మాజీ సైనికుల భూములపై ప్రభుత్వం ఆరా!
ABN , First Publish Date - 2022-04-18T06:58:18+05:30 IST
మాజీ సైనికులకు ఇచ్చిన భూములపై ప్రభుత్వ ఆరా తీస్తోంది.
విశాఖ పరిసరాల్లో వివాదాల నేపథ్యంలో చర్యలు
జిల్లాలో పదేళ్లుగా నిలిచిన భూముల కేటాయింపు
ప్రతి ఏటా వెల్లువెత్తుతున్న దరఖాస్తులు
పక్కన పెట్టేస్తున్న రెవెన్యూ అధికారులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
మాజీ సైనికులకు ఇచ్చిన భూములపై ప్రభుత్వ ఆరా తీస్తోంది. ఐదారు దశాబ్దాలుగా ఎంతమంది మాజీలకు భూములు ఇచ్చారు? వాటి వివరాలు, విస్తీర్ణం ఎంత? వంటి వివరాలు సేకరిస్తోంది. ప్రధానంగా విశాఖ పరిసరాల్లో మాజీ సైనికులకు కేటాయించిన భూములు వివాదాల్లో చిక్కుకోవడం, ఇక్కడ భూములకు విపరీతమైన ధర పలుకుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల సైనిక వెల్ఫేర్ కార్యాలయాల్లో ఆడిట్ చేసిన అధికారులు మాజీ సైనికుల భూముల వివరాలివ్వాలని కోరడం, అదే సమయంలో ఈ వివరాలు పంపాలంటూ అన్ని జిల్లాల సైనికవెల్ఫేర్ అధికారులను సంబంధిత రాష్ట్ర డైరెక్టర్ ఆదేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వివరాలు కోరుతూ కలెక్టర్‌కు జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి శైలజ ఇటీవల లేఖ రాశారు.
రక్షణ రంగంలో పనిచేసే సైనికులు, కిందిస్థాయి అధికారులకు పదవీ విరమణ తరువాత ఉచితంగా ప్రభుత్వ భూములు ఇవ్వడానికి దాదాపు ఆరు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆర్మీలో హవాల్దారు, నేవీలో పెట్టీ ఆఫీసర్, ఎయిర్‌ఫోర్స్‌లో సార్జెంట్, అంతకంటే తక్కువ హోదాలో పనిచేసే సైనికులు సర్వీస్ నుంచి తిరిగి వచ్చిన మూడేళ్లలో దరఖాస్తు చేసుకుంటే భూములు కేటాయించేలా ఉత్తర్వులున్నాయి. మాగాణి అయితే 2.5 ఎకరాలు, మెట్టు అయితే ఐదెకరాలు భూమి పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. కాగా మాజీ సైనికులకు అప్పటికే సొంత భూమి ఉంటే దానికి పరిగణనలో తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం సైనిక వెల్ఫేర్ కార్యాలయాల్లో దరఖాస్తుచేస్తే, వారు ధ్రువపత్రాలు పరిశీలించి కలెక్టర్లకు పంపుతారు. అక్కడి నుంచి సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి వివరాలే చేరి, భూముల లభ్యతను బట్టి కేటాయించేవారు. దీంతో ఎక్కువమంది మాజీ సైనికులు విశాఖ పరిసరాల్లో భూముల కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. నగరానికి ఆనుకుని విశాఖ రూరల్, ఆనందపురం, భీమిలి, పెందుర్తి, గాజువాక, పరవాడ మండలాల్లో ఇలా మాజీ సైనికులకు భూములు పంపిణీ చేశారు.
పెరిగిన వివాదాలు
ఈ భూముల్లో కొన్నాళ్లు సాగుచేసి, కొంతమంది విక్రయించేయగా, మరికొందరు వారుసుల మధ్య వివాదాలు రేగాయి. విశాఖ పరిసరాల్లో భూములకు విలువ పెరగడంతో కొందరు వ్యాపారులు మాజీ సైనికుల కుటుంబాలను మోసం చేసి భూములు తీసుకోగా... మరికొందరు కొనుగోలుచేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యవహారమంతా జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా పరిణమించింది. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం, మాజీల వారసుల సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా మాజీ సైనికుల వారసుల మధ్య విభేదాలతో ఒకే భూమిని ఇద్దరు, ముగ్గురుకి విక్రయించిన సంఘటనలు జరిగాయి. ఈ వివాదాలపై రాజకీయ పంచాయితీలు సాగడం, కొన్నింటిపై న్యాయస్థానాల్లో కేసులు నడుస్తుండంతో అధికారులకు మాజీ సైనికులకు ఇచ్చిన భూముల్లో ఎక్కువ శాతాన్ని 22-ఎలో చేర్చారు. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న మండలాల్లో ప్రభుత్వ భూములను మాజీ సైనికులకు కేటాయించవద్దంటూ ఏడేళ్ల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో విశాఖ రూరల్, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం, పరవాడ మండలాల్లో భూముల పంపిణీ నిలిపివేశారు.
జిల్లాలో 13,332 మంది సైనికులు
జిల్లాలో మిలట్రీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైరైన సుమారు 13,332 మంది జిల్లా సైనిక వెల్ఫేర్ కార్యాలయంలో భూములు కావాలంటూ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరో 4,624 మంది మాజీ సైనికుల మరణాంతరం వారి భార్యలు నమోదయ్యారు. ఈ దరఖాస్తులపైనా అనేక వివాదాలున్నాయి.
పదేళ్ల తరువాతే విక్రయాలు
ప్రభుత్వం మాజీ సైనికులకు భూములు కేటాయించిన పదేళ్ల తరువాత మాత్రమే విక్రయించే హక్కు ఉంటుంది. ఎవరైనా భూములు అమ్మాలనుకుంటే నిరభ్యంతర పత్రం కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారు ధ్రువీకరణకు సైనిక వెల్ఫేర్ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన వివరాల మేరకు ధ్రువపత్రం జారీ చేస్తారు. అంతేకాకుండా పలు కేసుల పరిష్కారం సమయంలో కోర్టులు, జిల్లా కలెక్టర్ నుంచి కూడా సైనికవెల్ఫేర్ కార్యాలయం నుంచి ధ్రువీకరణ కోరుతుంటారు. ప్రధానంగా విశాఖ నగర పరిసరాల్లో మాజీ సైనికులకు ఇచ్చే భూములకు సంబంధించి కలెక్టర్, కోర్టు నుంచి వచ్చిన లేఖలపై వివరణలు ఇవ్వడంలో సైనిక వెల్ఫేర్ కార్యాలయం ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఐదేళ్లుగా సిఫారసులివీ
భూములు కేటాయించాలంటూ గత ఐదేళ్ల నుంచి జిల్లాలో మాజీ సైనికుల నుంచి కేవలం 211 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2017లో 32, 2018లో 21, 2019లో 37, 2020లో 48, 2021లో 73 మంది దరఖాస్తు చేసుకున్నారు. భూముల కేటాయింపునకు రెవెన్యూ అధికారులు విముఖత చూపుతుండడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేయడంలేదు. వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యంలో అనేక మండలాల్లో దరఖాస్తులను పక్కనపడేస్తున్నారు. గత పదేళ్లుగా మాజీ సైనికులకు భూములు ఇచ్చిన ఘటనలు చాలా తక్కువని మాజీ సైనికుడొకరు వ్యాఖ్యానించారు.
భూముల వివరాలపై కలెక్టర్‌కు లేఖ
జిల్లాలో ఇప్పటివరకు మాజీ సైనికులకు ఇచ్చిన భూముల వివరాలను కోరుతూ ఆడిట్‌శాఖ కోరింది. సైనిక వెల్ఫేర్ రాష్ట్ర డైరెక్టర్ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దీంతో వాటిని అందించాలంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాం. మాజీ సైనికులకు భూములు కేటాయించాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినపుడు వివరాలు నమోదు చేసుకుంటాం. అయితే కేటాయించిన భూముల వివరాలను చాలా సందర్భాలలో మాజీ సైనికులుగానీ, రెవెన్యూ అధికారులు గానీ మాకు సమాచారం ఇవ్వడంలేదు. దీంతో వివరాలపై కచ్చితమైన రికార్డు లేదు.
- శైలజ, జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి