క్షమించండి నాన్న..

ABN , First Publish Date - 2022-08-14T06:40:03+05:30 IST

ఆ అనుమానమే నిజమైంది. బాగా చదివి మంచి ఉద్యోగం సాధించాలని విశాఖపట్నం వచ్చిన దివ్య...వెంకటరెడ్డిని నమ్మి మోసపోయింది.

క్షమించండి నాన్న..

మీ నమ్మకాన్ని నిలుపుకోలేకపోయా

తండ్రికి దివ్య వాట్సాప్‌ మెసేజ్‌

వెంకటరెడ్డితో ప్రేమే ప్రాణం తీసింది

ఇద్దరూ కలిసే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు

పోలీసుల అనుమానం

తాను కెనడాలో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పిన వెంకటరెడ్డి

పోలీసులు ఫోన్‌ చేసేంత వరకూ విశాఖలో ఉంటున్నట్టు తమకు తెలియదన్న సోదరుడు


విశాఖపట్నం/ఎంవీపీ కాలనీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆ అనుమానమే నిజమైంది. బాగా చదివి మంచి ఉద్యోగం సాధించాలని విశాఖపట్నం వచ్చిన దివ్య...వెంకటరెడ్డిని నమ్మి మోసపోయింది. అతడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడానికి అప్పులు చేసింది. చివరకు ఇంట్లో వాళ్లకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తండ్రికి రాసిన లేఖలో అదే వివరించింది. ‘క్షమించండి నాన్న!! మీరంతా నన్ను ఎంతగానో నమ్మారు. కానీ ఆ నమ్మకం నిలబెట్టుకోలోకపోయాను. అప్పులు చేసి తప్పు చేశాను. సమాజంలో తలెత్తుకొని జీవించలేను. అందుకే చనిపోతున్నా. క్షమించండి.’ అంటూ తండ్రి తిరుమలరావుకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టింది. అందులో ఎక్కడా వెంకటరెడ్డి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆత్మహత్య చేసుకున్న వెంకటరెడ్డి, దివ్యల మృతదేహాలు రుషికొండ, తిమ్మాపురం తీరానికి కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.


ఇంటి ఓనరు పరిచయం చేశారు

పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ కావడానికి దివ్య ఏడాదిన్నర క్రితం విశాఖపట్నం వచ్చింది. ఎంవీపీ కాలనీ సెక్టార్‌-9లో ఓ ఇంటిలో మరో ముగ్గురు అమ్మాయిలతో కలిసి అద్దెకు దిగింది. అదే ఇంట్లో అప్పటివరకు వెంకటరెడ్డి అద్దెకు ఉండేవాడు. ఇంటి యజమానికి చిన్న చిన్న పనుల్లో సాయం చేసేవాడు. అదే చనువుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినా అప్పుడప్పుడు వచ్చేవాడు. అలాంటి సమయంలోనే వెంకటరెడ్డిని దివ్యకు, ఆమె స్నేహితులకు ఇంటి యజమాని పరిచయం చేశాడు. ఏదైనా పని వుంటే ఆ అబ్బాయి చేసి పెడతాడని, మొహమాటం లేకుండా చెప్పవచ్చునని ఆయన అనడంతో చిన్న చిన్న పనులు చెప్పేవారు. అలా దివ్యకు వెంకటరెడ్డి దగ్గరయ్యాడు. ప్రేమలోకి దింపాడు. డబ్బులు అవసరమని అడిగి తీసుకునేవాడు. అతడి కోసం ఆమె అప్పులు చేయడం ప్రారంభించింది. స్నేహితుల వద్ద సుమారుగా రూ.2.4 లక్షలు అప్పు చేసి అతడి చేతిలో పోసింది. కొద్దిరోజుల క్రితమే ఆ ఇంటిని ఖాళీ చేసి సమీపంలోని హాస్టల్‌లోకి మారింది. అయినప్పటికీ అతను వదల్లేదు. ఇంకా డబ్బు కావాలని అడగడంతో మేనమామను లక్ష రూపాయలు అప్పు అడిగి చీవాట్లు తింది. ఇంట్లో వారు వచ్చి డబ్బులు ఏమి చేస్తున్నావని అడిగితే...ఏం చెప్పాలో తెలియక భయంతో చనిపోవాలని నిర్ణయించుకుంది. అదే విషయం మొబైల్‌లో టైప్‌ చేసి తండ్రికి మెసేజ్‌ పెట్టింది. 


కెనడాలో ఉద్యోగమని అబద్దాలు

విజయవాడలో సీఏ(చార్టెడ్‌ అకౌంటెంట్‌) కోర్సు చేస్తానని చెప్పి వెంకటరెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు అతడి అన్నయ్య శ్రీనివాసరావు పోలీసులకు తెలిపారు. ఆ చదువు కోసం సుమారు రెండు ఎకరాలకు పైగా భూమిని అమ్మించేశాడన్నాడు. తనకు కెనడాలో ఉద్యోగం వచ్చిందని, అక్కడే వుంటున్నానని వాళ్లని నమ్మించాడు. దాంతో వారు సెటిల్‌ అయ్యాడని సంతోషించారు. కానీ విశాఖలోనే వుంటున్నాడని వాళ్లకు పోలీసులు చెప్పేంత వరకు తెలియదు. ఎంవీపీ కాలనీ నుంచి వెళ్లిపోయిన వెంకటరెడ్డి ఎక్కడ ఉంటున్నాడనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎండాడలో అని పలువురు చెప్పడంతో అడ్రస్‌ కోసం గాలిస్తున్నారు. అతడి గురించి ఇక్కడ సమాచారం ఇచ్చేవారు ఎవరూ కనిపించడం లేదు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. సెల్‌ఫోన్‌ నంబర్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అది దొరికితే...ఎవరెవరితో తనకు పరిచయాలు ఉన్నాయో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 


ఇద్దరూ కలిసే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు

దివ్య, వెంకటరెడ్డి ఇద్దరూ కలిసే ఆత్మహత్య చేసుకొని వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరూ రుషికొండ వద్ద సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకుని ఉంటారంటున్నారు. ఆమె మృతదేహం సముద్రం లోపలకు వెళ్లిపోయి మరుసటిరోజు కొట్టుకు వచ్చి ఉంటుందని, అతడిది మాత్రం దొరికిందని అంటున్నారు. 


నేడు లోకేష్‌ రాక

విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆదివారం నగరానికి వస్తున్నారు. సాయంత్రం హైదరాబాద్‌లో బయలుదేరి 6.40 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆదివారం రాత్రి రుషికొండలోని ఎ-గ్రాండ్‌లో జరగనున్న దివంగత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు (చిన్న కుమారుడు లక్ష్మణరావు కుమారుడు) భరద్వాజ్‌ వివాహ రిసెప్షన్‌కు లోకేష్‌ హాజరవుతారు. తిరిగి రాత్రి 8.30 గంటలకు బయలుదేరి 9.10 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని హైదరాబాద్‌ వెళతారు.Updated Date - 2022-08-14T06:40:03+05:30 IST