చికిత్స పొందుతూ జీసీసీ సేల్స్‌మన్‌ మృతి

ABN , First Publish Date - 2022-12-15T01:10:36+05:30 IST

మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గిరిజన సహకార సంస్థ కాంట్రాక్టు సేల్స్‌మన్‌ సొలబం నాగంనాయుడు(40) చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చికిత్స పొందుతూ జీసీసీ సేల్స్‌మన్‌ మృతి
నాగంనాయుడు (ఫైల్‌)

చింతపల్లి, డిసెంబరు 14: మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గిరిజన సహకార సంస్థ కాంట్రాక్టు సేల్స్‌మన్‌ సొలబం నాగంనాయుడు(40) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో బెన్నవరం గ్రామానికి చెందిన జీసీసీ సేల్స్‌మన్‌ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. క్షతగాత్రుడ్ని స్థానికులు చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో చేర్చగా, ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు కేజీహెచ్‌కు తరలించారు. అయితే కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. బుధవారం ఉదయం చికిత్స పొందుతూ నాగంనాయుడు మృతి చెందాడు. అతని మృతి పట్ల జీసీసీ డీఎం డి.సింహాచలం, సూపరింటెండెంట్‌ లొంజ రమణమూర్తి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే నాగంనాయుడు మృతి దురదుష్టకరమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.

మద్యం దుకాణం వద్ద ఘర్షణ

ఒకరిపై ఒకరు దాడి.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు

ఎస్‌.రాయవరం, డిసెంబరు 14 : మద్యం దుకాణం వద్ద ఇటీవల ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, తీవ్ర గాయాలకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాదరావు బుధవారం తెలిపిన వివరాలివి. మండలంలోని రామయ్యపట్నానికి చెందిన పోలిశెట్టి గోవిందరావు (40), పుర్రె హరిబాబు ఈ ఇద్దరూ ఈ నెల ఐదో తేదీ రాత్రి చినగుమ్ములూరులో గల మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ హరిబాబు తాను చేతబడి చేస్తున్నానని తప్పుగా చెబుతున్నావంట ఏమిటని గోవిందరావును ప్రశ్నించాడు. ఇదికాస్తా వివాదంగా మారడంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో హరిబాబు పక్కనే ఉన్న చెక్క పేడుతో గోవిందరావు తలపై కొట్టాడు. అయితే గోవిందరావు ఈ విషయాన్ని తన ఇంట్లో చెప్పకుండా గోప్యంగా ఉంచాడు. ఈ నెల ఏడో తేదీ ఉదయం గోవిందరావు తనకు కళ్లు తిరుగుతూ తల నొప్పిగా ఉందని భార్య నాగలక్ష్మికి చెప్పడంతో ఏం జరిగిందని ఆమె ప్రశ్నించింది. మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణను వివరించాడు. వెంటనే నాగలక్ష్మి తన భర్తను అడ్డరోడ్డులో గల ఓ ప్రవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్సలు చేయించింది. ఫలితం లేకపోవడంతో ఈ నెల పదో తేదీన ఆర్‌ఎంపీ వైద్యుడికి చూపించినా తగ్గలేదు. మంగళవారం తలనొప్పి ఎక్కువై నోటి నుంచి నురగలు రావడంతో తునిలోని ప్రవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ గోవిందరావును పరీక్షించిన వైద్యులు తలలో రక్తం గూడు కట్టిందని విశాఖ కేజీహెచ్‌కు తీసుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె గోవిందరావును విశాఖలో గల ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఎస్‌.రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, సీఐ నారాయణరావులు నక్కపల్లి ఆస్పత్రిలోని మార్చురీకి తెచ్చి ఉంచిన మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. ఇదిలావుంటే, గోవిందరావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రత్నంపేటలో చోరీ

3 తులాల బంగారం, రూ.8 వేల నగదు అపహరణ

రోలుగుంట, డిసెంబరు 14: మండలంలోని రత్నంపేటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మూడు తులాల బంగారం, రూ.8 వేల నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగకార్తీక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రత్నంపేటకు చెందిన శనివాడ నాగేశ్వరరావు అయ్యప్పమాల ధారణ అనంతరం యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చారు. ఈ నెల 2న ఇంట్లో భార్య లక్ష్మి, చుట్టుపక్కల బంధువులతో కలిసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజకు ముందు రోజు బీరువాలో ఉన్న బంగారం, నగదు తరువాత కనిపించకపోవడంతో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజా కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులే చోరీ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

రంగురాళ్లు తవ్విన నలుగురిపై కేసు

గొలుగొండ, డిసెంబరు 14: మండలంలోని పప్పుశెట్టిపాలెం వద్ద ఆరిలోవ అటవీ ప్రాంతంలో రంగుగురాళ్లు తవ్వకాలు జరిపిన నలుగురిపై కేసు నమోదు చేసినట్టు అటవీ రేంజ్‌ అధికారి లక్ష్మీనరసింహం తెలిపారు. నర్సీపట్నం మండలం లింగాపురం గ్రామానికి చెందిన పొట్టికూరి స్వామినాయుడు, గొలుగొండ మండలం అడ్డల్లోవ గ్రామానికి చెందిన సామల లోవబాబు, సామల దుర్గాప్రసాద్‌, సామల అప్పలరాజులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు చెప్పారు.

నాలుగు లీటర్ల సారాతో వ్యక్తి అరెస్టు

కృష్ణాదేవిపేట, డిసెంబరు 14: కొయ్యూరు మండలం రత్నంపేట గ్రామానికి చెందిన అరిమెల నారాయణ నుంచి నాలుగు లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ తెలిపారు. కొంగసింగిలో విక్రయించేందుకు సారా తెస్తున్నట్టు అందిన సమాచారం మేరకు బుధవారం నిఘా వేసి పట్టుకున్నామని చెప్పారు.

Updated Date - 2022-12-15T01:10:38+05:30 IST