కన్నులపండువగా గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం

ABN , First Publish Date - 2022-01-30T06:23:00+05:30 IST

గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. సతకంపట్టులోని ఆలయంలో అమ్మవారికి తెల్లవారుజామున నాలుగు గంటలకు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.

కన్నులపండువగా గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం
ఉత్సవంలో దేవతామూర్తుల అలంకరణలో నాట్యం చేస్తున్న కళాకారులు

భారీగా తరలివచ్చిన భక్తజనం

ఆకట్టుకున్న నేలవేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రత్యేక ఆకర్షణగా కోల్‌కతా ట్రిక్‌ లైటింగ్‌


అనకాపల్లి టౌన్‌, జనవరి 29: గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. సతకంపట్టులోని ఆలయంలో అమ్మవారికి తెల్లవారుజామున నాలుగు గంటలకు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు గౌరీపరమేశ్వరులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. ఆదివారం రాత్రి వరకు పురవీధుల్లో ఊరేగింపు అనంతరం అనుపు మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్టు కమిటీ చైర్మన్‌ సంతోశ్‌ అప్పారావునాయుడు తెలిపారు. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేషాలు, విచిత్ర వేషధారణలు, విజయనగరం కళాకారుల పులివేషాలు, బుట్టబొమ్మల ప్రదర్శన, మండపేట కళాకారుల గరిడి కోలాటం, తాడేపల్లిగూడెం కళాకారుల నవదుర్గల నృత్య ప్రదర్శన, అమలాపురం కళాకారుల గరగల నృత్యం, ఏలేశ్వరం కళాకారుల తీన్‌మార్‌, రాజమండ్రి కళాకారుల గోవింద గోవింద ప్రదర్శన, విశాఖపట్నం కోలాటాలు, పొడుగుకాళ్ల మనిషి వేషాలు ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి గవరపాలెంలోని రహదారులన్నీ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులతో సందడిగా మారాయి. ఎక్కువగా మహిళలు పురవీధుల్లో తిరిగి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన కోల్‌కతా లైటింగ్‌ను ప్రత్యేకంగా తిలకించి సెల్ఫీలు తీసుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు కారణంగా రాత్రి పది గంటలతోటే ఉత్సవాన్ని ముగించాల్సి ఉండడంతో అందుకు తగ్గట్టుగానే కమిటీ ఏర్పాట్లు చేసింది. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రింగురోడ్డు సమీపంలోని సంతోషిమాత ఆలయ ముఖద్వారం వద్ద బాణసంచా వెలుగులను తిలకించిన భక్తులు ఎంతో సంబరపడ్డారు. ఉత్సవంతో గవరపాలెంలోని రోడ్లే కాకుండా పట్టణంలోని ఆలయానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ జనాలతో కిటకిటలాడాయి. 

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, కార్పొరేటర్‌ మాదంశెట్టి చినతల్లి, టీడీపీ నాయకులు బీఎస్‌ఎంకే జోగినాయుడు, మళ్ల సురేంద్ర, పట్టణ సీఐ ఎల్‌. భాస్కరరావు, ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ తదితరులు గౌరీపరమేశ్వరును దర్శించుకున్నారు. వీరిని ఉత్సవ కమిటీ చైర్మన్‌ కొణతాల సంతోశ్‌ అప్పారావునాయుడు సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు. అలాగే నూకాంబిక ఆలయ ఈవో బీఎల్‌ నగేశ్‌ ఆలయం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. ఉత్సవంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కొణతాల శ్రీనివాసరావు, కొణతాల నూకమహలక్ష్మినాయుడు, ఆలయ ప్రతినిధులు కొణతాల మురళీకృష్ణ, కోరిబిల్లి సత్యనారాయణ, మద్దాల చిరంజీవి, పొలిమేర అచ్చియ్యనాయుడు, పెంటకోట సన్యాసినాయుడు, గండెపల్లి మురళీ తదితరులు పాల్గొని ఉత్సవాన్ని పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ బి.సునీల్‌ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-01-30T06:23:00+05:30 IST