ఘాట్‌లో ఆగిన భారీ వాహనం

ABN , First Publish Date - 2022-08-04T06:52:12+05:30 IST

స్థానిక ఘాట్‌లోని ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద బుధవారం ఓ భారీ వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది.

ఘాట్‌లో ఆగిన భారీ వాహనం
పాడేరు ఘాట్‌లో ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద ఆగిపోయిన భారీ వాహనం

- రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం 

పాడేరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక ఘాట్‌లోని ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద బుధవారం ఓ భారీ వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో ఘాట్‌లో సుమారుగా రెండు గంటలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నుంచి పాడేరు వైపు వస్తున్న ఓ భారీ వాహనం ఘాట్‌లోని ఏసుప్రభు బొమ్మ మలుపు తిరుగుతూ ఘాట్‌ ఎక్కలేక వెనక్కి వెళ్లిపోయింది. దానిని ఘాట్‌ ఎక్కించేందుకు డ్రైవర్‌ ప్రయత్నించినా భారీ వాహనం కావడం, మలుపు అడ్డంగా తిరగడంతో ఫలితం దక్కలేదు. దీంతో ఘాట్‌ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి, మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీ వచ్చే వాహనం ఘాట్‌లో నిలిచిపోయాయి. సుమారుగా రెండు గంటల ప్రయత్నం తరువాత భారీ వాహనాన్ని ఘాట్‌ ఎక్కించడంతో ట్రాఫిక్‌ క్లియర్‌ అయింది. వాస్తవానికి ఘాట్‌ మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ తరచూ భారీ వాహనాలు ఘాట్‌లో రాకపోకలు సాగిస్తూ ఇలా ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగిస్తున్నాయని ప్రయాణికులు, వాహన చోదకులు వాపోతున్నారు. రవాణా, పోలీస్‌ అధికారులు స్పందించి ఘాట్‌ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-04T06:52:12+05:30 IST