Chandrababu: ఆక్వాకు రూపాయిన్నరకే కరెంటు

ABN , First Publish Date - 2022-11-25T02:31:29+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఏ తేడా లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్‌ విద్యుత్‌ రూపాయిన్నరకే అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. .

Chandrababu: ఆక్వాకు రూపాయిన్నరకే కరెంటు

విద్యుత్‌ రాయితీపై బాబు తొలి హామీ

మేత ధరలు తగ్గేలా చూస్తాం

బోర్లు, ఏరియేటర్లపై 50% సబ్సిడీ

ప్రభుత్వ విభాగాల వేధింపుల నుంచి విముక్తి

చేప, రొయ్య రైతుకు మరిన్ని హామీలు ప్రకటించిన మాజీ సీఎం

సినిమావాళ్లను బెదిరించినట్లు ఆక్వా కంపెనీలనూ బెదిరిస్తున్నారు

థియేటర్లు మూసేసినట్లు కంపెనీలూ మూసేయాలేమో: చంద్రబాబు

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఏ తేడా లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్‌ విద్యుత్‌ రూపాయిన్నరకే అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గురువారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆక్వా రైతుల సదస్సులో ఆయన తన తొలి హామీని ప్రకటించారు. ‘‘2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి ముందు రొయ్యలు, చేపల రైతులకు ఒక యూనిట్‌ విద్యుత్‌ రూ.4.86 కు ఇచ్చేవారు. టీడీపీ ప్రభుత్వం దానిని రూ.2 చేసి రైతులపై భారం తగ్గించింది. తనను గెలిపిస్తే రూపాయిన్నరకే ఇస్తానని జగన్‌రెడ్డి ఎర వేస్తే రైతులు నమ్మి ఓట్లు వేశారు. గెలిచిన తర్వాత జోన్ల విధానం తెచ్చి కేవలం 20 శాతం మంది రైతులకు రూపాయిన్నరకు ఇచ్చి 80 శాతం రైతుల నుంచి రూ.3.86 వసూలు చేస్తున్నారు. చేతగాని హామీ ఇచ్చి రైతుల నడుం విరిచారు’’ అని వ్యాఖ్యానించారు. ఆక్వా రైతుకు ప్రయోజనం కలిగేలా మరికొన్ని హామీలు కూడా ఆయన ప్రకటించారు. ‘‘రైతులకు నాణ్యమైన మేత లభ్యమయ్యేలా చూస్తాం. మేత ధరలు తగ్గేలా చూస్తాం. ప్రభుత్వ పెద్దల వసూళ్లు లేకపోతే మేత ధరలు అవే తగ్గుతాయి. టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మాదిరిగానే అప్పటి రేట్లకే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తాం.

జనరేటర్లు, డీజిల్‌ వాడాల్సిన అవసరం లేకుండా 24గంటలూ నాణ్యమైన కరెంటు ఇస్తాం. బోర్లు, ఏరియేటర్లలో 50శాతం సబ్సిడీ ఇస్తాం. విజిలెన్స్‌, స్టేట్‌ జీఎస్టీ, టాస్క్‌ఫోర్స్‌, కాలుష్య నియంత్రణ పేరుతో వేధింపులు లేకుండా చేస్తాం. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయిస్తాం. రైతులకు మద్దతు ధర ఇప్పిస్తాం. ఆక్వా రంగాన్ని నిలబెట్టి మొదటి స్థానంలో ఉండేలా చేస్తాం. మేం చెప్పినవన్నీ అధికారంలోకి రాగానే వెంటనే అమల్లోకి తెస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ సీఎం రాష్ట్రానికి శనిలా దాపురించారని, ఆయన ఇనుప పాదంతో ప్రతి రంగం నాశనమవుతోందన్నారు. ‘‘ఆక్వా రైతులు ఆందోళన చేస్తుంటే వారిని పిలిపించి మాట్లాడాల్సింది పోయి ఆక్వా కంపెనీల అసోసియేషన్‌తో అంతా బాగుందని ప్రకటనలు ఇప్పించి చేతులు దులుపుకొన్నాడు. చేతనైతే సమస్యలు పరిష్కరించాలి. చేతగాకపోతే దిగిపోవాలి. ఏదీ చేయకుండా రైతులను కాల్చుకు తింటున్నారు. కరెంటు చార్జీలు పెంచి ఉసురు పోసుకొంటున్నారు. కరెంటు రోజంతా రావడం లేదు. జనరేటర్లు వాడితే డీజిల్‌ ఖర్చు మోత మోగుతోంది.

దానిపైనా విపరీతంగా పన్నులు మోపారు. గోదావరి నీళ్లు వాడుకొన్నందుకు వెయ్యి లీటర్లకు మేం రూ.12 వసూలు చేస్తే ఈ ప్రభుత్వం ఏకంగా దానిని రూ.120 చేసింది. పది రెట్లు ఎవడైనా మతి ఉన్నవాడు పెంచుతాడా? కంపెనీలను లొంగదీసుకోవడానికి కొత్త చట్టాలు తెచ్చి మంత్రుల కమిటీలు వేశారు. మేత కంపెనీలు టన్నుకు .5,000 ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. వాటినుంచి రూ.1,000 కోట్లు వసూలు చేయాలని చూస్తున్నారు. ఇవే డబ్బులు వచ్చే ఎన్నికల్లో ఓటుకు రూ.5,000 పంచి గెలవాలని ప్రణాళికలు వేసుకొంటున్నారు. మేం ట్రాన్స్‌ఫార్మర్లు ఉచితంగా ఇస్తే వీళ్లు రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. వంద కౌంట్‌ ఉన్న రొయ్యలకు కిలోకు రూ.240 ఇప్పిస్తామన్నారు. తర్వాత 210 అన్నారు. అదీ లేదు. రైతులు చెరువులు తవ్వుకోవాలంటే స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎకరానికి రూ.లక్ష కప్పం కట్టాలి. సినిమా రంగంలో వాళ్లను బెదిరించినట్లుగా ఆక్వా కంపెనీలను బెదిరిస్తున్నారు. సినిమా థియేటర్లు మూతపడినట్లు ఈ కంపెనీలు కూడా మూసుకొనే పరిస్థితి తెస్తున్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.

175లో ఒక్క సీటూ వైసీపీకి రాదు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పులివెందుల సహా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా వైసీపీకి రాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదేం ఖర్మని తలపట్టుకోని వర్గం రాష్ట్రం లో లేదని, పరిస్థితి అర్థమై పదవులు ఇస్తామన్నా వైసీపీలో వద్దని పారిపోతున్నార న్నారు. గత 40 ఏళ్లలో తాను ఏనాడూ చూడని స్పందన కర్నూలు జిల్లా పర్యటనలో కనిపించిందని, ఆ దెబ్బకు అధికార పార్టీ 8మంది జిల్లా అధ్యక్షులను మార్చివేసిందని చెప్పారు. ‘‘కౌలురైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో నిలిచినా ప్రభుత్వంలో స్పందన లేదు. ధాన్యం రైతులకు నెలలు గడిచినా డబ్బులు చేతిలోకి రావు. కాని రేషన్‌ బియ్యాన్ని మాత్రం అధికార పార్టీ పెద్దలు రీసైక్లింగ్‌ చేసి రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారు.

మేం సాగునీటి ప్రాజెక్టులపై రూ.64 వేల కోట్లు ఖర్చు చేస్తే వీళ్లు అందులో 10శాతం కూడా చేయలేదు. బటన్‌ నొక్కుతున్నానని ప్రజలకు భ్రమ కల్పించి తమ జేబులు నింపుకొంటున్నారు. కౌలు తప్ప పైసా తీసుకోకుండా వేల ఎకరాల భూములు ఇచ్చిన రాజధాని రైతులను వేధించి చంపుతున్నారు’’ అని మండిపడ్డారు. కోర్టులో ఫైళ్లు కొట్టేసిన ఘనుడని ఒక పెద్దమనిషికి మంత్రి పదవి ఇస్తే ఆ ఘనకార్యానికి ఆయనపై కోర్టు సీబీఐ విచారణ వేసిందన్నారు. ఈ సీఎంకు సిగ్గుంటే ఆ మంత్రి తో రాజీనామా చేయించాలని, ఆయన రాజీనామా చేయకపోతే డిస్మిస్‌ చేయాలని సూచించారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, రైతులు మాట్లాడారు.

Updated Date - 2022-11-25T07:09:19+05:30 IST

Read more