిప్తమై వుండడంతో అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి కన్ను పడింది. సుమారు రెండు నెలల క్రితం గ్రావెల్ తవ్వకాలు ప్రారంభించాడు. ఎక్స్‌కవేటర్, ట్రాక్టర్లను సమకూర్చుకుని గ్రావెల్ అమ్ముతున్నాడు. చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ట్రాక్టర్ గ్రావెల్ రూ.1,500, ఐదు కిలోమీటర్లు దాటితే రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నాడు. గ్రావెల్ తవ్వేసిన ప్రదేశాన్ని చదును చేసి సెంటు రూ.2-3 లక్షలకు అమ్ముకుంటున్నాడు. పగలు, రాత్రి తేడా లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుపుతుండడంతో స్థానికులు కొందరు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు, గనుల శాఖ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందట గనుల శాఖ విజిలెన్స్ అధికారులలు దాడులు నిర్వహించి ఒక ఎక్స్‌కవేటర్, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని అనకాపల్లి రూరల్ పోలీసులకు ఆప్పగించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో మొక్కుబడిగా జరిమానా కట్టించుకొని వాహనాలను వదిలేశారు. కొద్ది రోజుల తరువాత మళ్లీ గ్రావెల్ తవ్వకాలు మొదలయ్యాయి. రాత్రి 11 గంటలకు తవ్వకాలు, రవాణా మొదలుపెట్టి, తెల్లవారుజామున నాలుగు గంటల ముగిస్తున్నారు. దీంతో స్థానికులు మరోసారి గనుల శాఖ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈసారి అధికారులు మరోలా స్పందించారు. స్థానిక వీఆర్‌ఓ, తహసీల్దారుకు ఫిర్యాదు చేయాలంటూ సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గొలగాం పంచాయతీలోని కొండపోరంబోకు భూమిలో గ్రావెల్ తవ్వకాలపై తహసీల్దారు గంగాధరరావును వివరణ కోరగా, ఇక్కడ బాధ్యతలు స్వీకరించి రెండు రోజులే అయ్యిందని, స్థానిక రెవెన్యూ సిబ్బందిని పంపి గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేయిస్తానని చెప్పారు.