దంత వైద్య సేవలు దూరం

ABN , First Publish Date - 2022-12-13T00:12:58+05:30 IST

స్థానిక ఏరియా ఆస్పత్రిలో దంత వైద్య సేవలు దూరమ య్యాయి. నాలుగు నెలలుగా దంత వైద్యాధికారి పోస్టు భర్తీకి నోచుకోవడం లేదు.

దంత వైద్య సేవలు దూరం
చింతపల్లి ఏరియా ఆస్పత్రి

నాలుగు నెలలుగా ఏరియా ఆస్పత్రిలో భర్తీ కాని డీడీఎస్‌ పోస్టు

గిరిజన రోగులకు తప్పని ఇబ్బంది

చింతపల్లి, డిసెంబరు 12: స్థానిక ఏరియా ఆస్పత్రిలో దంత వైద్య సేవలు దూరమ య్యాయి. నాలుగు నెలలుగా దంత వైద్యాధికారి పోస్టు భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో దంత సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పది నెలల కిందట ఏరియా ఆస్పత్రిగా స్థాయి పెంచారు. నాలుగు నెలల కిందట రీస్ట్రక్చర్‌ విధానం అమలులోకి తీసుకొచ్చి ఏరియా ఆస్పత్రి(వంద పడకలు) స్థాయికి తగిన పోస్టులను వైద్య విధాన పరిషత్‌ అధికారులు కేటాయించారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్‌ డెంటల్‌ సర్జన్‌ పోస్టును తొలగించి డిప్యూటీ డెంటల్‌ సర్జన్‌(ప్రత్యేక వైద్య నిపుణులు) పోస్టును కేటాయించారు. ఈ కారణంగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్లుగా సేవలందిస్తున్న అసిస్టెంట్‌ డెంటల్‌ సర్జన్‌ నాగ శేఖర్‌ విజయనగరం జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు. డిప్యూటీ డెంటల్‌ సర్జన్‌ పోస్టును వైద్య విధాన పరిషత్‌ ఉన్నతాధికారులు భర్తీ చేసినప్పటికి చింతపల్లిలో పని చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో నాలుగు నెలలుగా ఆస్పత్రిలో దంత వైద్యుల పోస్టు ఖాళీగా ఉంది.

చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలతో పాటు జి.మాడుగుల, కొయ్యూరు మండలాల సరిహద్దు గ్రామాల గిరిజన రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వీరంతా ఇప్పుడు దంత వైద్య సేవలకు దూరమయ్యాయి. ప్రస్తుతం దంత సమస్యలతో బాధపడుతున్న గిరిజన ప్రాంత ప్రజలు నర్సీపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చింతపల్లి, జీకేవీధి ప్రాంత ప్రజలకు నర్సీపట్నం సుమారు 60- 110 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో ప్రత్యేకంగా దంత వైద్య సేవల కోసం నర్సీపట్నం వెళ్లలేక పోతున్నారు. దీంతో రోగులు ఆస్పత్రిలో సాధారణ చికిత్స పొందుతూ తాత్కాలిక ఉపశమనం పొందుతూ కాలం నెట్టుకొస్తున్నారు. దంతాలకు శాశ్వత చికిత్స పొందలేక పోతున్నారు.

డీడీఎస్‌ను నియమిస్తే..

ఏరియా ఆస్పత్రికి డిప్యూటీ డెంటల్‌ సర్జన్‌(డీడీఎస్‌) పోస్టు భర్తీ అయితే రోగులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా రూట్‌ కెనాల్‌ చికిత్స అందు బాటులోకి వస్తుంది. పళ్లకు క్లిప్‌లు పెట్టడం, దంతాలకు సంబంధించిన మేజర్‌ సర్జరీలు కూడా ఆస్పత్రిలోనే జరుగుతాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి దంతాలకు దెబ్బతగిలితే సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డీడీఎస్‌ పోస్టును భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-12-13T00:16:20+05:30 IST