హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై ఆందోళన

ABN , First Publish Date - 2022-07-06T06:09:36+05:30 IST

యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాలను ప్రభుత్వం విరమించుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు.

హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై ఆందోళన
చింతపల్లిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ఆదివాసీలు, గిరిజన సంఘం నాయకులు

నిర్మాణాన్ని విరమించుకోవాలని డిమాండ్‌

ఆదివాసీల భారీ ర్యాలీ


చింతపల్లి, జూలై 5: యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాలను ప్రభుత్వం విరమించుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. మంగళవారం కొయ్యూరు, చింతపల్లి మండలాల సరిహద్దు నిర్వాసిత గ్రామాల ఆదివాసీలతో గిరిజన సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తాము హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్నారు. యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వల్ల 32 గిరిజన గ్రామాలు ముంపునకు గురికావాల్సి వస్తుందన్నారు. వేల సంఖ్యలో గిరిజనులు నిరాశ్రయులు అవుతారన్నారు. కట్టుకున్న గృహాలు, వ్యవసాయ భూములను విడిచిపెట్టి దయనీయ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. భీమవరం సభలో అల్లూరి నడయాడిన గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ మరోవైపు ఆదివాసీ గ్రామాలను ముంపునకు గురిచేసే హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి గత ఏడాది డిసెంబర్‌ 21న పర్యావరణ, అటవీశాఖ అనుమతులు మంజూరుచేశారన్నారు. దీన్ని స్థానిక ఆదివాసీలు, గిరిజన సంఘాల నాయకులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కేంద్రం మంజూరుచేసిన అనుమతులను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుని అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు. 


ఆదివాసీలను ముంచుతారా?

పాడేరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించుకున్న పాపానికి హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పేరిట ఆదివాసీలను ముంచుతారా? అని అప్పల నర్స ప్రశ్నించారు. ఆదివాసీలను సంప్రతించకుండగా 32 గ్రామాలను ముంచే హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఆదివాసీల అభివృద్ధిపై లేదని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో అటవీ హక్కుల చట్టం అమలు, పాఠశాలల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, తాగు, సాగు నీరు, శివారు గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పనను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చినయ్య పడాల్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్‌, మండల కార్యదర్శి సాగిన చిరంజీవి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉల్లి సత్యనారాయణ, బేరా సత్యనారాయణ, అధిక సంఖ్యలో ఆదివాసీలు హాజయ్యారు. 


Updated Date - 2022-07-06T06:09:36+05:30 IST