గంజాయితో ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2022-11-12T01:17:22+05:30 IST

గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.

గంజాయితో ముగ్గురి అరెస్టు

గూడెంకొత్తవీధి, నవంబరు 11: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు, వారికి సహకరించిన ఆర్టీసీ కండక్టర్‌ను ఉన్నట్టు చెప్పారు. నిందితుల నుంచి 31 కిలోల గంజాయి, రూ.39 వేల నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. సీఐ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జీకే వీధి జంక్షన్‌లో ఎస్‌ఐ అప్పలసూరి, పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. సీలేరు నుంచి వస్తున్న పాడేరు ఆర్టీసీ బస్సును తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు కిటికీల నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా తుకుమ్‌ గ్రామానికి చెందిన ముబారక్‌ బేగ్‌ జాఫర్‌ బేగ్‌, సలీం సహా ఫరీమ్‌ సహాగా తెలిపారు. దుప్పులవాడ పంచాయతీ బంధవీధిలోని కిల్లో అప్పారావును కలిసి గంజాయి కావాలని కోరారు. దీంతో అతను రూ.30 వేలు నగదు తీసుకొని ఒడిశా నుంచి 31 కిలోల గంజాయిని తీసుకొచ్చి అందజేశాడు. తనతో సంబంధాలు ఉన్న పాడేరు డిపో ఆర్టీసీ కండక్టర్‌ అచ్యుతరాజుతో మహారాష్ట్రకు చెందిన వ్యాపారులను, గంజాయిని చింతపల్లి వరకు తరలించాలని అప్పారావు కోరాడు. దీనికి కండక్టర్‌ అంగీకారం తెలిపి సీలేరు నుంచి పాడేరు తిరుగు ప్రయాణమైన బస్సులో దుప్పులవాడ వద్ద ఇద్దరు వ్యాపారులు, గంజాయి ఎక్కించుకుని చింతపల్లి వరకు వెళ్లేందుకు ఎక్కించుకున్నాడు. జీకే వీధి జంక్షన్‌లో పోలీసులకు పట్టుబడడంతో మహారాష్ట్ర వ్యాపారులు, కండక్టర్‌ను అరెస్టు చేశారు. బందవీధికి చెందిన అప్పారావు పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2022-11-12T01:17:22+05:30 IST

Read more