అన్నదాతకు తుఫాన్‌ గండం

ABN , First Publish Date - 2022-12-10T01:09:07+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండస్‌’ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో శుక్రవారం వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచే పలుచోట్ల దఫదఫాలుగా వర్షం కురుస్తున్నది. ఈదురు గాలులు వీస్తున్నాయి.

అన్నదాతకు తుఫాన్‌ గండం
మార్టూరులో కోతలు పూర్తయి పొలంలో ఉన్న వరి పనలు

ఈదురు గాలులతో మోస్తరు వర్షం

హడావుడి వరి కుప్పలు వేసిన రైతులు

కూలీలు లభించక పలుచోట్ల పనలమీదనే ఉంచాల్సిన పరిస్థితి

పంట పక్వానికి వచ్చిన పొలాల్లో వరి కోతలు వాయిదా

గాలులతో భారీ వర్షం కురిస్తే పంట చేతికి దక్కదని రైతులు ఆందోళన

ముందుస్తు రక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన

అనకాపల్లి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మాండస్‌’ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో శుక్రవారం వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచే పలుచోట్ల దఫదఫాలుగా వర్షం కురుస్తున్నది. ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో వరి రైతులు కలవరపడుతున్నారు. వరి కోత కోసిన పొలాల్లో హడావుడిగా కుప్పలు వేస్తున్నారు. అయితే కూలీల కొరత ఏర్పడడంతో పలువురు రైతులు కుప్పలు వేయలేక వరి పనలను పొలంలోనే వుంచేశారు. శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తుఫాన్‌ కారణంగా గత మూడు రోజుల నుంచి వరి కోతలు ఆపేశారు. ఆదివారం వరకు వరి పంటను కోయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పండిన వరి పంటను వారం పాటు కోయకుండా వుంచితే గింజ రాలిపోతుందని, గాలులు వీచి పైరు నేల వాలుతుందని, భారీ వర్షాలు కురిస్తే వరి కంకులు నీట మునిగి ధాన్యం రంగు మారడం లేదా మొలకెత్తడం జరుగుతుందని వాపోతున్నారు. ఇదిలావుండగా అడపాదడపా వర్షం కురుస్తుడడంతోపాటు ఈదురు గాలులు వీస్తుండడంతో సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగింది

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 1.39 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ముందుగా నాట్లు వేసి పొలాల్లో ఇప్పటికే కోతలు కోసి, కుప్పలు పెట్టారు. గత వారం రోజుల్లో సుమారు 20 శాతం.. అంటే 30 వేల ఎకరాల్లో వరి కోతలు కోసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరి పనలు బాగా ఎండిన తరువాత కుప్పలు వేస్తుంటారు. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం/ తుఫాన్‌ ప్రభావంతో గత మూడు రోజల నుంచి ఆకాశం మేఘావృతమై వుంది. ఎండ కాయకపోవడంతో వరి పనులు పూర్తిగా ఆరలేదు. అయితే తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం వుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో శుక్రవారం రైతులు ఆదరాబాదరాగా వరి పనలను కుప్పలు వేస్తున్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కూలీల అవసరం ఏర్పడడంతో పలు గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. దీంతో కొంతమంది రైతులు కుప్పలు వేయలేక వరి పనలను పొలంలోనే వుంచేశారు. శుక్రవారం రాత్రి, శనివారం భారీ వర్షాలు కురిస్తే వరి పనలు నీటిలో మునిగిపోతాయని, ధాన్యం రంగుమారిపోయి మొలకెత్తే అవకాశం కూడా వుందని ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా వరి పంట పక్వానికి వచ్చినప్పటికీ తుఫాన్‌ కారణంగా పలువురు రైతులు కోతలను వాయిదా వేసుకున్నారు. ఆదివారం వరకు కోతలు కోయవద్దని అధికారులు చెప్పడంతో వీరు కలవరపడుతున్నారు. ఈదులు గాలులు వీచి వరి పైరు నేల వాలితే గింజ రాలిపోతుందని, వర్షాలు కురిస్తే కంకులు నీట మునిగి ధాన్యం రంగు మారుతుందని, గింజ మొలకెత్తే ప్రమాదం కూడా వుందని వాపోతున్నారు.

కోసిన వరి పైరును కాపాడుకోండి

అనకాపల్లి అగ్రికల్చరల్‌, డిసెంబరు 9: వరి కోతలు పూర్తయిన పొలంలో పనల మీదన ఉన్న పంటను, అదే విధంగా కోసిన పైరు ఆరకుండానే కుప్పలు వేసుకున్న రైతులు పలు జాగ్రతలు తీసుకోవాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త కేవీ రమణమూర్తి, జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ భవానీ సూచించారు. వారు చెప్పిన సమాచారం...

వర్షపునీరు పొలం నుంచి బయటకు పోయేలా కాలువలు తీయాలి. కోత కోసి, కుప్ప వేయని పొలాల్లో వరి పనలపై ఐదు శాతం ఉప్పు నీటి ద్రావణాన్ని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల గింజ రాలడం, మొలకెత్తడం వంటివి జరగవు. వరి కుప్పలపై టార్పాలిన్‌లు పరిచి వర్షపు నీరు కుప్పలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. టార్పాలిన్‌లు అందుబాటులో లేకపోతే ఉప్పు కట్టలను కుప్పల పైభాగంలో వత్తుగా వేయాలి.

Updated Date - 2022-12-10T01:09:08+05:30 IST