గిరిజన చట్టాలకు తూట్లు

ABN , First Publish Date - 2022-12-31T01:08:41+05:30 IST

గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘిస్తూ అదానీ గ్రూప్‌ కంపెనీల ప్రయోజనాలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సంఘం శుక్రవారం ‘ఛలో యర్రవరం’ కార్యక్రమాన్ని చేపట్టింది. తొలుత నిర్వాసిత ఆదివాసీలతో కలిసి సంఘం నాయకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

గిరిజన చట్టాలకు తూట్లు
యర్రవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆదివాసీలు

ఆదివాసీల హక్కులు ఉల్లంఘన

అదానీ ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యం

సీఎం జగన్మోహన్‌రెడ్డిపై గిరిజన సంఘం నేత అప్పలనర్స ధ్వజం

వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపు

20వ తేదీన కలెక్టరేట్‌ ముట్టడి

బాక్సైట్‌ తరహాలో ఉద్యమించి సత్తా చుపుతాం

గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్య

హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ‘ఛలో యర్రవరం’

చింతపల్లి, డిసెంబరు 30:

గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘిస్తూ అదానీ గ్రూప్‌ కంపెనీల ప్రయోజనాలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సంఘం శుక్రవారం ‘ఛలో యర్రవరం’ కార్యక్రమాన్ని చేపట్టింది. తొలుత నిర్వాసిత ఆదివాసీలతో కలిసి సంఘం నాయకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అప్పలనర్స మాట్లాడుతూ యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వల్ల వేలాది మంది గిరిజనులు నిర్వాసితులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలిసినప్పటికీ గిరిజన సంపదను దొడ్డిదారిన షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు సిద్ధపడడం దురదృష్టకరమని అన్నారు. ఐదో షెడ్యుల్డ్‌ ప్రాంత నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సిఫారసుతో కేంద్రం పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు హైడ్రో పవర్‌ ప్రాజెక్టు అనుమతులు మంజూరు చేశాయని ఆరోపించారు. అనంతగిరి మండలం నిమ్మలపాడు మైనింగ్‌ విషయంలో 1997లో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. జగన్‌పై నమ్మకంతో గత ఎన్నికల్లో ఆదివాసీలు వైసీపీ ఎమ్మెల్యేలను భారీ మెజారిటీతో గెలిపించారని, కానీ ఆయన సీఎం అయిన తరువాత గిరిజనులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన ప్రజల అభిప్రాయాలను గౌరవించని వైసీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

20న కలెక్టరేట్‌ ముట్టడి

గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకువ్యతిరేకంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, జనవరి 20వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అన్నారు. పెసా ఆమోదం, ప్రజాభిప్రాయ సేకరణ, గిరిజన సలహా మండలి తీర్మానం లేకుండా గిరిజనుల సంపదను ఏకపక్షంగా అదానీ గ్రూపునకు కట్టబెట్టేందుకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం చట్ట వ్యతిరేకమన్నారు. షెడ్యుల్డ్‌ ఏరియాలో ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నందున గిరిజనుల భూములు, అటవీ సంపదను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ మాధవి తమ సొంత భూములను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చినాసరే చట్టం ఒప్పుకోదన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై ఆదివాసీలు వెనక్కితగ్గేదిలేదని, కేబినెట్‌ ఆమోదాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. బాక్సైట్‌ తరహాలో ఉద్యమించి గిరిజనుల సత్తా ఏమిటో జగన్‌కి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గొందిపాకలు సర్పంచ్‌ సాగిన వరలక్ష్మి, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్‌, నాయకులు పి.లక్కు, సత్యనారాయణ, ఎస్‌.సూరిబాబు, ధారకొండ ఎంపీటీసీ సభ్యుడు బుజ్జిబాబు, యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ సభ్యులు గూడెపు చిన్నారావు, గోపాలకృష్ణ, రాజు, మంగరాజు, బాలన్న, నిర్వాసిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:08:42+05:30 IST