కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి

ABN , First Publish Date - 2022-01-13T06:26:58+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత నోడల్‌ అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు.

కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ మల్లికార్జున, తదితరులు

నోడల్‌ అధికారులకు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశం

విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత నోడల్‌ అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. బుధవారం సాయంత్రం కొవిడ్‌ నోడల్‌ అధికారులు, వైద్యాధికారులు, తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ కరోనా విధుల నిర్వహణలో అధికారులందరికీ అనుభవం వున్నందున ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు ముఖ్యమని, అందువల్ల విధి నిర్వహణలో వున్న అధికారులు, సిబ్బంది, డబుల్‌ మాస్క్‌లు ధరించాలని సూచించారు. టెస్టింగ్‌ మేనేజ్‌మెంట్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, హెల్ప్‌ డెస్క్‌, ఆక్సిజన్‌ మేనేజ్‌మెంట్‌, రిపోర్ట్‌, కొవిడ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, హోమ్‌ క్వారంటైన్‌, హోమ్‌ ఐసోలేషన్‌, మెడిసిన్స్‌, అంబులెన్స్‌ మేనేజ్‌మెంట్‌, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ అండ్‌ కంటైన్‌మెంట్‌ కమిటీ ల్యాబ్‌, 104 కాల్‌ సెంటర్‌, మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌, తదితర కమిటీల నోడల్‌ అధికారులతో వారి విధుల నిర్వహణ, ఏర్పాట్లు, సమస్యలు, తదితర విషయాలపై సమీక్షించారు. టెస్ట్‌ పూర్తయిన వెంటనే రిపోర్టు అందించాలని, అందుకోసం అర్బన్‌, రూరల్‌, ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాటు చేయాలని సూచించారు. 108 అంబులెన్స్‌ల మరమ్మతులకు డీటీసీకి నిధులు మంజూరు చేయాలని సూచించారు. టెస్టింగ్‌ ల్యాబ్‌లో మూడు షిఫ్టుల్లో విధుల నిర్వహణకు ప్రొసీడింగ్స్‌ జారీ చేయాలని ఏఎంసీ ప్రిన్సిపాల్‌కు ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు ఇన్‌చార్జిలుగా 104 కాల్‌ సెంటర్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని, దీనిపై జడ్పీ సీఈవో దృష్టిసారించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ పి.అరుణ్‌బాబు, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ, నోడల్‌ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-13T06:26:58+05:30 IST