స్పందనలో అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా చర్యలు
ABN , First Publish Date - 2022-12-31T01:13:51+05:30 IST
స్పందన కార్యక్రమంలో గిరిజనులు సమర్పించే అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ హెచ్చరించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్పందనలో వచ్చిన వినతులను పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారి ప్రత్యేకంగా ఒకరికి బాధ్యత అప్పగించాలని, దానిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టి బాధ్యతగా పరిష్కరించాలన్నారు.
అధికారులకు కలెక్టర్ సుమిత్‌కుమార్ హెచ్చరిక
వారంలో మూడు రోజులు రంపచోడవరం, చింతూరు డివిజన్లలో పర్యటించాలని ఆదేశం
పాడేరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్పందన కార్యక్రమంలో గిరిజనులు సమర్పించే అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ హెచ్చరించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్పందనలో వచ్చిన వినతులను పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారి ప్రత్యేకంగా ఒకరికి బాధ్యత అప్పగించాలని, దానిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టి బాధ్యతగా పరిష్కరించాలన్నారు. ఒకవేళ అర్జీ పరిష్కారానికి నోచుకోకపోతే, అందుకుగల కారణాన్ని సదరు అర్జీదారునికి కచ్చితంగా తెలియజేయాలన్నారు. అర్జీపై తీసుకున్న చర్యపై ఫొటోతో సహా స్పందన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. కొంతమంది అధికారులు స్పందనలో అందిన వినతులను చూడడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, అటువంటి అధికారులు, ఉద్యోగులపై చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. స్పందనలో అందిన ప్రతి అర్జీని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించి, స్పందన కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ సూచించారు. స్పందనలో పాల్గొన్నాం... అర్జీలు తీసుకున్నాం.. వెళ్లిపోయాం... అన్నట్టు కాకుండా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈపీడీసీఎల్, గిరిజన సంక్షేమ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, రెవెన్యూ శాఖలు తమకు సంబంధించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే స్పందన అర్జీలపై ఆయా శాఖలకు చెందిన అధికారులు చేపడుతున్న చర్యలపై జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు.
రంపచోడవరం, చింతూరు ప్రాంతాల్లో పర్యటించాలి....
ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రతి అధికారి జనవరి నుంచి జిల్లాలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో విధిగా పర్యటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. వారానికి రెండు రోజులు రంపచోడవరం డివిజన్‌లో, ఒకరోజు చింతూరు డివిజన్‌లో కచ్చితంగా పర్యటించాలన్నారు. ఈ క్రమంలో ఆయా ఐటీడీఏల పీవోలను కలవాలని, మండలస్థాయి కార్యాలయాలను సందర్శించి, కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. జనవరి ఒకటి నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు విధిగా ఫేషియల్ అటెండెన్స్ (ముఖ హాజరు) వేయాలని, ఈ మేరకు సంబధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల ఆయన చెప్పారు. కాగా స్పందన కార్యక్రమంలో ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 46 వినతులను అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జె.శివశ్రీనివాసు, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.