దసరా కిక్‌

ABN , First Publish Date - 2022-10-07T06:16:56+05:30 IST

దసరా పండుగ సందర్భంగా నగరంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.

దసరా కిక్‌
అక్కయ్యపాలెం ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం వద్ద జనం

పండక్కి నగరంలో రూ.15 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు

గత ఏడాది కంటే రూ.2 కోట్లు అధికం

రూ.20 కోట్ల వరకు మాంసం విక్రయాలు


విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):


దసరా పండుగ సందర్భంగా నగరంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. నగరంలో గల రెండు డిపోల పరిధిలో కలిపి రూ.15 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. రెండు లిక్కర్‌ డిపోల పరిధిలో 136 మద్యం దుకాణాలు, 120 వరకు బార్లు ఉన్నాయి. ఈ ఏడాది ఆదివారం నుంచే దసరా ఊపు కనిపించింది. చివరగా పండుగ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు షాపుల ముందు మందుబాబులు క్యూకట్టారు. అలాగే బార్లు కూడా సందడిగా కనిపించాయి. గత ఏడాది దసరాకు సుమారు రూ.13 కోట్లు విక్రయాలు జరగ్గా, ప్రస్తుత ఏడాది మరో రూ.రెండు కోట్లు అదనంగా జరిగినట్టు చెబుతున్నారు. కాగా ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి కొందరు పదుల సంఖ్యలో బాటిల్స్‌ ముందుగానే కొనుగోలు చేసి వీధులు, చిన్నపాటి దుకాణాల్లో బాటిల్‌పై రూ.50 వేసుకుని అమ్మకాలు సాగించారు.


రూ.20 కోట్ల మాంసం విక్రయాలు

దసరా అనగానే ఎక్కువ మంది గొర్రె, మేక మాంసం వైపు మొగ్గు చూపుతుంటారు. బుధవారం నగరంలో సుమారు రూ.20 కోట్ల మేర మాంసం వ్యాపారం సాగినట్టు అంచనా. మాంసం దుకాణాలతోపాటు పరిశ్రమలు, ఆటో/లారీ/మినీ వ్యాన్ల స్టాండ్లు, కలాసీలు, భవన నిర్మాణ మేస్త్రీలు పెద్దఎత్తున మేకలు, గొర్రెలు కోశారు. గొర్రెల వ్యాపారుల అంచనా మేరకు నగరం, పరిసరాల్లో మొత్తం రెండున్నర లక్షల కిలోల మాంసం అమ్మకాలు సాగాయి. సుమారు రూ.20 కోట్ల వ్యాపారం జరిగిందని కరీం బాషా అనే వ్యాపారి తెలిపారు. దసరా కోసం వ్యాపారులు వారం నుంచి ఉత్తరాంధ్రలో పలు సంతలు, పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి గొర్రెలు, మేకలు కొని నగరానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాగా నగరంలో మాంసం వ్యాపారులు పండుగ  పేరిట ఏటా కిలోపై రూ.50 వరకు పెంచుతుంటారు. పెంచిన రేటు ఆ తరువాత తగ్గించరు. కాగా దసరా సందర్భంగా నగరంలో చికెన్‌ అమ్మకాలు పెద్దగా పెరగలేదని, గ్రామీణ ప్రాంతంలో మాత్రం బాగున్నాయని చికెన్‌ వ్యాపారులు చెబుతున్నారు.

Read more