ద్వారకా కాంప్లెక్స్ కిటకిట..
ABN , First Publish Date - 2022-01-13T06:25:07+05:30 IST
సంక్రాంతి ప్రయాణికులతో బుధవారం ద్వారకా కాంప్లెక్స్ కిటకిటలాడింది.
సంక్రాంతి ప్రయాణికులతో రద్దీగా మారిన బస్సులు
ప్రత్యేక బస్సులు నడిపిన పీటీడీ అధికారులు
ద్వారకా కాంప్లెక్స్, జనవరి 12: సంక్రాంతి ప్రయాణికులతో బుధవారం ద్వారకా కాంప్లెక్స్ కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో ఎక్కువ మంది తమ స్వస్థలాలకు బుధవారం బయలుదేరడంతో ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు కాంప్లెక్స్ రద్దీగా మారింది. కాంప్లెక్స్‌లోని ప్రయాణికుల కారిడార్, టిక్కెట్ల కౌంటర్లు, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులుతీరారు. విద్య, ఉద్యోగ, వాపార, ఇతర వ్యవహారాల నిమిత్తం విశాఖలో స్థిరపడిన వారంతా తమ సొంతూళ్లకు పయనమవ్వడంతో పీటీడీ బస్సులన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ, అమలాపురం, భీమవరం వంటి దూర ప్రాంతాలకు, జోనల్ పరిధిలోని శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలకు రాకపోకలు సాగించే షెడ్యూల్ సర్వీసుల సిట్టింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికుల డిమాండ్ పెరిగింది. దీంతో పీటీడీ విశాఖ రీజియన్ అధికారులు దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు, జోనల్ పరిధిలోని ప్రాంతాలకు అదనపు సర్వీసులను నడిపారు. హైదరాబాద్‌కు నాలుగు, విజయవాడకు ఐదు, అమలాపురానికి రెండు, భీమవరానికి ఒకటి చొప్పున ప్రత్యేక బస్సులు నడిపారు. శ్రీకాకుళం జిల్లాలోకి వివిధ ప్రాంతాలకు 20, విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలకు 21 అదనపు సర్వీసులను ఆపరేట్ చేశారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరిన్ని ప్రత్యేక సర్వీసులు, అదనపు బస్సులను నడుపుతామని ఆర్‌ఎం అంధవరకు అప్పలరాజు తెలిపారు. డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు కణితి వెంకటరావు, కె.పద్మావతి ద్వారకా కాంప్లెక్సులోని రద్దీని పర్యవేక్షించారు.
