మొర్రిగుడలో అతిసార

ABN , First Publish Date - 2022-01-22T06:25:22+05:30 IST

మండలంలోని గసభా పంచాయతీ మొర్రిగుడ గ్రామంలో అతిసార ప్రబలింది. పలువురు గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు.

మొర్రిగుడలో అతిసార
ముట్టుజోరులో జ్వరంతో బాధపడుతున్న మత్స్యరాజు

ఒక యువకుడు మృతి

గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు


 డుంబ్రిగుడ, జనవరి 21: మండలంలోని గసభా పంచాయతీ మొర్రిగుడ గ్రామంలో అతిసార ప్రబలింది. పలువురు గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒక వ్యక్తి రెండు క్రితం మృతిచెందాడు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

మొర్రిగుడ గ్రామానికి చెందిన పలువురు ఉపాధి నిమిత్తం రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. వీరిలో కొంతమంది ఇటీవల తిరిగి వచ్చారు. అప్పటి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం వంతల చేనరుకుమార్‌(25) మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్‌ పాంగి సునీత, కిల్లోగుడ పీహెచ్‌సీ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. దీంతో వైద్య శిబ్బంది గ్రామానికి వచ్చి బాధితులకు వైద్య సేవలు అందిచారు. బాధిత కుటుంబాలకు సర్పంచ్‌ సునీత శుక్రవారం బియ్యం పంపిణీ చేశారు. సీపీఎం నాయకులు కిల్లో సురేంద్ర, పోతిరాజు, తదితరులు మొర్రిగుడ వెళ్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ, గిరిజనులకు స్థానికంగా ఉపాధి కల్పించకపోవడం వల్లనే మైదాన ప్రాంతాల్లో కూలి పనులకు వలస వెళుతున్నారని, అక్కడ వాతావరణం సరిపడక  వ్యాధులబారిన పడుతున్నారని అభిప్రాయపడ్డారు. మృతిచెందిన వంతల చేనరుకుమార్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.


గిరి పల్లెల్లో జ్వరాలు

హుకుంపేట, జనవరి 21: మండలంలోని తీగలవలస, తడిగిరి, ముట్టుజోరు పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో గిరిజనులు జ్వరాలతో బాధలు పడుతున్నారు. వైద్యం కోసం ఆరోగ్య కేంద్రాలకు కూడా వెళ్లే ఓపిక కూడా లేదని వాపోతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు   కోరుతున్నారు. 


Updated Date - 2022-01-22T06:25:22+05:30 IST