ఇంటింటికీ తిరగలేం..!

ABN , First Publish Date - 2022-08-09T07:12:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌పై వైద్యులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

ఇంటింటికీ తిరగలేం..!

ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌పై వైద్యుల వ్యతిరేకత

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌పై వైద్యులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా ఇంటింటికీ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వుండే ఇద్దరు వైద్యుల్లో రోజుకు ఒకరు చొప్పున ఒక్కో సచివాలయ పరిధిలోని గ్రామానికి వెళ్లి సేవలు అందించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సచివాలయం వద్ద ఓపీ సేవలు అందించాలి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ వెళ్లి రోగులు సమస్యలు తెలుసుకుని వారికి సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే, దీన్ని వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించడం ఇబ్బందిగా వుంటుందని పేర్కొంటున్నారు. ఏఎన్‌ఎం, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ చేయాల్సిన పనిని మెడికల్‌ ఆఫీసర్‌ చేయడం ద్వారా హోదా తగ్గినట్టవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు మెడికల్‌ ఆఫీసర్లు సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ను 104 మెడికల్‌ ఆఫీసర్‌ ద్వారా అమలు చేయాలని, మానిటరింగ్‌ బాధ్యతను పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లకు ఇవ్వాలని, ఇంటింటికీ వెళ్లి రోగుల పర్యవేక్షణ బాధ్యతను ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలకు అప్పగించాలని సదరు వినతిపత్రంలో కోరారు. అది మంకీ పాక్స్‌ కాదు

విశాఖ యువకుడికి నెగెటివ్‌  

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మంకీ పాక్స్‌ లక్షణాలతో బాధపడుతున్న యువకుడికి నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గీతం మెడికల్‌ కళాశాలకు చెందిన విద్యార్థిలో మంకీ పాక్స్‌ లక్షణాలున్నట్టు అనుమానించిన ఆంధ్ర మెడికల్‌ కళాశాల వైద్యులు నమూనాలు సేకరించి పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌ నుంచి జిల్లా అధికారులకు సోమవారం రాత్రి ఫలితాలు అందాయి. ఈ ఫలితాల్లో సదరు యువకుడికి నెగెటివ్‌గా తేలింది. సెకండరీ ఇన్‌ఫెక్షన్స్‌కు సంబంధించిన వ్యాధి అయి వుంటుందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2022-08-09T07:12:59+05:30 IST