రంగు పడుతోంది

ABN , First Publish Date - 2022-04-10T06:42:34+05:30 IST

కళ్లకు ఇంపుగా కనిపిస్తున్నాయని, రుచిగా ఉంటున్నాయని బయట ఆహార పదార్థాలను లొట్టలేసుకుంటూ తింటున్నారా?...అయితే మీరు జాగ్రత్త పడాల్సిందేనని వైద్యులు, ఆహార భద్రతా అధికారులు అంటున్నారు.

రంగు పడుతోంది

నిషేధించినవి కూడా వాడేస్తున్నారు

కేన్సర్‌, గుండెజబ్బులు, జీర్ణ సంబంధ వ్యాధులు బారినపడే ప్రమాదం

పిల్లల్లో ఊబకాయం

రోజుల తరబడి నిల్వ ఉన్న ఆహారం కూడా వేడి చేసి విక్రయం

తనిఖీలు మరచిన ఆహార భద్రత అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


కళ్లకు ఇంపుగా కనిపిస్తున్నాయని, రుచిగా ఉంటున్నాయని బయట ఆహార పదార్థాలను లొట్టలేసుకుంటూ తింటున్నారా?...అయితే మీరు జాగ్రత్త పడాల్సిందేనని వైద్యులు, ఆహార భద్రతా అధికారులు అంటున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలతో కూడిన రంగులను వినియోగిస్తున్నారని, వాటిని తింటే దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు. 

విజయనగరంలో ఓ పానీ పూరి సెంటర్‌ నిర్వాహకుడు..ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలను వినియోగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సదరు వ్యక్తికి పది వేల జరిమానా, మూడు నెలల కారాగార శిక్షను విధించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నగర పరిధిలో ఏడు వేలు, గ్రామీణ జిల్లాలో మరో మూడు వేల వరకు ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌ ద్వారా పానీపూరీ, న్యూడిల్స్‌, చాట్‌ వంటివి   విక్రయిస్తున్నారు. వీరిలో కొందరు...వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆహార పదార్థాల్లో రసాయనాలను వినియోగిస్తున్నారు. ఈ తరహా రసాయనాలు కలిపిన ఆహార పదార్థాలు రుచికరంగా వుండడంతో మళ్లీ మళ్లీ ఆయా సెంటర్లకు వినియోగదారులు వెళుతుంటారు.


హాని కలిగించే రసాయనాలు.. 

ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌లో ఎక్కువగా వినియోగించే  పదార్థాల జాబితాలో టేస్టింగ్‌ సాల్ట్‌ ముందువరుసలో ఉంటుంది. ఇందులో వుండే సోడియం గ్లోటామేట్‌ వేగంగా ఊబకాయం బారినపడేందుకు దోహదం చేస్తుంది. అదే విధంగా చికెన్‌/మటన్‌ బిర్యానీ వంటి వాటిల్లో నిషిద్ధమైన రొడామిన్‌-బి, మెటానిల్‌ ఎల్లో వంటి రంగులను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో కేన్సర్‌ వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది. కొందరికి వెంటనే అలర్జీ, గ్యాస్ర్టిక్‌ ఇరిటేషన్స్‌, జాండీస్‌ వంటివి కూడా రావచ్చు. ఎక్కువ రుచిని కలిగించేందుకు వినియోగించే అజనోమోటో, కొన్నిరకాల ఫ్యాటీ ఆసిడ్స్‌ వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, కేన్సర్ల బారినపడే అవకాశముంది. కొందరిలో గుండె జబ్బులు, మధుమేహం, విద్యార్థుల్లో ఒబెసిటీకి ఈ రసాయనాలు కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. 


ఇష్టానుసారంగా వినియోగం.. 

జిల్లావ్యాప్తంగా పలు ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌, హోటళ్లలో ఈ హానికర రసాయనాలను కలిపిన రంగులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీంతోపాటు రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజులు తరబడి నిల్వ వుంచిన చికెన్‌, మటన్‌ వంటకాలను వినియోగదారులకు వేడి చేసి అందిస్తున్నారు. దీనివల్ల విరేచనాలు, ఇరిటేషన్‌ వంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటిపై పర్యవేక్షణ కొరవడింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన ఆహార భద్రత ప్రమాణాలు అధికారులు..ఎప్పుడో గానీ వాటిపై దృష్టి సారించడం లేదు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మేల్కొనాలి.


ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్స్‌పై ప్రత్యేక దృష్టి

- నందాజీ, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌

ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాం.  ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సిబ్బందిని ఆదేశించాం. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు ఆహార పదార్థాల్లో వినియోగించడం నిషిద్ధం. ఆ రంగుల గురించి ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు నిర్వాహకులు, హోటల్స్‌ నిర్వాహకులు తెలియజేశాం. అటువంటివి వాడుతున్నట్టు తనిఖీల్లో తేలినా, ఎవరైనా ఫిర్యాదు చేసినా...నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతులు కూడా తీసుకోవాలి. 


దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదం

- డాక్టర్‌ వైజీ జ్ఞానసుందరరాజు,

జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి, కేజీహెచ్‌

ఆహార పదార్థాల్లో కొన్నిరకాల రంగులను వినియోగిస్తుంటారు. వాటి వల్ల ఆయా ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా వుండడంతోపాటు రుచికరంగానూ ఉంటాయి. అయితే అటువంటి వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. స్వల్పకాలంలో అలర్జీ, జాండీస్‌, గ్యాస్ర్టిక్‌ ఇరిటేషన్‌, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలంలో కొన్నిరకాల కేన్సర్లు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. 

Read more