నాటకం.. అజరామరం

ABN , First Publish Date - 2022-09-27T07:07:45+05:30 IST

నాటకం ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచి ఉంటుందని రచయిత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు.

నాటకం.. అజరామరం
జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభిస్తున్న దాడి వీరభద్రరావు


మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

ఉభయ రాష్ట్రాల తెలుగు నాటిక పోటీలు ప్రారంభం

తొలిరోజు ఆకట్టుకున్న ‘ఆస్థికలు’ నాటికఅనకాపల్లి టౌన్‌,  సెప్టెంబరు 26  : నాటకం ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచి ఉంటుందని రచయిత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. అనకాపల్లిలోని సతకంపట్టులో కనకదుర్గమ్మ  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన  కర్రి రమేష్‌  మెమోరియల్‌ ఉభయ రాష్ట్రాల తెలుగు నాటిక పోటీలను సోమవారం రాత్రి ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఎందుకో నాటకాలు పక్కన పెట్టి నాటికల ప్రదర్శనకు ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. నాటకం కలకాలం ఉంటుందని, ఎంతోమంది కళాకారులు నాటకం ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. కొత్త నాటకాలు రాయకపోతే పాత నాటకాలు ప్రదర్శించాలని సూచించారు. రచయితలు కూడా కొత్త నాటకాలు రాయడానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జేఎస్‌ ప్రసాద్‌రెడ్డి, కార్పొరేటర్‌ పీలా లక్ష్మీసౌజన్య, ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కర్రి సన్యాసినాయుడు, కె.ఎం.నాయుడు, బొడ్డేడ సన్యాసినాయుడు, బుద్ద రమణాజీ, పి.బాలకృష్ణ, కర్రి శివ, కొణతాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఈ పోటీల్లో భాగంగా తొలుత ప్రదర్శితమైన ‘ఆస్తికలు’ నాటిక విశేషంగా ఆకట్టుకుంది. కళాకారులు ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. బతికినంత కాలం ఆస్తులు పోగేయడమే లక్ష్యంగా సాగిన బసవయ్యకు చచ్చి దెయ్యమయ్యాక  గాని తన జీవితం ఎంత వికృష్టమైందో అర్థం కాలేదు. తన పిల్లలు కూడా తనలాగే ఆస్తుల కోసం వెంపర్లాడడం చూసి బసవయ్య ఆత్మ ఎంత క్షోభపడిందో ఈ నాటిక ద్వారా కళ్లకు కట్టినట్టు చూపారు.  గంగోత్రి పెదకాకాని వారి బ్యానర్‌పై ప్రదర్శితమైన ఈ నాటికకు నాయుడు గోపీ దర్శకత్వం వహించారు. 


Read more