నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు

ABN , First Publish Date - 2022-12-16T01:17:56+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మండలంలోని ఉపమాక క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు
ఉభయ దేవేరులతో కూడిన శ్రీనివాసుడు

నక్కపల్లి, డిసెంబరు 15: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మండలంలోని ఉపమాక క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఇక్కడ ఏకాంతంగా ఈ వేడుకలను జరిపారు. ఈ ఏడాది ధనుర్మాసోత్సవాలు, తిరువీధి సేవలు యథావిధిగా నిర్వహించుకునేందుకు టీటీడీ నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో ఉత్సవ ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమానుసారం శుక్రవారం సాయంత్రం 6.18 గంటలకు ధనుర్లగ్నంలో నెలగంటతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు గురువారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. నెల రోజుల పాటు ఆలయంలో నిత్య అర్చనలు, హోమాలు పూర్తయిన తరువాత ప్రతి రోజూ ఉదయం వేళ తిరువీధి సేవలు వంటివి జరుపుతామన్నారు.

జనవరి 2 నుంచి అధ్యయనోత్సవాలు

ఇదిలావుంటే, వచ్చే నెల రెండో తేదీ నుంచి పది రోజుల పాటు ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు జరుగుతాయని, ఇందులో భాగంగా రాత్రి వేళల్లో కూడా తిరువీధి సేవలు ఉంటాయని ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు చెప్పారు. 2వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎనిమిది వాహనాలపై తిరువీధి సేవ నేత్రపర్వంగా జరుగుతుందన్నారు. 11వ తేదీ రాత్రి వైకుంఠవాసుని అలంకరణలో పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవ నిర్వహిస్తామన్నారు. 14న భోగిపండుగ సందర్భంగా గోదారంగనాథుడి కల్యాణం స్వామివారి పుష్పతోటలో జరుపుతామని వివరించారు. 15న సంక్రాంతి రోజున శేషతల్ప వాహనంపై తిరువీధి సేవ, 16న కనుమ రోజున రాజాధిరాజ అలంకరణలో గిరి ప్రదక్షిణోత్సవం, బంధుర సరస్సు వద్ద ఉన్న లంకవారి

కల్యాణ మండపం వద్ద కరి, మకరి సంవాదం, తదుపరి తిరువీధి సేవ వంటివి ఉంటాయని వివరించారు. ఈ నెల రోజుల పాటు టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం అన్నమాచార్య సంకీర్తనలు, హరికథలు, పురాణ కాలక్షేపం, కోలాట తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విలేకర్ల సమావేశంలో ఆలయ అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి వెంకట శేషాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:17:58+05:30 IST