టీచర్ల బదిలీలపై కసరత్తు
ABN , First Publish Date - 2022-12-16T01:17:49+05:30 IST
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితా ఇంకా సిద్ధం కాలేదు.
కొలిక్కిరాని సీనియారిటీ జాబితా
మండలాల వారీగా లెక్కలు వేస్తున్న అధికారులు
20న ఆన్లైన్లో అప్లోడ్
మరోవైపు విద్యా శాఖకు అందిన ‘సిఫారసు జాబితా’
బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో ముగియనున్న గడువు
ఒకేచోట ఎనిమిదేళ్లు పనిచేసిన ఎస్జీటీలు/స్కూలు అసిస్టెంట్లు తప్పనిసరిగా దరఖాసు ్తచేయాలని సూచించిన డీఈవో
విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితా ఇంకా సిద్ధం కాలేదు. దీనిపై విద్యా శాఖ అధికారులు రెండు, మూడు రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 43 మండలాల విద్యాశాఖాధికారులు డీఈవో కార్యాలయానికి వచ్చి వివరాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాబితా రూపొందించడానికి మరో రెండు రోజులు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఉపాధ్యాయ బదిలీలపై షెడ్యూల్ విడుదల నేపథ్యంలో బుధవారం పాఠశాల విద్యా శాఖ కమిషనర్ అమరావతిలో జిల్లా విద్యాశాఖాధికారులకు వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీలపై పలు సూచనలు, సలహాలు చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు జాబితా తయారుచేయనున్నారు. బదిలీలకు సంబంధించి ప్రతి మండలంలో ఒకేచోట ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్లు/తత్సమాన అర్హత కలిగిన పండిట్లు, పీడీలు ఎంతమంది ఉన్నారు?...అనే వివరాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అంతకంటే తక్కువ సర్వీస్ కలిగిన వారి వివరాలు, ఐదేళ్లు ఒకచోట పనిచేసిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమాచారం కూడా సేకరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయాచోట్ల ప్రస్తుతం వున్న విద్యార్థుల సంఖ్యను నివేదికలో పొందుపరుస్తున్నారు. మొత్తం 43 మండలాల్లో సీనియారిటీ జాబితా రూపొందించి పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఆమోదానికి పంపిన తరువాత ఈనెల 20వ తేదీ నాటికి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఇదిలావుండగా మూడు నుంచి పదో తరగతి వరకు 138 మంది, ఆరు నుంచి పదో తరగతి వరకు 96 మంది విద్యార్థుల కంటే తక్కువగా వున్న ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎం, పీడీ పోస్టులు రద్దు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయి?...అనేది లెక్కిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం 16 నుంచి 20 హెచ్ఎం పోస్టులు రద్దు అవుతాయని అంచనా వేస్తున్నారు.
మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలతో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల జాబితా జిల్లా విద్యా శాఖకు అందింది. వారు కోరుకున్న పాఠశాలకు బదిలీ చేయాలని ఆదేశాలు అందాయి. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచారు. సాధారణ బదిలీల సమయంలోనే సిఫారసు లేఖలు తెచ్చుకున్న టీచర్లకు కోరుకున్న పాఠశాలకు బదిలీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.
బదిలీ దరఖాస్తుకు రేపటి వరకే గడువు
టీచర్ల సాధారణ బదిలీలకు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి కేటగిరీ వారీగా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17వ తేదీ రాత్రి వరకు గడువిచ్చారు. వచ్చిన దరఖాస్తులను ఈనెల 18, 19 తేదీల్లో పరిశీలించనున్నారు. కేటగిరీ మేరకు ఈనెల 20న సీనియారిటీ జాబితా ప్రదర్శనతోపాటు అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు పనిచేసిన ఎస్జీటీలు/స్కూలు అసిస్టెంట్లు తప్పనిసరిగా బదిలీలకు దరఖాసు ్తచేయాలని డీఈవో ఎల్.చంద్రకళ తెలిపారు. దరఖాస్తు చేయకపోతే కేటగిరీ 3,4 పరిధిలో వున్న పాఠశాలలకు బదిలీ చేస్తామని, ఇంకా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. జిల్లాలో బదిలీలకు సంబంధించి సీనియారిటీ జాబితా రెండు రోజుల్లో సిద్ధమవుతుందని ఆమె పేర్కొన్నారు.