నీటి తీరువాపై సర్కారు కన్ను

ABN , First Publish Date - 2022-02-16T06:13:19+05:30 IST

నీటి ప్రాజెక్టులు, చెరువుల కింద సాగు చేసే రైతుల నుంచి రావలసిన పన్ను (నీటి తీరువా) బకాయిలపై ప్రభుత్వం దృష్టిసారించింది.

నీటి తీరువాపై సర్కారు కన్ను

ఇకపై ఏటా చెల్లించాల్సిందే...

బకాయిలు వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌

జిల్లాలో సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.కోట్లు...

గ్రామాల వారీగా రైతుల వివరాలు సేకరిస్తున్న రెవెన్యూ

మరోవైపు ఆయకట్టు లెక్కలు తీస్తున్న జల వనరుల శాఖ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నీటి ప్రాజెక్టులు, చెరువుల కింద సాగు చేసే రైతుల నుంచి రావలసిన పన్ను (నీటి తీరువా) బకాయిలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు రెవెన్యూకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలో నీటి తీరువా బకాయిలు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లు వుంటాయని అధికారులు చెబుతున్నారు. 

నీటి పారుదల సౌకర్యం వున్న ప్రతి ఎకరా నుంచి నీటి తీరువా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ యంత్రాంగం గ్రామాల వారీగా వివరాల సేకరణలో పడింది. వారం, పది రోజులుగా తమ పరిధిలో నీటి తీరువా చెల్లించాల్సిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. పాత రికార్డులు పరిశీలించి ఆయకట్టు రైతుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. గ్రామాల వారీగా రూపొందించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. అందులో పేర్లు కలిగిన రైతులు గ్రామ సచివాలయాలు, మీ-సేవా కేంద్రాల్లో నీటి తీరువా చెల్లించాల్సి ఉంటుంది. బహుశా వచ్చే నెల నుంచి నీటి తీరువా వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టే అవకాశం వున్నదని గ్రామీణ ప్రాంతానికి చెందిన తహసీల్దారు ఒకరు తెలిపారు. 

నీటి తీరువా బకాయిల వసూలుకు నడుంబిగించిన ప్రభుత్వం జిల్లాలో తాజాగా ఆయుకట్టు వివరాలు సమర్పించాలని జల వనరుల శాఖను ఆదేశించింది. విశాఖ జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు రిజర్వాయర్ల కింద నీటి పారుదల వ్యవస్థ ఉంది. అందుబాటులో ఉన్న వివరాల మేరకు జిల్లాలో 10.42 లక్షల ఎకరాలకు నీటిని అందించే అవకాశం ఉన్నా...ప్రస్తుతం 4.29 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతుంది. భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన తాండవ రిజర్వాయర్‌ కింద 32,689 ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టు అయిన రైవాడ రిజర్వాయర్‌ కింద 15,344 ఎకరాలు, కోనాం కింద 12,638 ఎకరాలు, పెద్దేరు కింద 19,322 ఎకరాల ఆయకట్టు ఉంది. చిన్న నీటి పారుదల విభాగంలోని 15 ప్రాజెక్టుల నుంచి 12,092 ఎకరాలు, 247 చెరువుల కింద 59,065 ఎకరాలు, మరో 15 భారీ చెరువుల కింద 4,810 ఎకరాలు, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని 2,779 చెరువుల కింద 79,258 ఎకరాలు ఆయుకట్టు ఉంది. ఇవికాకుండా ఓపెన్‌ హెడ్‌ ఛానల్స్‌, గ్రోయిన్స్‌, ఆనకట్టల కింద 1,39,004 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈ ఆయకట్టు మొత్తం సాగులో ఉందా? లేదా? అనే సమాచారంతోపాటు ఇంకా అదనపు ఆయకట్టు కొత్తగా చేరిందా? అనే వివరాలు జల వనరుల శాఖ మండలాల వారీగా సేకరిస్తోంది. సాధారణంగా కాల్వలు, నాలుగు నెలలు నిరాటంకంగా నీరు ఇచ్చే చెరువుల కింద ఒక పంటకు వరికి రూ.200, రెండో పంటకు నీరిస్తే రూ.150...మొత్తం ఏడాదికి రూ.350 రైతు నీటి తీరువా కింద చెల్లించాలి. అదే చెరకు, అరటికి అయితే రూ.350, ఆక్వాకు మాత్రం రూ.500 వసూలు చేస్తున్నారు. నీటి తీరువా అనేది ఎప్పటినుంచో ఉంది. అయితే చాలాకాలంగా ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను వసూలు చేయడం లేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇకపై ఏటా నీటి తీరువాతో పాటు బకాయిలు కూడా వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

Read more