కేజీహెచ్‌కు డాక్టర్లు డుమ్మా?

ABN , First Publish Date - 2022-03-05T06:34:18+05:30 IST

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో సుమారు 209 మంది వైద్యుల హాజరు జనవరి నెలకు సంబంధించి సక్రమంగా లేదని ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాంబశివరావు గుర్తించారు.

కేజీహెచ్‌కు డాక్టర్లు డుమ్మా?

జనవరి నెలలో 209 మంది హాజరు

సక్రమంగా లేదని గుర్తించిన ఏఎంసీ ప్రిన్సిపాల్‌

జాబితాలో 12 మంది విభాగాధిపతులు, 29 మంది ప్రొఫెసర్లు, 32 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 136 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

కొంతమందికి ఒక్కరోజు కూడా అటెండెన్స్‌ లేదు

కారణాలేమిటో తెలియజేయాలంటూ కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు ప్రిన్సిపాల్‌ లేఖసరైనా కారణాలు తెలియజేయకపోతే జీతం రికవరీ చేస్తామని స్పష్టీకరణ

వారం రోజులు దాటుతున్న అందని వివరాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో సుమారు 209 మంది వైద్యుల హాజరు జనవరి నెలకు సంబంధించి సక్రమంగా లేదని ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాంబశివరావు గుర్తించారు. బయోమెట్రిక్‌ ప్రకారం చూస్తే చాలామంది గైర్హాజరైనట్టుగా ఉందని, అందుకు గల కారణాలేమిటో తెలియజేయాలని కోరుతూ కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలికి ఆయన గత నెల చివరి వారంలో లేఖ రాశారు. సరైనా కారణాలు లేకపోతే వేతనాన్ని రికవరీ చేయనున్నట్టు పేర్కొన్నారు. 


ప్రైవేటు సేవలకు మొగ్గు.. 

కేజీహెచ్‌ వైద్యులు చాలామంది ఆ చుట్టుపక్కల వుండే ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తుంటారు. కొంతమంది సొంత క్లినిక్‌లను నడుపుతుంటారు. ప్రతిరోజూ ఉదయం కేజీహెచ్‌కు వచ్చి, హాజరు వేయించుకుని ప్రైవేటు ప్రాక్టీస్‌కు వెళ్లిపోతుంటారు. ఈ తంతు గత కొన్నేళ్లుగా సాగుతోంది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి. వైద్యుల వ్యవహారశైలితో రోగులు ఇబ్బంది పడుతున్న విషయం గతంలో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా వున్న కామినేని శ్రీనివాస్‌ దృష్టికి వెళ్లగా...పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల ప్రైవేటు సేవలను నియంత్రించే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను తప్పనిసరి చేసింది. దీంతో కొద్దిరోజులు వైద్యులు సమయానికి విధులకు హాజరయ్యారు. బయోమెట్రిక్‌ వద్ద బారులుతీరి కనిపించేవారు. ఆ ఆదేశాలు పకడ్బందీగా అమలు అవుతున్నాయని అంతా అనుకున్నారు. ఇటువంటి తరుణంలో జనవరి నెలలో సుమారు 209 మంది గైర్హాజరైనట్టు తేలడం చర్చనీయాంశమైంది.


కొంతమంది నెల మొత్తం గైర్హాజరు.. 

జనవరి నెలలో గైర్హాజరైనట్టుగా చెబుతున్న వైద్యుల జాబితాలో 12 మంది విభాగాధిపతులు ఉన్నారు. వీరిలో యూరాలజీ విభాగాధిపతి, జనరల్‌ సర్జరీ విభాగాధిపతులు ఒక్కరోజు కూడా ఆస్పత్రికి హాజరుకాలేదు. ఇక రేడియోథెరపీ విభాగాధిపతి 12 రోజులు, అనస్థీషియా విభాగాధిపతి 14 రోజులు, రేడియో డయోగ్నోస్టిక్స్‌ విభాగాధిపతి 12 రోజులు, నెఫ్రాలజీ విభాగాధిపతి 21 రోజులు, డెంటల్‌ సర్జరీ విభాగాధిపతి 16 రోజులు గైర్హాజరైనట్టుగా ఉంది. ఇదే జాబితాలో మరో 29 మంది ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. వీరిలో అనస్థీషియా విభాగానికి చెందిన ఒకరు, గైనకాలజీ విభాగానికి చెందిన ఒక ప్రొఫెసర్‌ జనవరిలో ఒక్కరోజు కూడా ఆస్పత్రికి రాలేదు. అలాగే, పీడియాట్రిక్‌ విభాగానికి చెందిన ఒక ప్రొఫెసర్‌ ఒక్కరోజు మాత్రమే వచ్చారు. వివిధ విభాగాలకు చెందిన మరో 15 మంది ప్రొఫెసర్లు పది నుంచి 20 రోజులకుపైగా విధులకు డుమ్మా కొట్టారు. అదేవిధంగా 32 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు జనవరి నెలలో ఎక్కువ రోజులు విధులకు హాజరుకాలేదు. ఏడుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఒక్కరోజు కూడా ఆస్పత్రి ముఖం చూడలేదు. మరో 16 మంది పది రోజుల కంటే ఎక్కువ రోజులు విధులకు హాజరుకాలేదు. మిగిలినవారు ఐదు నుంచి పది రోజులు విధులకు డుమ్మా కొట్టారు. అలాగే 136 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధించిన బయోమెట్రిక్‌ హాజరు సవ్యంగా లేదు. వీరిలో ఏడుగురు ఒక్కరోజూ కూడా ఆస్పత్రికి రాలేదు. మరో 79 మంది పది రోజులకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రికి రానట్టు బయో మెట్రిక్‌లో ఉంది. మిగిలిన వైద్యులు ఒకటి నుంచి పది రోజులపాటు విధులకు హాజరు కాలేదని బయోమెట్రిక్‌లో నమోదైంది. ఈ విషయమై ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాంబశివరావును వివరణ కోరగా..ఇది ఆస్పత్రి అంతర్గత వ్యవహారమన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత వైద్యులకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. అందులో భాగంగా  హాజరు వివరాలను పరిశీలించినప్పుడు ఎక్కువ మంది గైర్హాజరైనట్టు గుర్తించి కారణాలేమిటో అడిగినట్టు తెలిపారు. సాంకేతిక సమస్యా?, మరేదైనా కారణమా?...తెలుసుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలిని వివరణ కోరగా..తనకు ఎటువంటి లేఖ అందలేదని బదులిచ్చారు. 


కారణమేమిటో?

వైద్యులు ప్రైవేటు సేవలో తరిస్తారన్నది బహిరంగ రహస్యం. అయితే ఈ స్థాయిలో విధులకు డుమ్మా కొడుతున్నారా? లేక సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. సాధారణంగా వైద్యుల్లో ఎక్కువ మంది బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేసిన తరువాత ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతుంటారని, కానీ అటెండెన్స్‌ లేదంటే దానికి వేర్వేరు కారణాలు వుండవచ్చునని కేజీహెచ్‌లోని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అయితే కొంతమంది హాజరు నమోదైనప్పుడు, మిగిలిన వారిది ఎందుకు నమోదు కాదని ప్రశ్నను మరికొంతమంది లేవనెత్తుతున్నారు. ఏదిఏమైనా ఒకేసారి ఇంతమంది వైద్యుల హాజరు వివరాలను అడగడం మెడికల్‌ కళాశాల పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Read more