క్రషర్ల కాలుష్యం

ABN , First Publish Date - 2022-12-10T01:11:28+05:30 IST

అనకాపల్లి మండలంలోని కూండ్రం, కుంచంగి, వేటజంగాలపాలెం గ్రామాల్లో పలు స్టోన్‌ క్రషర్ల నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుతున్నారు.

క్రషర్ల కాలుష్యం
వేటజంగాలపాలెంలో క్రషర్‌ నుంచి ఎగిసిపడుతున్న దమ్ము

స్టోర్‌ క్రషర్లలో నిబంధనలకు తూట్లు

ఎగిసి పడుతున్న దుమ్ము, ధూళి

ఇళ్లు, పంటలు, చెట్లు, రోడ్లు... అన్నింటినీ కప్పేస్తున్న బూడిద

రోగాలపాలవుతున్న జనం

పంటలు పండక, నిస్సారంగా మారుతున్న భూములు

పట్టించుకోని అధికారులు

కొత్తూరు (అనకాపల్లి), డిసెంబరు 9: అనకాపల్లి మండలంలోని కూండ్రం, కుంచంగి, వేటజంగాలపాలెం గ్రామాల్లో పలు స్టోన్‌ క్రషర్ల నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుతున్నారు. క్రషర్ల నుంచి దుమ్ము, ధూళి ఎగిసి, చుట్టు పక్కల నివాసాలు, పంట పొలాలు, తోటలను కప్పేస్తున్నాయి. రోడ్లపై మెత్తటి బూడిద పేరుకుపోయి, వాహనాల రాకపోకలతో గాలిలోకి లేస్తున్నది. క్రషర్ల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా శ్వాససంబంధ వ్యాధులబారిన పడుతున్నట్టు సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పంటలు సరిగా పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం పంచాయతీ పరిధిలో నాలుగు స్టోన్‌ క్రషర్లు వున్నాయి. వీటిల్లో ఒక్క క్రషర్‌ కూడా నిబంధనలు పాటించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు స్టోన్‌ క్రషర్లు పనిచేయాలి. కానీ ఇక్కడ 24 గంటలూ క్రషిర్లు నడుస్తున్నాయి. క్రషర్ల నుంచి దుమ్ము, ధూళి బయటకు రాకుండా చుట్టూ 30 అడుగుల ఎత్తు మేర గోడ/ వెదురు లేదా తాటాలకు తడిక/ గోనె పరదా ఏర్పాటుచేయాలి. కానీ ఇక్కడ వున్న క్రషర్లలో ఒక్కడానికి కూడా ఏర్పాటు చేయలేదు. క్రషర్లు పనిచేసేటప్పుడు దుమ్ము ఎగరకుండా స్ర్పింక్లర్లతో నీటిని చిమ్ముతుండాలి. అటువంటివి ఏవీ ఇక్కడ కనిపించవు. దీంతో క్రషర్ల నుంచి నిరంతరాయంగా దుమ్ము, ధూళి ఎగిసి పడుతున్నది. కేబీ రోడ్డు పక్కనే ఈ క్రషర్లు వుండడం, వీటి నుంచి వచ్చే బూడిద కారణంగా వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దారి సరిగా కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు.

కాగా క్రషర్ల సమీపంలో వున్న గ్రామాల్లోని ఇళ్లు, చెట్లు, పంటలు, తోటలపై తెల్లటి బూడిద పేరుకుపోతున్నది. ఇళ్లల్లోకి కూడా తెల్లటి దుమ్ము వస్తున్నదని, వస్తువులపై పేరుకుపోతున్నదని వేటజంగాలపాలెం, కుంచంగి, కూండ్రం గ్రామాల ప్రజలు చెబుతున్నారు. క్రషర్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళిని గాలితోపాటు పీల్చడం వద్ద శ్వాససంబంధ వ్యాధుల బారిన పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా క్రషర్ల నుంచి వచ్చే బూడిద వల్ల పంటలు పరిగా పండడంలేదని, వ్యవసాయ భూములు నిస్సారంగా మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి, నిబంధనలు పాటించకుండా, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న క్రషర్లను మూసివేయాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-12-10T01:12:03+05:30 IST