చెత్త ఆలోచన

ABN , First Publish Date - 2022-08-10T06:39:34+05:30 IST

చెత్త సేకరణకు యూజర్‌ చార్జీల వసూలు పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా సరే మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు మాత్రం వెనక్కితగ్గడం లేదు.

చెత్త ఆలోచన

పొదుపు సంఘాల సభ్యుల నుంచి చెత్త పన్ను వసూలుకు జీవీఎంసీ యత్నం

ప్రతి ఒక్కరి నుంచి ఒకేసారి ఆరు నెలల చార్జీలు రికవరీ

అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని యూసీడీ పీడీకి ఉన్నతాధికారుల ఆదేశం

ప్రతి సంఘంతోనూ తీర్మానం చేయించే బాధ్యత ఆర్‌పీలకు అప్పగింత

తీవ్రస్థాయిలో మండిపడుతున్న మహిళా సంఘాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చెత్త సేకరణకు యూజర్‌ చార్జీల వసూలు పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా సరే మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు మాత్రం వెనక్కితగ్గడం లేదు. ఏదో విధంగా చెత్త పన్నును వసూలు చేయాలనే ధోరణితోనే మొండిగా ముందుకువెళుతున్నారు. యూజర్‌ చార్జీలు వసూలు చేయలేమంటూ వార్డు సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు చేతులెత్తేయడంతో మహిళా స్వయం సహాయక సంఘాలపై పడ్డారు. ప్రతి సభ్యురాలి నుంచి ఆరు నెలల చార్జీలను ఒకేసారి కట్టించేందుకు వీలుగా అన్ని సంఘాలతోనూ తీర్మానం చేయించాలంటూ ఆర్‌పీ (రీసోర్స్‌ పర్సన్‌)లను ఆదేశించారు.

జీవీఎంసీ పరిధిలో చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలు వసూలుచేయడం గత ఏడాది అక్టోబరు నుంచి ప్రారంభించారు. మురికివాడల్లో నివాసాలకు నెలకు రూ.60, ఇతర ప్రాంతాల్లో నివాసాలకు రూ.120 చొప్పున వసూలు చేసేలా కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. ఇలా యూజర్‌ చార్జీలు ద్వారా వసూలైన మొత్తాన్ని నగరంలో పారిశుధ్య నిర్వహణ, చెత్త తరలింపు వాహనాలకు అద్దె చెల్లింపు కోసం వెచ్చించనున్నట్టు ప్రకటించారు. యూజర్‌ చార్జీల వసూలు బాధ్యతను వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు అప్పగించడంతోపాటు వారికి టార్గెట్లు నిర్దేశించారు. అయితే యూజర్‌ చార్జీల చెల్లింపునకు నగర వాసులు ముందుకు రాకపోగా, వాదనకు దిగుతుండడంతో వారంతా చేతులెత్తేశారు. చివరకు వార్డు సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి పెంచేందుకు అధికారులు మెమోలు జారీచేసినా సరే ఫలితం కనిపించలేదు. దీంతో జీవీఎంసీ అధికారులు యూజర్‌ చార్జీలను ఎలాగైనా రాబట్టాలనే పట్టుదలతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా అందజేసే పింఛన్లు నుంచి మినహాయించే ప్రయత్నం చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో వెనక్కితగ్గారు. తాజాగా మహిళా స్వయం సహాయక సంఘాలపై దృష్టిసారించారు. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 32,184 మహిళా సంఘాలు ఉండగా...వాటిలో 3.8 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. సభ్యులను పొదుపు, స్వయం ఉపాధి అంశాల్లో చైతన్యపరిచేందుకు వీలుగా ప్రతి 25 గ్రూపులకు ఒక రీసోర్స్‌ పర్సన్‌ (ఆర్‌పీ)ను నియమించారు. నగరంలో ప్రస్తుతం 300 మంది ఆర్‌పీలు ఉన్నారు. యూజర్‌ చార్జీలు వసూలు కాక...క్లాప్‌ వాహనాలకు గత రెండు నెలలుగా అద్దె బకాయిపడడంతో ఆ మొత్తాన్ని తక్షణం రాబట్టుకునేందుకు వీలుగా మహిళా సంఘాల నుంచి యూజర్‌ చార్జీలను వసూలు చేయాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలంటూ జీవీఎంసీ ఉన్నతాధికారులు సోమవారం యూసీడీ అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశమే తరువాయి అన్నట్టు యూసీడీ పీడీ నగరంలోని ఆర్‌పీలందరికీ వాట్సాప్‌లో యూజర్‌ చార్జీల వసూలుపై ఒక మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. ప్రతి సభ్యురాలి నుంచి ఆరు నెలలు యూజర్‌ చార్జీలను ఒకేసారి కట్టించాలని అందుకోసం ప్రతి సంఘంతోనూ తీర్మానం చేయించాలని ఆర్‌పీలను ఆదేశించారు. ముందుగా యూజర్‌ చార్జీలు చెల్లింపుపై ప్రతి సభ్యురాలికి అవగాహన కల్పించడం మొదలుపెట్టాలని ఆదేశించడంతో ఆర్‌పీలు తమ పరిధిలోని మహిళా సంఘాలకు వాట్సాప్‌ గ్రూపుల్లో అధికారుల ఆదేశాలను పోస్ట్‌ చేసి, యూజర్‌ చార్జీలను చెల్లించాలని కోరుతున్నారు. దీనిపై మహిళా సంఘాల సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. యూజర్‌ చార్జీలను వసూలు చేయడానికి మహిళా సంఘాలే కనిపించాయా? అంటూ అధికారుల తీరును తప్పుబడుతున్నారు. దీంతో యూసీడీ సిబ్బంది, ఆర్‌పీలు ఈ అంశంలో ఎలా ముందుకువెళ్లాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. 

Updated Date - 2022-08-10T06:39:34+05:30 IST