ఆధారాల అన్వేషణే కీలకం

ABN , First Publish Date - 2022-09-25T06:53:06+05:30 IST

నేర పరిశోధనలో ఆధారాల కోసం న్యాయవాది చేసే అన్వేషణే కేసు గెలుపోటములను నిర్దేశిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు అన్నారు.

ఆధారాల అన్వేషణే కీలకం
న్యాయ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు


- కేసు గెలుపోటములను నిర్దేశించేది ఇదే

- న్యాయ విద్యార్థులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు దిశానిర్దేశం

- దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో పోటీలకు ముఖ్య అతిథిగా హాజరు


సబ్బవరం, సెప్టెంబరు 24 : నేర పరిశోధనలో ఆధారాల కోసం న్యాయవాది చేసే అన్వేషణే కేసు గెలుపోటములను నిర్దేశిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు అన్నారు. సబ్బవరం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో వర్సిటీ లీగల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో మొదటిసారి నేర పరిశోధనపై పోటీలు ఏర్పాటయ్యాయి. జాతీయస్థాయిలో 106 జట్లు పాల్గొన్నాయి. ‘నేరం జరిగిన చోట ఆధారాలను ఏ విధంగా సేకరించాలో న్యాయ విద్యార్థులకు నేర్పించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. తొలుత ‘నేరము దృశ్యం ఇన్విస్టిగేషన్‌4.0ని’ న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ప్రారంభించి ముఖ్య అతిథిగా ప్రసగించారు. కేసులో విజయం సాఽధించడానికి దర్యాప్తు, విచారణలో సాక్ష్యం ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. దాని ఆధారంగానే కేసు విచారణ జరుగుతుందని, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆధారాల కోసం న్యాయవాదులు ఎంతో శ్రమపడాల్సి వస్తుందని వివరించారు. ఒక విద్యార్థి సంపాదించిన ప్రతి విజ్ఞానం చాలా అవసరమన్నారు. ఇటువంటి పోటీలను నిర్వహిస్తున్న డీఎస్‌ఎల్‌ఎన్‌యూను ఆయన అభినందించారు. మరో గౌరవ అతిథి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ న్యాయవాదికి ఉండవలసిన లక్షణాలను వివరించారు. న్యాయ విద్యార్థులు ఎక్కువగా ప్రాక్టీస్‌లోకి రావాలని, అలా వచ్చేవారు పూర్తి కేసులను స్టడీ చేసిన తరువాతే కోర్టులో అడుగు పెట్టాలని సూచించారు.  సభాధ్యక్షులు వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ నేరం జరిగిన చోట ఆధారాలు సేకరించడంలోని మెళకువలను ఈ మధ్య కొన్ని కేసులు విచారించడం ద్వారా వివరించడం జరిగిందన్నారు.  అధ్యాపక సలహాదారు డాక్టర్‌ నందిని సీపీ బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో అనకాపల్లి జ్యుడీషియల్‌ అధికారులు, సీనియర్‌ న్యాయవాది శ్రీసత్యప్రసాద్‌, రిజిస్ట్రార్‌ కె.మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.Read more