తుఫాన్‌తో రైతన్న వర్రీ
ABN , First Publish Date - 2022-12-11T00:41:29+05:30 IST
జిల్లాలోని వరి రైతులను మాండస్ తుఫాన్ భయం వెంటాడుతోంది. రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తీర ప్రాంత మండలాలు రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి, ఎస్.రాయవరంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో జల్లులు కురిశాయి. తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఆదివారం సెలవు అయినా అందుబాటులో ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. కాగా చాలా చోట్ల వరి పంటలు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- జిల్లాలో 13.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
- పలు చోట్ల నేలకొరిగిన వరి పంటలు
- వర్షాలు కొనసాగి తడిస్తే నష్టమని రైతుల్లో గుబులు
అనకాపల్లి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని వరి రైతులను మాండస్ తుఫాన్ భయం వెంటాడుతోంది. రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తీర ప్రాంత మండలాలు రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి, ఎస్.రాయవరంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో జల్లులు కురిశాయి. తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఆదివారం సెలవు అయినా అందుబాటులో ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. కాగా చాలా చోట్ల వరి పంటలు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఖరీఫ్ వరి సాగు 1.39 లక్షల ఎకరాల్లో చేపట్టారు. గత రెండు రోజులుగా కొన్ని మండలాల్లో వరి కోతలు మొదలు పెట్టారు. వ్యవసాయశాఖ నివేదికల ప్రకారం జిల్లాలో 14 వేల ఎకరాల్లో మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. ఇంతలో మాండస్ తుఫాన్ దూసుకొచ్చింది. శనివారం రోజంతా ఒక మోస్తరు వర్షం కురవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే వరి పనలు నీట మునిగి నష్టాలు తప్పవని భయపడుతున్నారు. జిల్లాపై తుఫాన్ ప్రభావం అంతగా ఉండదని చెబుతున్నా, గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో వరి రైతులు కోతలు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన పంటను ఒబ్బిడి చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు సూచించారు. దీంతో రైతులు ఆదరాబాదరాగా కోసిన పంటను కుప్పలు వేసుకొని ఒబ్బిడి చేసుకున్నారు. శనివారం మండల వ్యవసాయాధి కారులతో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు జూమ్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయాధికారులు స్థానికంగా ఉండి వరి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందజేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే శనివారం నాటికి ఎక్కడా వరి పంటకు నష్టం జరిగినట్టు నమోదు కాలేదు.
- ఎస్.రాయవరం మండలంలో సుమారు ఐదు వేల మంది రైతులు 9100 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేశారు. కొన్ని చోట్ల తుఫాన్ కారణంగా వీచిన గాలులకు వరి దుబ్బులు నెలకొరిగాయి. వర్షం ఉధృతి పెరిగితే వంట దెబ్బతినే అవకాశం ఉంది.
- కోటవురట్ల మండలంలోని జల్లూరు, కైలాసపట్నం, లింగాపురం, బీకేపల్లి, యండపల్లి, సుంకపూర్ తదితర గ్రామాల్లో గాలులకు వరిచేను నేలకొరిగింది.
- ఎలమంచిలి వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరి రైతులు కోతలు కోసి వరి కుప్పలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో తుఫాన్ వల్ల వర్షం కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమలింగపాలెం, కట్టుపాలెం తదితర ప్రాంతాల్లోని లోతట్టు వరి పొలాల్లో వరి కోసి ఉంచడంతో నీరు చేరింది.
- నాతవరం మండలంలో గత పది రోజులుగా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో పొలాల్లో ఉంచిన వరి పనలు నానిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- రావికమతం మండలంలో కొన్ని చోట్ల మళ్లపై ఉన్న వరి పనలు వర్షాలకు తడిసిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు తడిసిన పనలను ఒడ్డుకు చేర్చి శనివారం ఆరబెట్టుకున్నారు.