ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఎట్టకేలకు ఇంక్యుబేషన్‌ కేంద్రం

ABN , First Publish Date - 2022-10-07T06:27:39+05:30 IST

అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఎట్టకేలకు ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగుమమైంది. ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో చెరకు, బెల్లం, చిరుధాన్యాలు, పనసతో వివిధ ఆహార పదార్థాల తయారీకి ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఎట్టకేలకు ఇంక్యుబేషన్‌ కేంద్రం
అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం

 రూ.3.5 కోట్లను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం

అనకాపల్లి అగ్రికల్చర్‌, అక్టోబరు 6 : అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఎట్టకేలకు ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగుమమైంది. ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో చెరకు, బెల్లం, చిరుధాన్యాలు, పనసతో వివిధ ఆహార పదార్థాల తయారీకి ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రూ.3.5 కోట్లను ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కింద సమకూర్చనున్నారు. మిగిలిన రూ.23.75 లక్షలు ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భరించనుంది. ఈ కేంద్ర ఏర్పాటు ఏడాదిలోనే పూర్తి కావాలని కేంద్రం నిర్దేశించింది. ఈ పథకంలో భాగంగా ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.కోట ఖర్చుతో ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఒక భవనాన్ని నిర్మించనున్నారు. అలాగే రూ.25 లక్షల వ్యయం తో ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ నిర్మిస్తారు. ఈ కేంద్రం ఏర్పాటుకు ఏడీఆర్‌ పీవీకే జగన్నాథరావు రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం లభించింది. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి నిధుల మంజూరుకు కృషి చేశారు.

 ఇంక్యుబేషన్‌ కేంద్రం అంటే...

సమస్యలు అధికమై బెల్లం తయారీ లాభసాటిగా లేకపోవడం వల్ల బెల్లం ఆధునిక ఉత్పత్తి పద్ధతులపై, విలువ ఆధారిత ఉత్పత్తి తయారీపై పరిశోధకులు దృష్టి పెడుతున్నారు. పది నుంచి పదిహేను కిలోల బెల్లం దిమ్మల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌, రవాణా తదితరాలకు సంబంధించి ప్రస్తుత కాలంలో సమస్యలను ఎదుర్కొంటున్నది. దీనికి ప్రత్యామ్నాంగా బెల్లం ఆధునిక ఉత్పత్తి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పద్ధతులను ఉప యోగించి, చిరుధాన్యాలు తదితర ఉత్పత్తులతో ఆహార పదార్థాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగంలో అంకుర పరిశ్రమలు నెల కొల్పేందుకు సాయపడే ఇంక్యుబేషన్‌ కేంద్రాల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. అంతగా లాభాపేక్షలేని ఇంక్యుబేషన్‌ సెంటర్లు పరిశోధన, మార్కెటింగ్‌ వంటి అంశాలలో చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం వహిస్తాయి అని  చెప్పవచ్చు. 

Read more