నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలి
ABN , First Publish Date - 2022-10-07T06:05:37+05:30 IST
సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని మండల అధికారులకు జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశం
చోడవరం, అక్టోబరు 6: సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని మండల అధికారులకు జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మండలంలోని గౌరీపట్నం, నరసయ్యపేట పంచాయతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గౌరీపట్నంలో నిర్మాణం పూర్తయిన గ్రామ సచివాలయ భవనాన్ని పరిశీలించి, స్థానిక నాయకుడు కోన చంద్రరావును అభినందించారు. అనంతరం సచివాలయం పక్కనే ఉన్న రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణం కూడా పూర్తిచేయాలని సూచించారు. అయితే తనకు ఇంకా రూ.40లక్షలకు పైగా బిల్లులు రావలసి ఉందని, అవి మంజూరయ్యేలా చూడాలని చంద్రరావు కలెక్టర్‌ను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల పనితీరును కలెక్టర్ సమీక్షించారు. సచివాలయ ఉద్యోగులంతా తప్పనిసరిగా కార్యాలయానికి హాజరుకావాలని, సమయపాలన పాటించాలని స్పష్టంచేశారు. అనంతరం నరసయ్యపేట పంచాయతీలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్ బి. తిరుమలబాబు, ఎంపీడీవో ఎస్‌డీ .శ్యాంసుందర్, పీఆర్ డీఈఈ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.