బదిలీల ప్రయత్నాల్లో ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-06-25T06:28:38+05:30 IST

బదిలీల కారణంగా పది రోజులుగా రెవెన్యూ కార్యాలయంలో పనులు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బదిలీల ప్రయత్నాల్లో ఉద్యోగులు
ధ్రువపత్రాల కోసం గుమిగూడిన లబ్ధిదారులు


ముందుకు సాగని రెవెన్యూ పనులు

సెలవులో వెళ్లిన కంప్యూటర్‌ ఆపరేటర్‌

మాకవరపాలెం, జూన్‌ 24: బదిలీల కారణంగా పది రోజులుగా రెవెన్యూ కార్యాలయంలో పనులు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ కార్యాలయంలోని ఉద్యోగులను బదిలీ చేయిస్తామని అధికార పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తుండడంతో చాలా మంది ఉద్యోగులు మంచి ప్రదేశం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి కంప్యూటర్‌ ఆపరేటర్‌ సెలవుపై వెళ్లారు. దీంతో ధ్రువపత్రాలు, 1బి కాపీలు, అడంగల్‌ డిజిటల్‌ సైన్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లుతోపాటు హౌసింగ్‌ ఎల్‌పీసీలు, మ్యూటేషన్లు, భూములు ఆన్‌లైన్లు సక్రమంగా జరగడం లేదని పలువురు వాపోతున్నారు. జూలై 5వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానుండడంతో వివిధ ధ్రువపత్రాల కోసం విద్యార్థులు రెవెన్యూ కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటికే ధ్రువపత్రాల దరఖాస్తులు వందల్లో ఉండగా.. భూముల ఆన్‌లైన్‌ కోసం 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ రాణి అమ్మాజీని వివరణ కోరగా.. కంప్యూటర్‌ ఆపరేటర్‌ సెలవుపై వెళ్లిపోవడంతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు. అందువల్ల రాత్రి పది గంటల వరకు పనిచేస్తున్నామన్నారు. సిబ్బంది అంతా బదిలీల కోసం ప్రయత్నాలు చేసుకోవడంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్నారు.


Updated Date - 2022-06-25T06:28:38+05:30 IST