లంబసింగిలో గోల్డెన్ బెర్రీ
ABN , First Publish Date - 2022-11-02T01:02:47+05:30 IST
అత్యంత శీతల వాతావరణంతో ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగి, చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు అరుదైన ఉద్యాన పంటలను సాగుచేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పటికే స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడ్, తదితర పంటలను పండిస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్ర కశ్మీర్‌లో మరో కొత్తరకం పంట
ప్రయోగాత్మకంగా సాగు
ఆశాజనకంగా దిగుబడులు, ఆదాయం
వచ్చే ఏడాది సాగు విస్తీర్ణాన్ని పెంచుతానంటున్న అభ్యుదయ రైతు
చింతపల్లి, నవంబరు 1: అత్యంత శీతల వాతావరణంతో ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగి, చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు అరుదైన ఉద్యాన పంటలను సాగుచేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పటికే స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడ్, తదితర పంటలను పండిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో కొత్త రకం పంట చేరింది. లంబసింగి సమీపంలోని రాజుపాకలు గ్రామంలో అభ్యుదయ రైతు ఒకరు గత ఏడాది ‘గోల్డెన్ బెర్రీ’ పంటను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. దిగుబడులు ఆశాజనంగా వుండడంతోపాటు మంచి ఆదాయం కూడా వచ్చిందని చెబుతున్నారు. ‘గోల్డెన్ బెర్రీ’ పంట సాగు, దిగుబడులు, మార్కెటింగ్ గురించి గిరిజన రైతులకు అందిస్తున్న సమాచారం.
లంబసింగి, చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్టోబరు రెండో పక్షం నుంచి ఫిబ్రవరి వరకు శీతల వాతావరణం వుంటుంది. డిసెంబరులో ఐదు డిగ్రీల కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో స్థానిక రైతులు స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడ్, తదితర అరుఐదన పంటలను సాగుస్తున్నారు. ముఖ్యంగా లంబసింగి పరిసర ప్రాంతాల్లో 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగవుతున్నది. తూరుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన సాగిరాజు ఉదయ భాస్కర రాజు లంబసింగి సమీపంలోని రాజుపాకలు గ్రామంలో పది ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకి తీసుకుని ఆరేళ్ల నుంచి స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది స్ట్రాబెర్రీతోపాటు కొత్తగా ఎకరా విస్తీర్ణంలో ‘గోల్డెన్ బెర్రీ’ (కాశీ బుడ్డ పండ్లు) సాగు చేపట్టారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం నుంచి సెప్టెంబరులో పది వేల మొక్కలను దిగుమతి చేసుకునిపొలంలో నాటారు. మొక్కల కొనుగోలు, రవాణా ఖర్చులు కలిపి సుమారు లక్షల రూపాయలు అయ్యాయి. నవంబరు రెండో వారం నుంచి పండ్లు కోతకు వచ్చాయి. గత ఏడాది ఒక్కో మొక్కకు 200 గ్రాముల చొప్పున పండ్ల దిగుబడి వచ్చింది. లంబసింగి సందర్శనకు వచ్చిన పర్యాటకులు స్ట్రాబెర్రీలతో గోల్డెన్ బెర్రీలను కూడా కొనుగోలు చేశారు. 200 గ్రాములు రూ.80 చొపుక్పన విక్రయించానని, ఖర్చులుపోను రూ.1.5 లక్షలు మిగిలాయని ఉదయభాస్కరరాజు తెలిపారు.
ఆశాజనకంగా సాగు
సాగిరాజు ఉదయ భాస్కర రాజు
ఈ ఏడాది ఎకరా విస్తీర్ణంలో గోల్డెన్ బెర్రీ సాగు చేపట్టాను. గత ఏడాది పంట నుంచి విత్తనాన్ని సొంతంగా తయారు చేసుకోవడంతో సుమారు రూ.70 వేల వరకు మొక్కల కొనుగోలు ఖర్చు ఆదా అయ్యింది. ప్రస్తుతం మొక్కలు ఏపుగా ఎదగడంతోపాటు కాపు కూడా మొదలైంది. మరో 15 రోజుల్లో కోత మొదలవుంది. లంబసింగి వచ్చే పర్యాటకులే మాకు మార్కెటింగ్. చాలా వరకు పండ్లను వీరే కొనుగోలు చేస్తుంటారు. అయినప్పటికీ విశాఖలోని కొన్ని ప్రముఖ మాల్స్‌కు గోల్డెన్ బెర్రీలను సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకున్నాం. వచ్చే రెండు ఎకరాల్లో ఈ పంట సాగు చేపట్టాలని భావిస్తున్నాను.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది
బి.దివ్యసుధ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, బీసీటీ-కేవీకే, హరిపురం
గోల్డెన్ బెర్రీలు మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ పండ్లు నారింజ రంగులో పెద్ద సైజు ద్రాక్ష పండ్లలా గుండ్రంగా ఉంటాయి. పులుపు, తీపి కలగలిపిన రుచి వుంటుంది. ఈ పండ్లలో విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఒక కప్పు గోల్డెన్ బెర్రీలో పిండిపదార్థాలు 17.3 గ్రాములు, పీచు 3.6 గ్రాములు, ప్రోటీన్ 1.8 గ్రాములు, కొవ్వు ఒక గ్రాము, మిటమిన్ సీ 20ఎంజీ, రిబోప్లావిన్ 0.17, ఇనుము 1.24 ఎంజీ, భాస్వరం 33.9 మిల్లీగ్రాములు, విటమిన్-ఏ 35ఎంజీ వుంటాయి.