పెద్దపులి కోసం కొనసా...తున్న గాలింపు

ABN , First Publish Date - 2022-07-06T06:20:38+05:30 IST

పెద్దపులి కోసం కొనసా...తున్న గాలింపు

పెద్దపులి కోసం కొనసా...తున్న గాలింపు
పెదమల్లాం ప్రజలతో మాట్లాడుతున్న అటవీశాఖ అధికారులు

గొల్లలపాలెం రిజర్వు ఫారెస్టులోకి ప్రవేశించినట్టు అనుమానం

అటవీ సమీప గ్రామాల్లో గస్తీ ముమ్మరం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా


కశింకోట, జూలై 5: గత మూడు రోజుల నుంచి పండూరు, గొబ్బూరు రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలో మకాం వేసిన పెద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ఆయా గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసి, సచివాలయాల వద్ద పోస్టర్లు అతికించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గొబ్బూరు, పండూరు రిజర్వు ఫారెస్టును ఆనుకొని ఉన్న గొబ్బూరు, గైతలపాలెం, నర్సింగబిల్లి, తాళ్ళపాలెం, జి.భీమవరం, అడ్డాం, లాలంకొత్తూరు, సుందరయ్యపేట, సరకాం, తీడ, కన్నూరుపాలెం, రాజుపేట, శెట్టిపాలెం, జెడ్‌.గంగవరం, భీమబోయినపాలెం గ్రామాల్లో పర్యటించారు. గ్రామాలను సందర్శించారు. పులి కనిపించినా, దాని పాదముద్రలు గుర్తించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. పులి సంచారంపై సోషల్‌ మీడియాలో పెడుతున్న నకిలీ వీడియోలను నమ్మవద్దని సూచించారు. 

కాగా తాళ్లపాలెం, జమాదులపాలెం, చిన్నమల్లాం, పెదమల్లాం, కొత్తఅచ్చెర్ల, సింగవరం, గోకివానిపాలెం, ఆర్‌.శివరాంపురం, చినభీమవరం, ఆర్‌.భీమవరం, విసన్నపేట, పరవాడపాలెం, ఉగ్గినపాలెం, పడమటమ్మలోవ, కూండ్రం, సంపతిపురం, సుందరయ్యపేట గ్రామాల్లో ఫారెస్టు అధికారులు గస్తీ నిర్వహించారు. పులి ఏ ప్రాంతంలో సంచరిస్తున్నదో కచ్చితమైన సమాచారం రాలేదని అనకాపల్లి ఫారెస్టు అధికారి కూండ్రపు కాళీ ప్రసాద్‌ తెలిపారు. 


గొల్లలపాలెం రిజర్వు ఫారెస్టులోకి పెద్దపులి!

రావికమతం, జూలై 5: గత ఐదు రోజులుగా కోటవురట్ల, ఎలమంచిలి, కశింకోట మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి... రావికమతం మండలం గొల్లలపాలెం రిజర్వు ఫారెస్ట్‌లోకి ప్రవేశించి వుంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో కశింకోట మండలానికి అనుకుని వున్న తట్టబంద, బలిజపాలెం, పొర్లుపాలెం, కశిరెడ్డిపాలెం, తోటకూరపాలెం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు దండోరా వేయించారు. ఊరుబయట కల్లాల వద్ద పశువులను ఉంచొద్దని, రాత్రి సమయంలో ఆరుబయట సంచరించవద్దని సూచించారు. అడవులు, కొండప్రాంతాల్లో బుధవారం 11 మందితో గాలింపు చర్యలు చేపడతామని చోడవరం రేంజ్‌ అధికారి రామనరేష్‌ బిర్లంగి తెలిపారు.


Updated Date - 2022-07-06T06:20:38+05:30 IST