రూ.200 కోట్లకు కుచ్చుటోపీ?

ABN , First Publish Date - 2022-04-24T07:11:17+05:30 IST

కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన జయలక్ష్మి పరస్పర పరపతి సహకార సంఘం (మ్యాక్స్‌ సొసైటీ) విశాఖ బ్రాంచీ మూతపడింది.

రూ.200 కోట్లకు కుచ్చుటోపీ?

బోర్డు తిప్పేసిన జయలక్ష్మి సొసైటీ

పనిచేయని సిబ్బంది ఫోన్లు

ఎక్కువ వడ్డీ చెల్లిస్తామంటూ భారీగా డిపాజిట్లు సేకరణ


విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన జయలక్ష్మి పరస్పర పరపతి సహకార సంఘం (మ్యాక్స్‌ సొసైటీ) విశాఖ బ్రాంచీ మూతపడింది. ఎంవీపీ కాలనీలోని ఉషోదయ జంక్షన్‌లో గల ఈ సంఘం కార్యాలయాన్ని కొద్దిరోజులుగా తెరవడం లేదు. దీనికితోడు సంఘ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు రింగ్‌ అవుతున్నా తీయడం లేదు. విచిత్రమేమిటంటే బ్రాంచి కార్యాలయం ప్రతిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తుందని ఈ నెల 19న నోటీస్‌ అతికించారు. కానీ అంతకు ముందు కొన్నిరోజుల నుంచి కార్యాలయం తెరవడం లేదని సమీపంలో గల ఒక దుకాణ యజమాని చెప్పారు. 

ఒక్క విశాఖలోని బ్రాంచి నుంచి దాదాపు రూ.200 కోట్ల డిపాజిట్లను యాజమాన్యం, డైరెక్టర్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 23 ఏళ్ల క్రితం కాకినాడలో జయలక్ష్మి మ్యాక్స్‌ సొసైటీ ఏర్పాటైంది. ఆ తరువాత రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం...ఇలా పలుచోట్ల బ్రాంచీలు నెలకొల్పారు. ఓ వర్గంలో తమకున్న పరిచయాలను ఆసరాగా తీసుకుని ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల నుంచి డిపాజిట్లు సేకరించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపించడంతో పలువురు రూ.ఐదు లక్షలు, రూ.కోటి, రూ.రెండు కోట్ల వరకు డిపాజిట్‌ వేశారు. కాలపరిమితిని అనుసరించి ఆరు నుంచి 13.2 శాతం వడ్డీ చెల్లిస్తామంటూ దాదాపు రూ.200 కోట్ల వరకు సేకరించారు. అయితే సంఘం సొమ్మును ఇతర మార్గాల ద్వారా మళ్లించడంతో కొద్దినెలలుగా డిపాజిట్లపై వడ్డీ చెల్లించడం లేదు. గట్టిగా నిలదీస్తే రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సంఘం స్థాపకులు, డైరెక్టర్లు ఒక్కొక్కరిగా పరారీ కావడంతో కాకినాడలో ప్రఽధాన కార్యాలయంతోపాటు విశాఖ, భీమవరం బ్రాంచీలు మూతపడ్డాయి. దీనిపై కాకినాడ సహకార శాఖ అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. విశాఖలో కార్యాలయంలో డిపాజిట్ల మళ్లింపుపై కాకినాడ నుంచి సహకార శాఖ అధికారులు వచ్చి రికార్డులు పరిశీలించారు. 

Updated Date - 2022-04-24T07:11:17+05:30 IST