కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2022-01-22T06:26:15+05:30 IST

జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.

కరోనా కల్లోలం
మూసివేసిన ఎంజీఎం పాఠశాల

జిల్లాలో వరుసగా రెండో రోజు రెండు వేలకుపైగా కేసులు నమోదు

2,244 మందికి పాజిటివ్‌

- చికిత్స పొందుతూ ముగ్గురి మృతి

1,123కు చేరిన మరణాలు

వైరస్‌ బారిన వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌, ఐటీడీఏ పీవో


విశాఖపట్నం, జనవరి 21: జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. శుక్రవారం 5,634 మందికి పరీక్షలు నిర్వహించగా 2,244 మంది (39.83 శాతం పాజిటివిటీ)కి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,73,894కు చేరింది. ఇందులో 1,59,751 మంది కోలుకోగా, మరో 13,020 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే జిల్లాలో నెమ్మదిగా కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయి. సెకండ్‌వేవ్‌లో మాదిరిగా ప్రతిరోజూ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,123కు చేరింది. 


హెచ్‌ఎం సహా ఐదుగురు టీచర్లకు పాజిటివ్‌

అల్లిపురం: జీవీఎంసీ 33వ వార్డు పరిధిలోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ పాఠశాల (ఎంజీఎం)లో కరోనా కలకలం రేపింది. పాఠశాల హెచ్‌ఎం సోమవారం కొవిడ్‌ బారినపడ్డారు. ఆ తర్వాత వరుసగా నాలుగు రోజుల్లో మరో నలుగురు ఉపాధ్యాయులకు వైరస్‌ సోకింది. దీంతో డీఈవో ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపి పాఠశాలకు తాళం వేశారు. అయితే ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఈ ఐదు రోజుల్లో ఎంతమంది విద్యార్థులు వైరస్‌ బారినపడ్డారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్‌ఎంకు పాజిటివ్‌ అని తేలిన వెంటనే పాఠశాల మూసివేసి వుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాఠశాల తెరిచేది, లేనిదీ అధికారులు ప్రకటించకున్నా తమ పిల్లలను మాత్రం పాఠశాలకు పంపేది లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌కు కరోనా పాజిటివ్‌

వెంకోజీపాలెం: వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల కొవిడ్‌ బారినపడ్డారు. శుక్రవారం ఆమె పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


ఐటీడీఏ పీవోకు...

హోమ్‌ ఐసోలేషన్‌లో గోపాలక్రిష్ణ

పాడేరు: స్థానిక ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. గురువారం ఆయన జీకేవీధి మండల పర్యటనకు వెళ్లారు. తిరిగి పాడేరు చేరుకున్న తర్వాత జ్వరంతోపాటు నీరసంగా వుండడంతో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.కృష్ణారావుతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా ఏజెన్సీలో శుక్రవారం 56 మంది వైరస్‌ బారిన పడ్డారని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ తెలిపారు. హుకుంపేట మండలంలో 33, పాడేరులో 13, అనంతగిరిలో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరిలో ఏడుగురు ఆస్పత్రుల్లో, మిగిలినవారు హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందున్నట్టు  తెలిపారు.


రావికమతం తహసీల్దార్‌ కార్యాలయంలో 10 మందికి...

రావికమతం, జనవరి 21: రావికమతంలో కరోనా కలకలం రేపింది. శుక్రవారం వచ్చిన 21 మందికి కొవిడ్‌ సోకగా, వారిలో తహసీల్దార్‌ కార్యాలయం ఉద్యోగులు పది మంది ఉన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌తో పాటు సర్వేయర్లు, వీఆర్వోలు కలిపి మొత్తం పది మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరంతా హోం ఐసోలేషన్‌ ఉన్నారు. అలాగే మరుపాక మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కూడా కరోనా బారినపడ్డారు. ప్రిన్సిపాల్‌ సహా కొవిడ్‌ వచ్చిన కొందరు ఉద్యోగులు సెలవులో వున్నట్టు సమాచారం.


కేజీహెచ్‌లో కలకలం...

145 మందికి పాజిటివ్‌

45 మంది వైద్యులు, 68 మంది నర్సులు, మిగిలినవారు పారా మెడికల్‌ సిబ్బంది


మహారాణిపేట, జనవరి 21: ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రిగా పేరొందిన కేజీహెచ్‌లో గడచిన వారం రోజుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది మొత్తం 145 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 45 మంది వైద్యులు, 68 మంది నర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. మిగిలినవారు వివిధ విభాగాలకు చెందిన పారా మెడికల్‌ సిబ్బంది. అందరూ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒక్కసారిగా ఇంతమంది వైరస్‌ బారినపడడంతో రోగులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 185 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2022-01-22T06:26:15+05:30 IST